పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/358

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

శరనిధిమేఖలాఖిలరసావలయప్రచురప్రతాపభా
స్కర చతురప్రబంధకవికల్పితకావ్యరసజ్ఞతాధురం
ధర జగరక్షపాలబిరుదప్రకటీకృతభూమిభృత్సభాం
తర జగనబ్బగండ వనితాజనమోహనపుష్పసాయకా.[1]

431


క.

లలితకృపారసనేత్రో, తృలవిష్ణుపురాణసంహితశ్రవణకుతూ
హల చదలువాడ రాఘవ, నిలసత్కారుణ్యలబ్ధవిగతస్తబ్ధా.

432


లయగ్రాహి.

శ్రీరమణపాదసరసీరుహమదభ్రమర వారిధిగభీర చటులారిబలదుష్కాం
తారపవమానహిత మేరునగధైర్య ఘనసారశరదభ్రబలవైరిగజవాణీ
పారదమరాళనిభచారుతరకీర్తియుత సూరినుత పంటకులనీరనిధిరాకా
కైరవహితప్రతిమ ధీర బసవప్రభుకుమార రిపుభంజనకుమార సుకుమారా.[2]

433


గద్యము.

ఇది శ్రీమదమరనామాత్యపుత్ర హరితసగోత్రపవిత్ర సుకవిజనవిధేయ
వెన్నెలకంటి సూరయనామధేయ ప్రణీతం బైన యాదిమహాపురాణం బగు బ్రహ్మాం
డంబునందలి పరాశరసంహిత యైన శ్రీ విష్ణుపురాణంబునందుఁ గంసుఁ డశరీర
వాణిపలుకుల కులికి దేవకీవసుదేవులఁ గారాగృహంబున నునుచుటయు భూమి
దేవి దేవతలతోడం జని వైకుంఠంబున విష్ణుదేవునకుఁ దనభారదుఃఖంబు చెప్పు
టయు రామకృష్ణులజన్మంబును పూతనవధయును శకటపరివర్తనంబును యమ
ళార్జునపాతంబును బృందావనగమనంబును కాళీయాహిమర్దనంబును ధేనుకా
సురవధయును ప్రలంబనిధనంబును గోవర్ధనధారణంబును రాసక్రీడావిహారం
బును కేశిదనుజవినాశంబును అక్రూరుండు రామకృష్ణుల మధురానగరంబునకుఁ
దోడుకొనిపోవుటయును కంసుమరణంబును ఉగ్రసేనుని యాదవరాజ్యంబునకుఁ
బట్టంబుగట్టుటయు నన్నది సప్తమాశ్వాసము.


————

  1. శరనిధిమేఖలాఖిలరసావలయ = సముద్రము మొలనూలుగాఁ గలసకలభూమండలమునందు.
  2. పవమానహిత = అగ్నిదేవుఁడా, ఘనసార = కర్పూరముతోడను, బలవైరిగజ = ఐరావతముతోడను, పారద = పాదరసముతోడను, మరాళ = హంసతోడను, నిభ= సమానమైన, రాకాకైరవహితప్రతిమ = పున్నమవాటి చంద్రునిఁ బోలిన.