పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/369

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బ్రాంచద్వివేకశుద్ధు ను, దంచితవిభవానిరుద్ధు నయ్యనిరుద్ధున్.[1]

77


తే.

రుక్మిణీసతి యనిరుద్ధు రుక్ష్మిమనుమ, రాలి నుద్వాహ మొనరించి లీలతోడ
సకలలోకంబులును దన్ను సన్నుతింప, నుజ్జ్వలం బైనమహిమతో నుండునపుడు.

78

నరకాసురవధప్రస్తావము

సీ.

మహిమతో ముడిచిన మందారసుమపుసౌరభము తుమ్మెదల రా రమ్మనంగ
దివ్యభూషణరత్నదీప్తులు తోరమై సకలదిక్కులఁ బ్రతిచ్ఛాయ లెసఁగఁ
గరపంకజంబునఁ గ్రాలెడిదంభోళి మెఱుఁగులు కడుమిఱుమిట్లు గొనఁగ
గంధర్వకిన్నరగాననాదంబులు చెవుల కానందంబు సేయుచుండ


తే.

దివ్యదుందుభిరవములు దిక్కు లెల్లఁ, బిక్కటిల్ల దిగీశులు బెరసి కొలువ
నభ్రమాతంగపతి నెక్కి యమరలోక, నాయకుఁడు వచ్చె ద్వారకానగరమునకు.[2]

79


ఉ.

వారిజనాభుఁ డప్పుడు దివస్పతిరాక యెఱింగి గ్రక్కునన్
సీరధరాదు లైనయదుసింహులుఁ దక్కినబంధుమిత్రులున్
బౌరులు తోడరా నుచితభంగి నెదుర్కొని తోడితెచ్చి బం
గారుమెఱుంగు లుప్పతిలుగద్దియపై నిడి పూజ లిచ్చినన్.

80


క.

సురలోకసార్వభౌముఁడు, పరితోషము నొంది దిగధిపతులున్ దానున్
హరిఁ బ్రస్తుతించి యవ్విధు, కరుణ పడసి వినయపూర్వముగ నిట్లనియెన్.[3]

81


ఉ.

యాదవవంశశేఖరుఁడవై విలసిల్లి యనాథు లైననా
నాదివిజవ్రజంబులకు నాథుఁడవై యుదయించియున్న య
య్యాదిమపూరుషుండవుగదా జలజాయతనేత్ర లోకముల్
నీదయచేతఁ గాదె రమణీయగతిన్ విలసిల్లు నెంతయున్.

82


ఆ.

అమరవరులు సోమయాజులు యజ్ఞాంశ, ములు కృశానురూపముల భుజింతు
రవ్విధంబు లెల్ల ననఘాత్మ నేటితో, మానవలసెఁ గాదె మాకు నెల్ల.[4]

83


సీ.

విను మవ్విధంబు పృథ్వీపుత్రుఁ డగునరకాసురేంద్రుఁడు జగదహితకారి
తనవంటిదుష్టదైత్యశ్రేణితోఁ గూడి ప్రాగ్జ్యోతిషం బనుపట్టణమున
వసియించి గర్వదుర్వారుఁడై లోకంబుకెల్ల నుపద్రవం బెపుడుఁ జేయు
యజ్ఞభాగంబుల కర్హుండు దా నని సవనాదు లెవ్వియు సాగనీఁడు


తే.

సంగరమున సిద్ధసాధ్యబృందారక, మనుజవరులనెల్ల మదమణంచి
సుందరాంగకముల శోభిల్లుకన్యల, నపహరించి తనగృహమున నునిచె.[5]

84
  1. ప్రాంచద్వివేకశుద్ధున్ = ఒప్పిదమైన తెలివిచేత స్వచ్ఛమైనవానిని, ఉదంచితవిభవానిరుద్ధున్ = మిక్కుటమైన భోగముచేత అడ్డగింపఁబడనివానిని - ఎల్లభోగములు గలవాని ననుట.
  2. దంభోళి = వజ్రాయుధము, బెరసి = పరివేష్టించి, అభ్రమాతంగపతిన్ = ఐరావతమును.
  3. పరితోషము = సంతోషము.
  4. కృశాను = అగ్ని.
  5. జగదహితకారి = లోకమునకుఁ గీడు చేయువాఁడు, సవనాదులు = యజ్ఞములు మొదలగునవి.