పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/374

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దివ్యగంధప్రసూనబంధురంబును వికసితకుసుమనిష్యందమకరందపానానందమి
ళిందఝంకారంబును మందమలయానిలప్రకంపితబాలపల్లవశోభితలతానర్తనాభి
రామంబును నైన పాకశాసనునియారామంబు పొడగని యందుఁ గొండొక
సేపు వసియించునప్పుడు.[1]

120


ఉ.

ఆతరళాక్షి గాంచె సమదాళిపరీతము నందనాంతర
ఖ్యాతము కీరకోకిలనికాయనికేతము నాశ్రితామర
వ్రాతము పుష్పసౌరభపరాగసమేతము బాలపల్లవ
ద్యోతము దుగ్ధసాగరపయోవనజాతము పారిజాతమున్.[2]

121


క.

కని సత్యభామ తద్దయు, ననురాగము బొంది యాదవాధీశున కి
ట్లను నీభూరుహ మీనం, దనవనమున కెల్ల భూషణం బయ్యెఁ గదా.

122


తే.

సంతతముఁ గడివోనివాసనలు గలుగు, పారిజాతమహీజపుష్పములు ముడిచి
సఖులు దానును సుఖకేళి సలుపుచున్న, యమరపతిభార్య యెంత భాగ్యవతియొక్కొ.[3]

123


తే.

అమరపతికంటె సకలభోగముల నీవ, యెక్కుడని కొనియాడుదు రెల్లవారు
నట్టి నీపత్నినయ్యు నే నతనికాంతం, బోల లేనైతి నత్యంతభోగములను.

124


సీ.

ద్వారకాపురికి నీపారిజాతముఁ గొని యరిగి మదీయగృహాంగణమున
నుపవనంబులలోన నునిచిన నేను నీకారుణ్యమునఁ జేసి కమలనాభ
యీతరుపుష్పంబు లెలమితోఁ గొనివచ్చి చెలికత్తె లెత్తులు చేసి యొసఁగ
ముడిచి యొక్కొకవేళ ముదముతో నారుక్మిణీమిత్రవిందాదిభామినులకుఁ


తే.

పంపఁగ వారు నాపెంపు సూచి, సిగ్గుపడుచుందు రట్లుగాఁ జేసితేని
యనఘ నీపాల నాకును జనవుగలదు, సవతు లెవ్వరు నాతోడ సవతుగారు.[4]

125

పారిజాతాపహరణము

ఉ.

అనవుడు సత్యభామ పలు కాదరణీయము చేసి దేవకీ
తనయుఁడు పారిజాతవసుధారుహమున్ దనరాజధానికిన్
గొని చనఁబూని యాతరువు కూఁకటివేళ్లకుఁ బెల్లగించి గై
కొని బలమున్ జలంబు నొడఁగూడఁగఁ బోవఁగ నున్నయత్తఱిన్.[5]

126
  1. దివ్యగంధప్రసూనబంధురంబు = మేలైనవాసనగల పువ్వులచేత ఒప్పిదమైనది, నిష్యంద = జాఱుచున్న, మిళంద = తుమ్మెదలయొక్క, బాలపల్లవ = లేతచిగుళ్లచేత.
  2. సమదాళిపరీతము = మదముతో గూడిన తుమ్మెదలచేత ఆవరింపఁబడినది, నికేతము = ఇల్లైనది, పరాగ = పుప్పొడితోడ, బాలపల్లవద్యోతము = లేతచిగుళ్లచేత ప్రకాశించునది, దుర్ధసాగరపయోవనజాతము = పాలసముద్రమునందలి పాలసముదాయమునందు జనించినది.
  3. గడివోని = తఱుఁగని.
  4. అంగణమునన్ = ముంగిటియందు, ఎత్తులు = దండలు, పెంపు = ఆధిక్యము, సవతు = సమానము.
  5. ఆదరణీయము = ఆదరింపఁదగినది, మరుధారుహమున్ = వృక్షమును, కూఁకటివేళ్లకున్ = క్రుంగుడువేళ్లతో.