పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/366

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


లించును భీష్మకుండు సుఖలీల నతండు తపంబు భక్తిఁ గా
వించి సురూపవైభవవివేకుల రుక్మిని రుక్మిణీసతిన్
గాంచి బ్రియంబుతోఁ బెనిచె గౌరవమున్ గుతుకంబు నేర్పడన్.[1]

54


తే.

అంత రుక్మిణి పెండ్లిప్రాయమున నున్న, నాలతాంగి మనోహరంబైన సౌకు
మార్యములు గోరి ఘనులైనమనుజనాథు, లడుగనంపిన నీకుండు నవ్విభుండు.

55


క.

హరిఁ గోరె రుక్మిణీసతి, హరియును నయ్యింతిఁ గోరె నయ్యిరువురు నీ
వెరపున మోహమువలనను, బరస్పరము లైనతగులు వాయక యున్నన్.[2]

56


క.

హరి దనకు నడుగ నంపిన, హరిపగతుం డైనరుక్మి యతనికి నీ కా
హరిమధ్యకు శిశుపాలుఁడు, వరుఁ డని యాతనికి నిచ్చువాఁడై యుండెన్.

57


వ.

ఇట్లు జరాసంధప్రచోదితుండై వివాహంబునకు శిశుపాలుం బిలువంబంపిన
నతండు సకలమేదినీపతులతోడఁ గదలి కుండినపురంబునకు వచ్చె కృష్ణుండు బల
భద్రాక్రూరకృతవర్మసాత్యకిప్రముఖు లగుయాదవులతోడఁ గూడి కట్టాయితం
బై వివాహసమయంబున నేమఱియున్న రాజమందిరంబు చొచ్చి యానవోఢం
దనరథం బెక్కించుకొని యుద్ధసన్నద్ధుండై యరిగిన.[3]

58


మ.

బలవద్వైరినిదాఘమేఘుఁ డగునాపద్మాక్షుమీఁదన్ సము
జ్జ్వలులై చైద్యుఁడు దంతవక్త్రుఁడు జరాసంధుండు సాళ్వుండు
పేరలుకం దాఁకి రణంబు సేసిరి యవశ్యాయాంబుదవ్రాతముల్
జలజాప్తుం గని బిట్టుముట్టినగతిన్ సన్నద్ధులై యుద్ధతిన్.[4]

59


వ.

ఇట్లు పొదివి మహాఘోరయుద్ధంబు సేసిన బలభద్రసాత్యకికృతవర్మాదులు
నయ్యూధంబుపయిం గవిసి ప్రచండకోదండనిర్ముక్తనిశాతసాయకపరంపరలు
గురియించి రథికులం బరిమార్చియు సారథుల రూపుమాపియు సిడంబులఁ
ద్రుంచియు ఛత్రంబుల ఖండించియు చక్రరక్షకుల విదళించియు ఏనుంగులఁ
బీనుంగులు గావించియు దంతంబుల రాల్చియు తొండంబులఁ ద్రుంచియు కుం
భంబులఁ బగిలించియు తురంగంబుల రూపఱనేసియు రౌతులప్రాణంబులు
గొనియు పక్కెరలు చెక్కలు చేసియు కవచంబులు చించియు పదాతులబారి
సమరియు చక్రకుంతపట్టసప్రాసకోదండగదాదండశూలాదిసాధనంబులు విటతా
టంబులు చేసియు నిట్లు విజృంభించిన సంగ్రామం బతిదారుణం బయ్యె నయ్యా
హవంబునకు నోహటించి యందఱు బహుముఖంబులం బఱచిరి శిశుపాలుం
డును సిగ్గుపడి నిజపురంబున కరిగె నంత రుక్మియును.[5]

60
  1. విషయంబున్ = దేశమునందు.
  2. తగులు = మనస్సంగము.
  3. ప్రచోదితుండు = ప్రేరేపింపఁబడినవాఁడు, నవోఢన్ = పెండ్లికొమార్తెను.
  4. నిదాఘ = వేసంగికాల మనెడు, అవశ్యాయ = మంచు.
  5. యూధంబు = సేనాసమూహము, నిర్ముక్త = విడువఁబడిన, నిశాత = వాడియైన, సాయక = బాణములయొక్క, సిడంబులన్ = ధ్వజములను, విదళించి = నఱకి, రూపఱన్ = స్వరూపనాశమగునట్లు, పక్కెరలు = గుఱ్ఱముల కవచములు, బారి సమరి = చంపి, విటతాటంబులు = తుత్తుమురులు, ఓహటించి= విముఖులై.