పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/378

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వాలినబాహుగర్వమున వైరములేని రమావిభూతితోన్.[1]

150


ఆ.

ఇ ట్లనేకకాల మేపున రాజ్యంబు, చేసి కడుమదించి యాసురారి
యుద్ధ మాత్మఁగోరి యొకనాడు పార్వతీ, విభునికడకు నేగి విన్నవించె.

151


ఉ.

చేతులు వేయు నాకుఁ గృపచేసితి బాహుబలంబు భీకరా
రాతులమీఁదఁ జూపి సమరంబులలో జయలక్ష్మిఁ బొందు పు
ణ్యాతిశయంబు లేదు త్రిపురాంతక మన్ననతోడ నింక నా
చేతులతీఁట వో రణము సేయఁగ నాకు ననుగ్రహింపవే.

152


చ.

అనవుడు నవ్వి శంభుఁడు సురారికి నిట్లను నీమయూరకే
తనము ధరిత్రిపైఁ బడిన దానవనాయక నీకుఁ బ్రీతిగా
ఘనతర మైనసంగరము గల్గెడు పొమ్మని పల్కినన్ ముదం
బునఁ దనమందిరంబునకుఁ బోయి నిజాంకముఁ జూచు నత్తఱిన్.[2]

153


ఆ.

అనఘ యేమి చెప్ప నమ్మయూరధ్వజ, మవనిమీఁదఁ గూలె నప్పురమునఁ
గలిగె సమరసూచకంబు లనేకముల్, బాణుఁ డాత్మలోనఁ బరిణమింప.[3]

154


తే.

అంత నొకనాడు సంతోష మావహిల్లఁ, బార్వతీపరమేశ్వరుల్ బహువిధముల
దనుజకన్యలు నప్సరాంగనలుఁ గొలువ, నుపవనక్రీడ సలుపుచునున్నవేళ.

155


క.

బాణునిసుత యుష దనకున్, బ్రాణేశుఁడు లేమి దుఃఖపరవశ యగుచున్
రాణ చెడియుండఁ గని య, య్యేణాక్షిం జూచి గౌరి యిట్లని పలికెన్. [4]

156


వ.

వైశాఖశుక్లపక్షంబున ద్వాదశినాటిరాత్రి కలలోన నెవ్వఁడేని నీసురతసౌఖ్యం
బు లనుభవించు నతండు నీకుఁ బతి యగునని చెప్పె ఉషాకన్యయుఁ దదీయ
వాక్యంబులకు సంతోషించి యుండె నంత.

157


మత్తకోకిల.

గౌరిచెప్పిన నాటి రాత్రి వికాసభాసురమూర్తి యై
మారసన్నిభుఁ డైనయొక్కకుమారచంద్రుఁడు వచ్చి య
న్నీరజాననతోడికూటమి నిల్చి తత్సురతంబులన్
గారవించి యదృశ్యుఁడయ్యెను గన్ను మాయువిధంబునన్.[5]

158


ఉ.

అక్కమలాక్షి, మేలుకని యద్రిజ చెప్పినమాటలన్నియున్
నిక్కములయ్యె నన్నుఁ దననేర్పునఁ బొందిన ప్రాణవల్లభుం
డెక్కడ నున్నవాఁడొ యతఁ డిచ్చటి కేగతి నేగుదెంచునో
యక్కట మూఁగగన్నకల యయ్యెను నాకల యేమి సేయుదున్.

159


క.

అని చింతించుచుఁ జని యొ, య్యన బాణాసురునిమంత్రి యగునాకుంభాం
డునిపుత్రి చిత్రరేఖకు, మనసునగలకోర్కి యెల్ల మానుగఁ జెప్పెన్.

160


తే.

చిత్రరేఖయు బాణునిపుత్రి తనకుఁ, ప్రాణసఖి గాన నయ్యింతిపలుకు లెల్ల

  1. ఆలము = యుద్ధము, డాకకు = పరాక్రమమనకు, జాలి = విచారము, వాలిన = హెచ్చిన.
  2. నిజాంకమున్ = తనటెక్కెమును.
  3. పరిణమింపన్ = కృతార్థత్వము నొందఁగా.
  4. రాణ = ఒప్పిదము.
  5. మారసన్నిభుఁడు = మన్మథునిఁ బోలినవాఁడు.