పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/365

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

మదిరాపానముచేత నొక్కసతి తా మత్తిల్లి వేఱొక్కతెన్
హృదయేశుండని కౌఁగిలించె నది దానిం బ్రాణనాథుం డటం
చొదవన్ గొమ్మని మోవియిచ్చె నటు లన్యోన్యప్రవృత్తక్రియల్
ముదితల్ కొందఱు చూచి నవ్వి సరసంబుల్ పల్కి రత్యున్నతిన్.[1]

48


వ.

ఇవ్విధంబున నయ్యిందువదనలవిలాసంబులును బహువిధోల్లాసంబులును పర
స్పరకోలాహలహాసంబులును సరససంగీతవిద్యావికాసంబులును బెరయ మద్య
పానంబు చేయుచున్న నయ్యిందువదనలుం దానును బరమసంతోషహృదయులై
నృత్తగీతవాద్యవిశేషంబులఁ బెద్దయుంబ్రొద్దు వర్తించి శరీరోద్ధతంబు లైన
ఘర్మకణంబులు మౌక్తికాహారంబుల నలంకరింప వారిజాక్షులుఁ దానును వారి
విహారంబున కుద్యోగించి మదిరాపానపరశత్వంబునఁ బోవనోపక యున్నతవచనం
బుల యమునాతటినిఁ బేరెలుంగునం బిలిచిన రాకున్నం గోపించి.[2]

49


క.

ఈలాంగలపాతముచేఁ, గాళిందీ నిను సహస్రగతులుగఁ బఱపన్
జాలుదు నావిధ మెఱుఁగక, యేలా మదియించి తనుచు నెంతయు బలిమిన్.[3]

50


క.

యమునాతీరమునకు వ, చ్చి మహాలాంగలము పూని చెచ్చెరఁ దత్కూ
లమునఁ దగిలించి తగిచిన, నమరులు వెఱఁగంది చూడ నవ్వాహినియున్.[4]

51


సీ.

పెదపెదపాయలై బృందావనంబునఁ బ్రవహించి కడుననూపంబు చేసె
బలభద్రుఁ డంగనాపరివృతుఁడై యందు జలకేళి లీలమై సలుపుచున్న
నపుడు కాళింది భయభ్రాంతయై నిజరూపంబుఁ బొడచూపి యాపురాణ
పురుషునిఁ బ్రార్థించి శరణంబు వేడిన నభయదానం బిచ్చి యనిపిపుచ్చి


తే.

మోదమున మద్యపానవినోదగోష్ఠిఁ, దగిలి రేవతీసతియును దాను సురత
కేళిఁ దేలుచుఁ దనివోని క్రీడ సలిపె, మమత లగ్గలమైన సౌమ్యాకృతులను.[5]

52


వ.

ఇవ్విధంబున వినోదింపుచున్నంత నొక్కనా డతనికడకు వరుణదేవుండు వచ్చి
నీలోత్పలావతసంబును కనకరత్నకుండలయుగళంబును నీలాంబరంబును ధవళ
చ్చత్రంబును నొసంగిపోయినఁ గైకొని మహనీయవిభవంబున మెఱసి నంద
గోపవ్రజంబున మాసద్వయం బుండి కృష్ణసందర్శనకుతూహలుండై ద్వారకా
నగరంబున కరిగియుండునంత.

53

రుక్మిణీకల్యాణము

ఉ.

అంచితుఁడై విదర్భవిషయంబున కుండినమన్ పురంబు పా

  1. మత్తిల్లి = మత్తుకొని.
  2. హాసంబులు = నవ్వులు, బెరయన్ = కూడుకొనఁగా, ఉద్గతంబులు = పొటమరించినవి, ఘర్మకణంబులు = చెమటబొట్లు, వారివిహారంబునకున్ = జలక్రీడకు, ఉన్నత = గంభీరములైన.
  3. పఱపన్ = ప్రవహింపఁజేయ, మదియించితి = మదించితివి.
  4. కూలమునన్ = గట్టునందు, తిగిచినన్ = లాగఁగా, వాహిని = నీఱు.
  5. అనూపము = అంతట నీళ్లు గలదిగా, తనివోని = తృప్తి కలుగని, అగ్గలము = అధికము.