పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/362

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

అవనీనాథుఁడు బిట్టు మేలుకొని కోపాటోపముల్ చూడ్కులన్
నివుడన్ దారుణవృత్తిఁ గాలయవనున్ వీక్షించినన్ వాఁడు భీ
మవిశాలానలకీల లంగమునఁ గ్రమ్మం గూలె నాలోన యా
దవచూడామణి తత్ప్రదేశమున నుద్యన్మూరియై నిల్చినన్.[1]

21


క.

జననాయకుఁ డెవ్వఁడవని, తను నడిగిన శౌరి కరుణ దళుకొత్తంగా
మనుజేశ్వర వసుదేవుం, డనుయాదవుసుతుఁడఁ గృష్ణుఁ డందురు నన్నున్.

22


మ.

అనినన్ దిగ్గన లేచి సంభ్రమముతో సాష్టాంగదండంబు చే
సి నితాంతప్రమదంబు చిత్తమున నుత్సేకింపంగాఁ బద్మలో
చనుని గృష్ణుని వాసుదేవుని జగత్స్రష్టన్ సమస్తామరా
వనకేళీరతునిఁ గృపానిరతునిన్ వర్ణించి సద్భక్తితోన్.[2]

23


సీ.

దనుజారిఁ జూచి యిట్లను దేవ నేఁ దొల్లి యింద్రునిపనుపున నీగుహాంత
రమున నిద్రింపంగ సమకట్టివచ్చుచో గార్గ్యుండు ననుఁ బొడగాంచి విష్ణు
దేవుఁడు యదువంశదీపకుండై దేవకీదేవి కుదయించి కృష్ణుఁ డనఁగ
నిరువదియెనిమిదివరదివ్యయుగములు వరుసతోఁ జనఁగ ద్వాపరయుగాంత


తే.

మున మహీభార ముడుపంగ జనన మొందు, నతఁడు నీకును బ్రత్యక్షమై శుభంబు
లొసఁగునని చెప్పె నట్టిపుణ్యోదయుండ, వీవు నాపాలఁ గలిగితి దేవదేవ.

24


వ.

అని యిట్లు పలికినఁ బ్రసన్నుఁడై సర్వభూతేశ్వరుం డైనముకుందుండు ముచికుం
దున కిట్లనియె.

25


తే.

ధరణీనాయక మత్ప్రసాదమున దివ్య, భోగములఁ జెంది సత్కులంబున జనించి
వైభవంబు జాతిస్మరత్వంబుఁ గలిగి, యభిమతం బైనలోకంబులందు నుండు.[3]

26


ఆ.

మోక్ష మంత్యకాలమునఁ గృపచేసితి, ననుచు వరము లొసఁగి యరిగె శౌరి
రాజవరుఁడు గహ్వరము నిర్గమించి క, న్గొనియె నల్పులైన మనుజతతిని.[4]

27


మ.

కని తొల్లింటివిధంబుగాక పెరమార్గం బైనకాలంబు గ
న్గొని యింక గలికాలమయ్యెడుఁగదా కొన్నాళ్ల కంచున్ మనం
బున శంకించి యధర్మమార్గమగు నాభూమిన్ బ్రవర్తింప రో
సినవాఁడై చని గంధమాదనగిరి జేరె దపోనిష్ఠకున్.[5]

28


వ.

ఇట్లు నరనారాయణస్థానంబునం దపంబు సేయుచుండె నటఁ గృష్ణం డుపాయం
బున రిపుం బరిమార్చి తదీయంబైన సకలసంపదలునుం గొని.

29


ఉత్సాహ.

అరిగి యుగ్రసేనునకుఁ బ్రియంబుతోడ నన్నియున్

  1. నివుడన్ = వ్యాపింపఁగా - తోఁచఁగా ననుట, ఉద్యన్మూర్తి = ప్రకాశమానమైన యాకృతిగలవాఁడు.
  2. ఉత్సేకింపంగా = అతిశయింపఁగా, జగత్స్రష్టన్ = లోకములను సృజించువానిని, అవన = రక్షించుట యనెడు.
  3. మత్ప్రసాదమునన్ = నాయనుగ్రహముచేత.
  4. నిర్గమించి = వెడలి, తతి = సమూహము.
  5. పెర = వేఱైన, రోసినవాఁడై = రోతపడినవాఁడై.