పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/372

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

తనయుండు తప్పుచేసిన, జనకుఁడు తగుబుద్ధి చెప్పఁ జనుగాక రణం
బున నిట్లు పగతుకైవడి, మనమున దయలేక పిలుకుమార్పం దగునే.[1]

101


వ.

అనిన నవ్విశ్వంభరుండు విశ్వంభర కిట్లనియె.

102


ఉ.

నాదెస భక్తిచాలనిజనంబులు చుట్టము లైన నేమి కం
సాదుల యట్ల చంపుదు మదాప్తచయంబు లలంతులైన ప్ర
హ్లాదవిభీషణాదిసుకృతాత్ములకైవడి నాదరింతు శా
తోదరి పుణ్యశీలుఁడు మహోన్నతిఁ బొందఁడె యేయుగంబులన్.[2]

103


వ.

కావున సకలలోకాపకారి యగునరకాసురుండు వధకు నర్హుండుగాని పుత్ర
స్నేహంబున రక్షింపందగఁడు వీనికై శోకింపఁదగదు నేను భూమిభారం బుడి
గింప మనుష్యరూపంబున నవతరించుట నీ వెఱుంగవే యనిన ధరణి ధరణీధరున
కిట్లనియె.

104


క.

నరకుఁడు చేసినతప్పును పరికింపక వానిసుతుని బహురాజ్యరమా
భరితునిఁగాఁ బాలింపుము, శరణాగతరక్ష యనుచుఁ జాగిలి మ్రొక్కెన్.

105


ఆ.

శౌరి యాధరిత్రి కోరినలాగున, నరకసుతుని రాజ్యభరితుఁ జేసి
నదితికుండలము లమ్మురారాతికి, నిచ్చి యాలతాంగి యేగుటయును.

106

శతాధికషోడశసహస్రకన్యాపరిగ్రహేంద్రలోకగమనాదిశ్రీకృష్ణదివ్యచరితానువర్ణనము

వ.

కృష్ణుండు ప్రాగ్జ్యోతిషపురంబు ప్రవేశించి నరకాసురసంపాదితంబు లైనశతాధి
కషోడశసహస్రకన్యాజనంబులను చతుర్దంతదంతావళంబు లాఱువేలును సర్వల
క్షణసంపన్నంబు లైనకాంభోజహయంబులు రెండువేలును మనోహరంబు లైన
కనకరత్నరాసు లసంఖ్యంబులును నరకకింకరులచేత ద్వారకానగరంబున కనిచి
పుచ్చి.[3]

107


క.

వరుణునిగొడుగును మందర, గిరి మణిశృంగంబు గొనుచు గిరిరిపుఁ జూడన్
హరి యేగె గరుడవాహన, పరిశోభితుఁ డగుచు సత్యభామయుఁ దానున్[4].

108


మ.

చని దేవేంద్రపురోపకంఠమున నాసర్వంసహామండలా
వనకేళీరతుఁ డైనకేశవుఁడు దుర్వారధ్వనుల్ దిక్కు లె
ల్లను భేదింపఁగఁ బాంచజన్య మవలీలన్ బిట్టు పూరించినన్
విని బృందారకవల్లభుండు ప్రమదావిర్భూతచేతస్కుఁడై.[5]

109


క.

కొనిపోయి రత్నసింహా, సనమున నాసీనుఁ జేసి జలజాక్షున క
య్యనిమిషపతి యర్ఘ్యాదులు, తనగురుఁ డగుగురునిచేతఁ దగఁ గల్పించెన్.

110


తే.

ఇట్లు పూజితుఁడై యాదవేశ్వరుండు, తీపు లొలికెడుసరససల్లాపవిధులఁ

  1. పగతుకైవడిన్ = శత్రువువలె, పిలుకుమార్పన్ = చంప.
  2. నాదెసన్ = నాయందు, అలంతులు = అల్పులు.
  3. దంతావళంబులు = ఏనుఁగులు.
  4. గిరిరిపు = ఇంద్రుని.
  5. ఉపకంఠమునన్ = మొగసాలయందు, ప్రమదావిర్భూతచేతస్కుఁడు = సంతోషము పుట్టిన మనసుగలవాఁడు.