పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/371

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


స్ఫురితస్వాంతులు వచ్చి కేశవునితోఁ బోరాడి ద్విడ్భంజనా
చిరచక్రానలవిస్ఫులింగముల భస్మీభూతులై రెంతయున్.[1]

92


వ.

ఇట్లు శతసహస్రబలంబులతోడ నమ్మగలు దెగుటం జూచి.[2]

93


చ.

నరకుఁడు రోషశోకములు నాటినచిత్తముతోడ నుగ్రుఁడై
హరిరథమత్తవారణభటావళితోఁ బటుదైత్యదానవే
శ్వరనికరంబుతో మెఱసి సంగరభూమికి నేగుదెంచి ని
ర్భరగతిఁ దాఁకె శాత్రవధరాధరభంజనజిష్ణుఁ గృష్ణునిన్.[3]

94


వ.

ఇట్లు తాఁకి మహాఘోరయుద్ధంబు చేసి యనేకశస్త్రాస్త్రజాలంబులు జగదాఖిలం
బులుగా బెరసి కురిసినం దెమలక కమలనాభుండును శార్ఙ్గధనుర్విముక్తచండ
కాండపరంపరలచేత నిలింపనిరోధియూథంబులఁ గృతాంతునంతికంబునకు బనిచి.[4]

95


క.

శక్రాదిసురులు పొగడఁగఁ, జక్రధరుఁడు భంజితారిచక్రం బగునా
చక్రంబుఁ బూని రాక్షస, చక్రేశ్వరుశిరము నఱికె సక్రోధమునన్.[5]

96


వ.

అప్పుడు.

97


ఉ.

కాటుకకంట నీరుఁ జనుఁగట్టునఁ బాసినచీరకొంగుఁ బెన్
బీటలతోడి వాతెఱయుఁ బెద్దయుఁ దూలెడుమేను వెన్నుపై
వాటములై నునున్ గురులు వాడినమోమును గల్గి పుత్రశో
కాటవిలోనఁ జిక్కి వసుధాంగన వచ్చె ముకుందుపాలికిన్.[6]

98


వ.

ఇట్లు వచ్చి సాష్టాంగదండప్రణామంబు సేసి గద్దదకంఠంబున.

99


ఉ.

అమ్మదిరాక్షి యిట్లనియె నంబురుహాయతనేత్ర మున్ను నీ
విమ్ముల సూకరాకృతి వహించినకాలమునందు నీప్రసా
దమ్మున నీనిశాటుఁడు ముదమ్మున నా కుదయించె నేడు నీ
విమ్మెయి వీని నేల వధియించితి తప్పు సహింపఁ జెల్లదే.[7]

100
  1. రథేభభటగంధర్వాది = రథములు ఏనుఁగులు కాలుబంట్లు గుఱ్ఱములు మొదలైన, గిరిభేదిప్రతికూలురు = ఇంద్రశత్రువులు - రాక్షసులు, ద్విద్భంజనాచిరచక్రానలవిస్ఫులింగములు = శత్రునాశమునందు ఎడలేనిచక్రాయుధమువలనఁ బుట్టినయగ్నివలని మిడుఁగుఱులచేత.
  2. మగలు = శూరులు, తెగుట = చచ్చుట.
  3. హరి = గుఱ్ఱములు, మత్తవారణ = మదపుటేనుఁగుల, మెఱసి = బయలుబడి, నిర్భరగతిన్ = చలింపనివిధమున, శాత్రవధరాధరభంజనజిష్ణున్ = శత్రువులను కొండలను భంజించుటయందు ఇంద్రుఁడైన.
  4. జగదాభీలంబు = లోకభయంకరము, తెమలక = చలింపక, విముక్త = విడువఁబడిన, చండకాండ = కఱకైనబాణములయొక్క, నిలింపవిరోధియూథంబులన్ = రాక్షససేనలను, కృతాంతునంతికంబునకున్ = యమునియొద్దకు.
  5. భంజితారిచక్రము = భంజింపఁబడిన శత్రుసమూహము గలది, చక్రేశ్వరు = రాజుయొక్క.
  6. వీఁటలతోడి = వీఁటికలతోఁ గూడిన, వాతెఱ = పెదవి, తూలెడు = తేరిపోవునట్టి, వాటములు = జాఱినవి.
  7. ఇమ్ములన్ = ఒప్పిదముగా, ప్రసాదమ్మునన్ = అనుగ్రహముచేత, నిశాటుఁడు = రాక్షసుఁడు, చెల్లదే = తగదా.