పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/364

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

నీవింక నేటినుండియు, నావచనము లాదరించి నచ్చినమతితో
దేవతల కైనదొరకని, యావారుణిసేవ సేయు మతులితభక్తిన్.[1]

40


క.

అని వారుణీమహత్త్వము, గొనియాడి తదీయపానగోష్ఠీరతికిన్
మన మలరి యున్న బలభ, ద్రునికోర్కి యొనర్పఁగా వరుణదేవుండున్.

41


తే.

నెమ్మితోడ బృందావననీపకోట, రమ్మునను వారుణీకలశమ్ము నిలిపి
పోయె నామద్యగంధ మపూర్వ మగుచు, నవ్వనంబున బెరసె నయ్యవసరమున.[2]

42


ఉ.

సింధురవైరివిక్రముఁడు సీరధరుం డొకనాడు వృష్ణిభో
జాంధకవీరులం గలసి యచ్చటఁ ద్రిమ్మరువారిపాలికిన్
గంధవహుండు దెచ్చె నధికప్రమదాభినయానుబంధమున్
బంధురషట్పదాంధము నపారమదాంధము సీధుగంధమున్.[3]

43


వ.

ఇ ట్లతిమనోహరం బైనమదిరాగంధం బాఘ్రాణించి యవ్వలను గైకొని చని
కదంబతరుకోటరంబున నున్న దివ్యహాలాకుంభంబుఁ గనుంగొని వరుణప్రయుక్తం
బుగా నెఱింగి తదాసక్తచేతస్కుండై కైకొని చని.[4]

44


మ.

యమునాతీరమునందు నందమగుబృందారణ్యనీపప్రదే
శమునన్ నిర్మలచంద్రకాంతమణిరాజద్వేదిపైఁ బూర్ణచం
ద్రమయూఖంబులు దట్టమై వొలయు నుద్యల్లీలతో మద్యపా
నము చేసెన్ బలభద్రుఁ డంగనలతో నానావిధోల్లాసి యై.[5]

45


వ.

అప్పుడు.

46


చ.

కమలనిభాస్యయోర్తు చషకంబున మద్యము నిండఁబోసి యిం
దమనుచు నొక్కచంద్రముఖిఁ దార్కొని యిచ్చిన వారివక్త్రయు
గ్మముప్రతిబింబముల్ దనరెఁ గంజసుధాకరు లబ్జనామలా
భములకుఁ బోరుచున్ బుడుకుబానకు నందు మునింగిరో యనన్.[6]

47
  1. నచ్చిన = నమ్మిన.
  2. నీపకోటరమ్మునన్ = కడపచెట్టుతొఱ్ఱయందు, బెరసెన్ = వ్యాపించెను.
  3. సింధురవైరివిక్రముఁడు = సింహపరాక్రమము గలవాఁడు, అధికప్రమదాభినయానుబంధమున్ = మిక్కిలి సంతోషమును తోఁపించునట్టి సంబంధము కలదానిని, బంధురషట్పదాంధమున్ = మనోజ్ఞమైనతుమ్మెదలకు అన్నమైనదానిని, సీధు = మద్యముయొక్క - కల్లుయొక్క.
  4. మదిరా =కల్లుయొక్క, అవ్వలను గైకొని = ఆదిక్కునుబట్టి, హాలాకుంభంబున్ = కల్లుకుండను, ప్రయుక్తంబు = చక్కగా చేర్పఁబడినది, చేతస్కుండు = మనసు గలవాఁడు.
  5. రాజద్వేది = ప్రకాశించుచున్న యరుఁగు, మయూఖంబులు = కిరణములు, సొలయన్= ప్రసరింపఁగా, ఉద్యల్లీలతోన్ = వృద్ధిఁబొందుచున్న విలాసముతో.
  6. చషకంబునన్ = త్రాగెడుగిన్నెయందు, తార్కొని =ఎదుర్కొని, వక్త్రయుగ్మము = మొగములజంటయొక్క, కంజసుధాకరులు = కమలమును చంద్రుఁడును, పుడుకుబానకున్ = (ఆయుస్సు నిచ్చునట్టిదైన) అమృతఘటముకొఱకు.