పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/363

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వరుస నుపద యిచ్చె యాదవప్రవీరువంశ మే
యరులవలన భయములేక యంబుజాక్షరక్షణ
స్ఫురణవలన నధికవృద్ధిఁ బొందె ద్వారకాపురిన్.[1]

30


వ.

అంత నొక్కనాడు.

31

బలభద్రుండు వ్రేపల్లెకు వచ్చియుండి వరుణదేవునివలన వరంబు గొనుట

క.

బలభద్రుండు ప్రశాంతా, ఖిలవిగ్రహుఁ డైన దేవకీసుతు నచటన్
నిలిపి యదువరులు దన్నుం, గొలువంగా నరిగె నందగోకులమునకున్.[2]

32


వ.

అరిగి యశోదానందులకు నమస్కరించి తనకు బాలసఖులయిన గోపకుమారుల
నయ్యైప్రకారంబులు నాదరించి గోపికాజనంబులకు మనోహరంబు లయినవస్త్ర
భూషణంబు లోసంగి గోగణంబుల కుశలం బరయుచు నిష్టవినోదంబులం దగిలి
కతిపయదినంబు లుండునంత.

33


మ.

వరభూషాదులరత్నదీధితులు దుర్వారంబులై దిక్కులం
బరువుల్ పెట్టఁగ నుత్తమాంగనవపుష్పశ్రేణిసౌరభ్యముల్
గరుసుల్ మీఱఁగ గ్రాహవాహనపరిష్కారంబు తోరంబుగా
వరుణుం డక్కడి కేగుదెంచెఁ బ్రమదవ్యాపార మేపారఁగన్.[3]

34


వ.

ఇట్లు వచ్చి యత్యంతవినయపూర్వకంబుగా నతనిం బొడఁగాంచి యనేకమణి
మయభూషణజాలంబు లొసంగి యిష్టనినోదంబుల నున్నవరుణదేవునకు బలదే
వుం డిట్లనియె.

35


తే.

అనఘ పూర్వంబునందు నీయందుఁ బుట్టి, నట్టి వారుణీసేవ ప్రియంబుతోడఁ
జేయుదురు కొంద ఱార్యులు సిద్ధమతులు, వారి కేమిఫలంబులు వచ్చునొక్కొ.

36


క.

నావుడు నావరుణుఁడు బల, దేవున కిట్లనియెఁ దొల్లి దేవతలును దై
త్యావళియు నార్తిఁ దరువఁగ, నావారుణి యుద్భవించె నమృతముతోడన్.

37


మ.

పరమానందకరంబు రోగహరణోపాయంబు నానారసో
త్కర మత్యంతబలప్రహేతువు జగత్కల్యాణరూపంబు ని
ర్జరసేవ్యంబు వరాంగనాజనరతస్వచ్ఛంద మానందసుం
దర మామద్యము మద్యపానరతుఁ డేతన్మాత్రుఁడే లాంగలీ.[4]

38


మ.

సుర సేవించి కదా సురాసురవరస్తోమంబు లెల్లప్పుడున్
బరమానందపరంపరాభినయులై భాసిల్లుచున్నారు సు
స్థిరతన్ దొల్లిటిశుక్రశాపభయబుద్ధిన్ మద్యపానక్రియా
పరతన్ జెందనివానిజన్మము వృథాపాకంబు నీలాంబరా.[5]

39
  1. ఉపద = కానుక.
  2. ప్రశాంతాఖిలవిగ్రహుండు = మిక్కిలియణఁగిన కలహములు గలవాఁడు.
  3. సౌరభ్యములు = పరిమళములు, గరుసులు = మేరలు, గ్రాహవాహనపరిష్కారంబు = మొసలివాహనముయొక్క అలంకారము, తోరంబు = మితిమీఱిన దనుట.
  4. ఉత్కరము = రాశి, స్వచ్ఛందము = స్వతంత్రమైనది.
  5. అభినయులు = ప్రకాశింపఁజేయువారు.