పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/368

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


లోలతఁ జూచుచుండిరి త్రిలోకమనోహరమూర్తి యైనయా
బాలునిఁ జూచి రుక్మిణి యపారవిషాదము మానసంబునన్
గ్రాలఁగఁ బుత్రునిం దలఁచి కన్నుల బాష్పము లొల్కుచుండఁగన్.[1]

69


క.

ఈలలితాత్యుం డెవ్వరి, బాలుఁడొకో వీనిఁ గన్న పద్మానన ము
న్నేలీలఁ దపము చేసెనొ, కో లోకమువారికంటెఁ గోరిక మీఱన్.

70


తే.

శివుఁడు చిచ్చఱకంటఁ బ్రేల్చినప్రసూన, నాయకుఁడు వచ్చి క్రమ్మఱ జననమందఁ
బోలుఁ గాకున్న నిటువంటిపుణ్యమూర్తి, కలఁడె లోకంబులందు నేకాలమునను.[2]

71


తే.

నాకుమారుని దైవంబు నాఁచుకొనక, యున్న వీనిప్రాయంబున నుండకున్నె
యనుచు దుఃఖించుచున్న యయ్యవసరమున, నందసుతుఁ జూడఁ జనుదెంచి నారదుండు.

72


తే.

శంబరునిచేత నా డరిష్టంబులోనఁ, గోలుపోయినబాలుఁ డీకొడుకుఁగుఱ్ఱ
యనుచుఁ బ్రద్యుమ్నువృత్తాంత మాలతాంగి, తోడ వివరించి యమ్మునీంద్రుండు మఱియు.

73


ఉ.

ఈకమలాక్షుఁ డాదిహరి నీవు రమాసతి వీకుమారకుం
డాకుసుమాస్త్రుఁ డీయతివ యారతి గావున మీమహత్త్వముల్
నాకును శక్యమే పొగడ నన్నుఁ గృతార్థునిఁ జేయుఁ డంచు నా
పోకలప్రోక యైనముని పోయెఁ బురందరరాజధానికిన్.[3]

74


వ.

తదనంతరంబ కృష్ణుండు ప్రద్యుమ్నునకు నమ్మాయావతిం బాణిగ్రహణంబు
సేయించె, మఱియు నారుక్మిణియందుఁ జారుధేష్ణుండును చారుదేహుండును
వీర్యవంతుండును సుషేణుండును చారుగుప్తుండును భద్రచారుండును సుచా
రుండును మహాచారుండు నన నెనమండ్రుకుమారులను చారుమతి యనుకన్య
కనుం బడసె మఱియును.

75


ఉ.

ఆనలినాక్షుపెద్దకొడు కంచితరూపవిలాసచారుతే
జోనిధి పెండ్లియాడె నతిశోభనమూర్తిని రుక్మికూఁతురిన్
మేనఱికంబుగా నఖిలమేదినినాథులు చూచుచుండఁగా
నానలినాయతాక్షిని స్వయంవర మైనవివాహసంపదన్.

76


క.

మించిన యాప్రద్యుమ్నుఁడు, గాంచెన్ బుత్రకుని రుక్మికన్యకయందున్

  1. విషాదము = విచారము, క్రాలఁగన్ = వర్తింపఁగా.
  2. చిచ్చఱకంటన్ = అగ్నినేత్రముచేత, ప్రేల్చిన = దహించిన.
  3. పోకలప్రోక = తనయందు రాశిగాఁ గూడుకొన్న బహుచేష్టలుగలవాఁడు.