పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/379

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నాదరించి నీ కింతేల యమ్ము వగవ, నేను గలుగంగ నీవిభు నిపుడె తెత్తు.

161


క.

ఏడెనిమిదిదినముల నీ, రేడుజగంబులను వ్రాసి యిచ్చెద నీకున్
జూడుము చిత్రపటములోఁ, బ్రోడండై నిన్నుఁ బొంది పోయినవానిన్.

162


చ.

అతనిఁ దెచ్చి నీకుఁ బ్రియమారఁగఁ బెండిలి యేను జేసెదన్
బ్రీతి వసింప నుండుమని పెంపునఁ జిత్రపటంబునందు వి
ఖ్యాతిగ మూఁడులోకములఁ గల్గినయట్టిమహానుభావులన్
భ్రాతిగ వ్రాసి కొమ్మనుచు బాణతనూభవచేతి కిచ్చినన్.[1]

163


వ.

ఉషాకన్యయు స్వర్గపాతాళలోకంబులం దనమనోహరుం గానక భూలోకం బవ
లోకించుచు ద్వారకాపురంబుఁ బరికించి యందు ననిరుద్ధుం గనుంగొని లజ్జావనత
వదనయును బులకాంకురదంతురితశరీరయు నై చిత్రరేఖకు నతనిం జూపిన
నమ్మాయలాఁడి యక్కుమారునిం జొక్కుపెట్టి తెచ్చుతలంపున ద్వారకానగ
రంబునకుం జని యంతఃపురంబున నంగనాజనపరివృతుండయి నిద్రించుచున్న
యక్కుమారుం దెచ్చి చెలికిఁ గానుకగా నిచ్చె అప్పు డుష యనిరుద్ధునియందు
సురతసౌఖ్యంబులు సలిపి కొన్నాళ్లు చనిన పిదప.[2]

164


క.

కన్యాంతఃపురములలో, నన్యపురుషుఁ డుంట యెఱిఁగి యసురేశుఁడు లో
కన్యాయము దప్పిన నిజ, సైన్యంబులతోడ వచ్చి సమరము సేయన్.

165


మ.

అనిరుద్ధుం డతిఘోరదర్పమున దైత్యశ్రేణిపై ఖేటకం
బులు వాలుం గొనివచ్చి పెల్లడిరి యార్పుల్ నింగిముట్టంగఁ ద
ద్ఘనసైన్యంబులనెల్ల నేలఁ గలిపెన్ గల్పాంతకాలాగ్ని కా
ననభూముల్ దహియించుచందమున నానాచిత్రయుద్ధంబులన్.[3]

166


క.

అప్పుడు బాణుఁడు కన్నుల, నిప్పులు రాలంగ నతని నిశితాస్త్రములన్
నొప్పించి వేఁడి కోపము, ముప్పిరి గొన నాగపాశముల బంధించెన్.

167


తే.

అట్లు బంధించి కారాగృహంబునందుఁ, గూఁతుతోఁగూడ యాదవకులజు నునిచి
రాక్షసులను బెక్కండ్రను రాకుమారుఁ, మీఁదఁ బైకావలుంచి సోమించియుండె.[4]

168


వ.

అంత నొక్కనాడు నారదుండు కృష్ణునిపాలికిం బోయి.

169


సీ.

కరుణతో నచలేంద్రకన్యక యుషతోడఁ బలికినవిధమును బాణపుత్రి
కలలోన ననిరుద్ధుఁ గలిసినచందంబుఁ జిత్రపటంబునఁ జిత్రరేఖ
లోకంబు లెల్ల నాలోకింపఁజేయుటయును దైత్యతనయ ప్రద్యుమ్నతనయుఁ
జూపినఁ గుంభాండుసుత వానిఁ గొనివచ్చునప్పుడు దన కెదురైనక్రమము

  1. బ్రాఁతిగన్ = ప్రియముగా, కొమ్ము = తీసికొనుము.
  2. చొక్కుపెట్టి = దేహము తెలియకుండునట్లు చేసి, చెలికిన్ = స్నేహితురాలికి.
  3. ఖేటకము = డాలువాఱు, వాలు = ఖడ్గము, ఆర్పులు = సింహనాదములు.
  4. సోమించి = తృప్తినొంది.