పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/361

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వారకానిర్మాణ కాలయవనవధ ముచికుందానుగ్రహాదివివరణము

సీ.

కల్పాంతకాలభీకరమూర్తి యగు కాలయవనుఁడు నానొక్కయవనవిభుఁడు
నారదమునిచేతఁ బ్రేరితుండై మ్లేచ్ఛకోటిసహస్రంబు గొలువ మధుర
పై దండు వెడలి యుద్భటశక్తి నేతెంచుచుండుటఁ దెలిసి దామోదరుండు
చటులశౌర్యుఁడు జరాసంధునిపగమీఁద నిదియుఁ బాటిల్లె నింకెట్టు లోర్వ


తే.

వచ్చు నేరికి సాధింపవశముగాని, దుర్గ మొక్కటి గావింతు దుష్టశాత్ర
వుల కజేయంబుగాను నజ్జలధిలోన, ననుచుఁ దలపోసి యాలవణాబ్ధియందు.[1]

15


వ.

ద్వాదశయోజనవిశాలంబై ప్రాకారవప్రమహోద్యానతటాకానేకసుందరమం
దిరం బగుచు నమరావతికంటె రమ్యంబుగా ద్వారకాపురంబు నిర్మించి మధు
రాపురంబున నున్నసమస్తజనంబుల నందు నుండ నియమించి చతురంగసమేతం
బుగా దుర్గరక్ష సేయ బలభద్రునిం జాలించియుండె నంత.[2]

16


ఆ.

కాలయవనుఁ డపుడు ఘనసైన్యములతోడ, మధురమీఁద విడిసి మలయుటయును
వాని నుపమచేత వధియింపఁగాఁదగు, ననుచుఁ దలఁచి కృష్ణుఁ డాక్షణంబ.[3]

17


తే.

ఒగి నిరాయుధహస్తుఁడై యొక్కరుండు, కాలయవనునికడ కేగి గబ్బితనము
వెలయఁ దనపేరు చెప్పి గర్వించి తన్నుఁ, దఱిమి పట్టంగ నోపినఁ దగిలిరమ్ము.[4]

18


చ.

అనుటయుఁ గోపదీప్తహృదయంబున నానృపుఁ డమ్మురాంతకున్
వెనుకొని పాఱుచుండ యదువీరవరుం డెలయించుకొంచుఁ జ
య్యన నొకశైలగహ్వరమునందుఁ బ్రవేశము జేసెఁ జేసినన్
గనుఁగొని వాఁడు నాబిలము గ్రక్కున జొచ్చి చనంగ నచ్చటన్.[5]

19


వ.

తొల్లి దేవాసురయుద్ధంబున నింద్రునకు సహాయంబై రాక్షనులఁ బెక్కండ్రం
జంపి సంగరపరిశ్రాంతుండై దేవతలవలనఁ బెద్దగాలంబు సుఖనిద్రఁ జెందునట్లును
బలాత్కారంబునఁ దన్ను మేలుకొలిపినవారు తనయుగ్రదృష్టివలన భస్మం బగు
నట్లుంగా వరంబు గొని తదీయగిరికందరంబున విశాలవేదికాతలంబున ముసుంగు
వెట్టుకొని నిద్రించుచున్న ముచికుందుం గనుంగొని కృష్ణుండని నిశ్చయించి
వామపాదంబునం దన్నుటయును.

20
  1. కల్పాంతకాలభీకరమూర్తి = ప్రళయకాలమునందలి యమునివలె భయంకరమైన ఆకృతి గలవాఁడు, యవనవిభుఁడు = అరబ్బీదొర, ఉద్భటశక్తిన్ = అణఁపరాని బలిమితో, దుర్గము = పర్వతములు (లేక) నీళ్లు ఆవరించియుండుటచే చొరశక్యముగాని పట్టణము.
  2. వజ్ర = కోట కొఱడు, చాలించి = నిలిపి.
  3. మలయుటయున్ = ముట్టడింపఁగా, ఉపమచేతన్ = ఉపాయముచేత.
  4. ఒగిన్ = పూనికతో, గబ్బితనము = గాంభీర్యము, తన్నున్ = నన్ననుట, తగిలి = వెంటనంటి.
  5. వెనుకొని = వెంబడించి, ఎలయించుకొంచున్ = వెంటఁ దీసికొనుచు, గహ్వరమునందున్ = గుహయందు.