పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/357

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దించి బంధుమిత్రపౌరజనంబుల నయ్యైతెఱంగుల సంభావించె నప్పుడు.[1]

421


సీ.

కంసు నంతఃపురకాంత లెంతయు దుఃఖపరవశలై వచ్చి ప్రాణవల్ల
భునికళేబరముపైఁ బొరిఁబొరిబడి శోకముల ముఖంబులు నురములును మోదు
కొనుచుఁ బెద్దయుఁ బ్రొద్దు ఘనవిలాపంబులు గావించుచుండంగఁ గమలనయనుఁ
డతికృపామూర్తియై యశ్రుధారాపూరితాయతలోచనుఁ డగుచు వచ్చి


తే.

యేడ్పు లుడిపి వారినెల్ల నయ్యైవిధంబులను గారవించి పుచ్చి బంధు
మిత్రసచివులెల్ల మెచ్చ జగం బెల్ల, నభినుతింప నుచితమగువిధమున.[2]

422


ఆ.

మును యయాతిశాపమున యదువంశంబు, వారలకును రాజ్యవైభవములు
చేకొనంగఁ దగవుచెల్లక యుండుట, దలఁచి తదభిలాష తనకులేక.

423

ఉగ్రసేనుండు యాదవరాజ్యమందు పట్టాభిషిక్తుఁ డగుట

వ.

కారాగృహంబున నిగళబద్ధుండై యున్న యుగ్రసేనుని విడిపించి తదీయరాజ్యం
బున కభిషిక్తునింజేసి యతినిచేతఁ గంసునికిఁ బరలోకక్రియలు సేయించి య
త్యంతకృపాతరంగితలోచనుండై యతని సింహాసనాసీనుం జేసి సమస్దరాజలో
కంబును గనిపించి యిట్లనియె.

424


ఉ.

ఈయదువృష్ణిపుంగవులు నేనును రాముఁడు నెల్లవారలున్
బాయక నిన్నుఁ గొల్చి నిరపాయత నుండెద మింక నెన్నఁడున్
మాయెడ శంకయున్ భయము మాని పనుల్ గొనుఁ డీజగంబు ని
త్యాయతబాహుశౌర్యగతమై విలసిల్లుచు నుండఁజేసెదన్.

425


ఆ.

అనుచు నుగ్రసేను ననునయోక్తులచేతఁ, దేర్చి యపుడు వాయుదేవుఁ బిలిచి
నిర్జరేంద్రుకడకు నీవు నాపనుపున, నరిగి యమ్మహాత్ము నర్థి గాంచి.

426


ఆ.

యాదవులకుఁ గర్త యగునుగ్రసేనుని, కమరసభ సుధర్మ యడిగి తెమ్ము
నావుడును నతండు దేవేంద్రు నడిగి సు, ధర్మఁ దెచ్చె నవనితలమునకును.

427


క.

అమ్మహనీయసభామ, ధ్యమ్మున యాదవులు కొలువ హరిప్రాపున లో
క మ్మలర నుగ్రసేనుం, డమ్మధురానగర మేలె నతులవిభూతిన్.

428


క.

అనవుడు మైత్రేయుం డి, ట్లను మునివర లోకవంద్యుఁ డైనయశోదా
తనయుని శైశవశుభవ, ర్తనములు విన మిగుల నద్భుతము మది కొదవెన్.

429


తే.

అమ్మహాత్ముఁడు తరువాత హలధరుండు, దాను నేమేమి చేసిరి తత్కథాక్ర
మములు విశదంబుగా ననుక్రమముతోడఁ, జెప్పి నన్నుఁ గృతార్థునిఁ జేయుమనిన.

430
  1. కర్తవ్యంబు = యుక్తము, యవనికచేన్ = తెరచేత, ఆచ్ఛాదించి = కప్పి.
  2. అశ్రు = కన్నీళ్లయొక్క, పూరిత = నిండింపఁబడిన.