పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/370

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

మఱియు సలిలప్రదం బయిన వరుణదేవుని ధవళాతపత్రంబును దివ్యరత్నమయం
బయిన మందరాచలశృంగంబును నమృతస్రావంబు లైనమజ్జననికుండలంబులును
గైకొని యెదురులేక మదీయరాజ్యలక్ష్మీవిభవంబులకుఁ బరమచిహ్నం బయిన
యైరావతంబుఁ గైకొనుతలంపునఁ దెంపుచేయుచున్నవాఁడు. నీవు దుష్టనిగ్రహ
శిష్టానుగ్రహంబులు చేయువాఁడవు కావున నెఱింగింపవలసె నీయుపద్రవంబు
మాన్చి జగంబులకు భద్రంబు సేయు మనిన జనార్దనుండు దయార్ద్రచిత్తుండై
యతనికరంబు తనహస్తంబునఁ గీలించి యిట్లనియె.[1]

85


తరల.

జగము లెల్లను దోడువచ్చిన సంగరాంగణభూమిలో
జగదుపద్రవకారియైన నిశాచరున్ నరకాసురున్
దెగి వధించెద నింతపట్టును నిశ్చయంబు మనంబులో
వగవకుండుము పొమ్ము నీ వని వారిజాక్షుఁడు పల్కినన్.[2]

86


క.

పురుహూతుఁడు సంతోష, స్ఫురితుండై యుల్లసిల్లెఁ బురుషోత్తముఁ డా
దర మొప్పఁ దలఁచె వినతా, వరతనయునిఁ బక్షిలోకవరుసత్వాఢ్యున్.

87


చ.

తలచిన వచ్చి తార్క్ష్యుఁడు ముదంబునఁ దామరసాక్షుసన్నిధిన్
నిలిచిన శత్రుభంజనవినిశ్చయబుద్ధి మనంబులోపలన్
దలకొన సత్యభామయును దాను దశాధిపు నెక్కి శౌరి యా
బలరిపుఁ గూడి యేగె బహుభంగుల లోకము ప్రస్తుతింపఁగన్.[3]

88


వ.

ఇవ్విధంబునఁ బ్రాగ్జ్యోతిషపురంబున కరిగి రప్పు డింద్రుం డుపేంద్రుని వీడ్కొని
నిజలోకంబునకుం బోయె కృష్ణుండును యుద్ధసన్నద్ధుండై ప్రకంపితాఖలనిశాచర
సంఘంబయిన శంఖంబు పూరించిన.[4]

89


ఉ.

ఆనినదంబుచేత జగమంతయుఁ గంపము నొందె గోత్రభృ
త్సానులయందు నెల్లఁ బ్రతిశబ్దము లొక్కట నుప్పతిల్లె నా
దానవనాథువీట బెడిదంబుగ నుల్కలు రాలుచుండె నం
భోనిధులెల్ల మ్రోసె మునిపుంగవు లెంచిరి సంతసిల్లుచున్.[5]

90


వ.

తదనంతరంబున.

91


మ.

నరకప్రేరితులై రథేభభటగంధర్వాదిసంఘంబుతో
గిరిభేదిప్రతికూలు రమ్మురహయగ్రీవుల్ రణోద్యోగవి

  1. ధవళాతపత్రంబు = తెల్లగొడుగు, భద్రంబు = మేలు, దయార్ద్ర = దయారసముచేత తడిసిన - దయగల.
  2. తెగి = తెగఁబడి, ఇంతపట్టును = ఇదంతయు.
  3. భంజన = భంగపెట్టుటయందు, తలకొనన్ = పుట్టఁగా, దశాధిపున్ = పక్షిరాజైన గరుత్మంతుని.
  4. ప్రకంపితాఖిలనిశాచరసంఘంబు = మిక్కిలి వడఁకింపఁబడిన రాక్షససమూహములు గలది.
  5. గోత్రభృత్సానులయందున్ = కొండచఱులయందు, ఒక్కటన్ = ఒక్కసారిగా, వీటన్ = పట్టణమునందు, బెడిదంబుగన్ = భయంకరముగా, ఉల్కలు = కొఱవులు, ఎంచిరి = పొగడిరి.