పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/360

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వారిధి భీతినొంది యదువర్యులఁ గాంచి ధరామరాత్మజున్
దారుణశంఖరూపమున దైత్యుఁడు పంచజనాభిధానుఁ డీ
నీరున నుండి చంపె నని నిక్కముగా నెఱింగించిపోయినన్.[1]

7


క.

శరనిధి చొచ్చి ముకుందుఁడు, సరభసగతి నరిగి పంచజనరాక్షసునిన్
బరిమార్చి తదస్థిభయం, కరనాదముతోడ మెఱయఁగాఁ జేయుటయున్.[2]

8


క.

ఆనాదము దానవులకు, హానియు నాదిత్యవరుల కభివృద్ధియునై
మానుగ నయ్యదువర్యుఁడు, తా నరిగి రణమున దండధరు నోర్చి వెసన్.[3]

9


తే.

యాతనాగతుఁడై నరకాంతరమునఁ, బూర్వదేహంబుతో నున్న భూసురేంద్ర
బాలకునిఁ దెచ్చి గురుని కర్పణము చేసి, యెలమితో మధురాపురి కేగుదెంచె.[4]

10

జరాసంధుండు పదునెనిమిదిమాఱులు మధురాపురముపై దండెత్తి వచ్చి యోడిపోవుట

వ.

అంత జరాసంధుండు కంసుభార్య లయినయస్తిప్రాస్తులు తనదుహిత లగుటం జేసి
పుత్రికారత్నంబుల వైధవ్యంబు మనంబు నెరియించినఁ గృష్ణుతోడి విరోధంబున
బలిప్రముఖం బయినమాగధబలంబులో నిరువదిమూఁడక్షౌహిణులతోడ మధు
రాపురంబుపై విడిసిన నల్పపరివారంబుతోడఁ బురంబు వెడలి రామదామోద
రులు ప్రతిబలంబుతో మహాఘోరయుద్ధంబు సేయ సమకట్టుచున్ననమరపథంబు
ననుండి.[5]

11


తే.

దారుణాక్షయబాణతూణీరములును, శార్ఙ్గధనువును గదయును సన్నిధాన
మైన హరి పూనె ముసలంబు హలము నింగి, నుండి వచ్చిన బలభద్రుఁ డొనరఁ చాల్చె.[6]

12


తే.

ఇట్లు దివ్యాస్త్రములు పూని యేపు మిగిలి, యాజరాసంధుతోడ మహారణంబు
చేసి దర్పించి కడుఁబరాజితునిఁ జేయు, టయును నతఁ డోడిపాఱె మహాభయమున.[7]

13


వ.

ఇవ్విధంబున నతండు యాదవుతోడ బద్ధవైరుండై పదునెనిమిదిమాఱు లెత్తి
వచ్చి సంగ్రామంబు చేసి రామకృష్ణులచేత నోటుపడిపోయె నంత.[8]

14
  1. బోరనన్ = తటాలున.
  2. శరనిధి = సముద్రము, తదస్థి = వానియెముక.
  3. ఆదిత్యవరులకున్ = దేవతాశ్రేష్ఠులకు, మానుగన్ = ఒప్పిదముగా, ఓర్చి = ఓడించి - గెలిచి, వెసన్ = శీఘ్రముగా.
  4. యాతనాగతుఁడు = తీవ్రవేదనను పొందినవాఁడు, ఎలమితోన్ = క్షేమముతో.
  5. వైధవ్యంబు = విధవాత్వము, ఎరియించినన్ = సంతాపము నొందఁజేయఁగా, అమరపథంబు = ఆకాశము.
  6. దారుణ = భయంకరములైన, తూణీరములు = అమ్ములపొదులు, నింగి = ఆకాశము.
  7. ఏపు = విజృంభణము, దర్పించి = గర్వించి, పరాజితునిఁ జేయన్ = ఓడఁగొట్టఁగా.
  8. ఎత్తి = దండెత్తి, ఓటుపడి = అపజయము నొంది.