పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ఘనముగ నేర్చితి సంవి, జ్జనకంబై మనసు సుప్రసన్నతఁ బొదలెన్.[1]

3


తే.

ఇంక నొక్కటి యడుగంగ నిచ్చపుట్టె, నాకు నీకంటె నుత్తమశ్లోకు లొరులు
లేరు గావున నడుగంగలేను దగిన, యుత్తరంబులు నాకు నీనోప రొరులు.

4

మైత్రేయుండు పరాశరమునివరునిఁ గూర్చి కొన్నిప్రశ్నలు వేయుట

సీ.

ఏవేల్పు మూలమై యెల్లలోకంబుల వరిల్లు నేవేల్పు వాసవాది
సురులకు నొడయఁడై శోభిల్లు నేవేల్పుచేత భక్తులకోర్కి సిద్ధిఁ బొందు
నేవేల్పు సచరాచరావళియం దుండు నేవేల్పు సకలయోగీంద్రవినుతుఁ
డేవేల్పు వేదంబు లెల్లను దానయై కనుపట్టు నేవేల్పుకథలు విన్న


తే.

నిహపరోన్నతసౌఖ్యంబులెల్ల నాకుఁ, గలుగు నేవేల్పు విజ్ఞానకారణంబు
భువన మేవేల్పుమూలమై పుట్టు నడఁగు, నట్టి వేలుపుమహిమ నా కానతిమ్ము.[2]

5


వ.

మఱియు పృథివ్యాదిభూతప్రమాణంబులు, సప్తసాగరవిస్తారంబులు సప్తద్వీప
ప్రకారంబు, సప్తకులాచలసంస్థానంబులు, సప్తాశ్వప్రముఖగ్రహతారకాసంచా
రంబులు, దేవాదిచతుర్విధభూతనిర్మాణంబు, చతుర్దశమన్వంతరప్రమాణంబులు,
చతుర్యుగప్రమాణంబులును, కల్పకల్పవిభాగంబులు, యుగధర్మంబులు, దేవర్షి
చరితంబులు, రాజవంశానుకీర్తనంబు, వేదశాఖాప్రమాణంబులు, బ్రాహ్మణాది
వర్ణధర్మంబులు, బ్రహ్మచర్యాదిచతురాశ్రమక్రమంబులు మొదలుగా నఖిలంబును
వినవలతు నానతిమ్మని యడిగినం బరాశరుండు పరమానందహృదయుండై
యిట్లనియె.[3]

6


క.

నను నీ వడిగినయర్థము, వినిపింపందగినమతి వివేకము నాకున్
బనుపడి యున్నది పూర్వం, బున నది దలఁపింప నెఱుక పొడమెను నీచేన్.[4]

7

శ్రీపరాశరునకు సకలపురాణకర్తృత్వము గలిగిన ప్రకారము

మ.

విను మైత్రేయ మదీయశైశవకథావృత్తాంత మంభోరుహా
సనపుత్రుండు జగన్నుతుం డగుపులస్త్యబ్రహ్మ యేతెంచి మ
న్నన లేపారఁగ నన్నుఁ గన్గోని పురాణశ్రేణికిం గర్త వీ
వని నాకున్ వర మిచ్చి పోయెఁ బ్రమదవ్యాపార మేపారఁగన్.[5]

8
  1. ప్రసాదము = అనుగ్రహము, సంవిజ్ఞానకంబు = జ్ఞానమునకు జన్మస్థానము, ప్రసన్నత = తేటదనముచేత, పొదలెన్ = ఆతిశయించెను.
  2. మూలము = ఆదికారణము, ఒడయఁడు = ప్రభువు, కనుపట్టున్ = కానఁబడును, భువనము = లోకము, అడఁగున్ = నశించును.
  3. సప్తాశ్వప్రముఖ = సూర్యుఁడు మొదలుగాఁగల, దేవాదిచతుర్విధభూతనిర్మాణంబు = దేవతలు మనుష్యులు తిర్యక్కులు స్థావరములు ననెడు నాలుగువిధములైన భూతములయొక్క సృష్టి, వినవలతును = వినఁగోరెదను.
  4. అర్థము = విషయము, పనుపడి = అభ్యస్తమై.
  5. అంభోరుహాసనపుత్రుఁడు = బ్రహ్మకొడుకు, ప్రమదవ్యాపారము = సంతోషవృత్తి.