పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/355

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

భూరినియుద్ధచాతురిని బ్రోడలు చూడఁగ ముష్టికుండుఁ జా
ణూరుఁడు వీరితో యదుతనూభవు లెంతయుఁ బిన్నబిడ్డలే
పోరెడువారలంచుఁ దలపోయుచు నుండిరి యొక్కమ్రోఁతగా
నారభసంబు కంసుహృదయంబునకుం బగయయ్యె నత్తఱిన్.[1]

405


క.

మావంతునిచేఁ బ్రేరిత, మై వెసఁ బఱతెంచి కువలయాపీడగజం
బావసుదేవతనూజుల, పై వెసఁ గవియుటయు వారు పటుకోపమునన్.

406


ఉ.

పొంగుచు నైపుణంబులును భూరిబలంబులు నివ్వటిల్ల మా
తంగవిషాణముల్ పెఱికి తత్క్షణమాత్రన దానిఁ జంపి ప్రో
త్తుంగతదీయదంతములు దోల నమర్చినఁ జూడ నొప్పి రా
చెంగటఁ గాలదండములు చేకొనియున్న యమద్వయం బనన్.[2]

407


వ.

ఇట్లు విజృంభించి రంగమధ్యంబున నిలిచి చాణూరముష్టికులతోడం దలపడి
భద్రమూర్తులైన కృష్ణబలభద్రులు పెద్దయుం బ్రొద్దు పోరి రప్పు డన్యోన్య
భుజాస్ఫాలనధ్వానంబులును సముద్దండసింహనాదంబులును సకలసామాజికానేక
కలకలంబులును భేరీమృదంగతూర్యాదివాద్యఘోషంబులును వియచ్చరజయ
జయశబ్దంబులును దివ్యదుందుభినినాదంబులును మెదురంబయి రోదసీకుహరంబు
నిండె నప్పుడు.[3]

408


మ.

హరి చాణూరునితో నియుద్ధకుశలుండై పెద్దయుం బ్రొద్దు భీ
కరవృత్తిన్ సరిపోరుచున్న సుర లాకాశంబునన్ నిల్చి యీ
దురితాత్మున్ వధియించి కంసునసువుల్ త్రుంగించవే వేగనం
చు రణోద్యుక్తునిఁ జేసినన్ నగుచు యాశోదేయుఁ డుగ్రాకృతిన్.[4]

409


మ.

చతురుండై కడకాలు బిట్టొడిసి యాచాణూరునిన్ బల్విడిన్
శతవారంబులు ద్రిప్పెఁ గర్ణముఖనాసాగర్తలన్ ఘోరశో
ణితముల్ గాఱఁగ నంగముల్ దునిసి క్షోణీమండలిన్ రాల దై
వతలోకంబు నభంబునన్ నిలిచి కైవారంబు గావింపఁగన్.[5]

410


క.

హరి చాణూరునిఁ జంపిన, కరణిన్ హలపాణి ముష్టికనిశాచరునిన్
బరిమార్చి వారల కళే, బరయుగ మీడ్చుచును రంగభాగమునందున్.[6]

411


వ.

తమతోడిగోపబాలురనెల్లను బలాత్కారంబునం జేతులు పట్టి రంగస్థలంబునకుం
దిగిచి వారలుం దామును నుగ్రసేననందనుకర్ణంబుల కసహ్యంబులు సేయుచు
బేరెంబులు పాఱుచుండి రప్పుడు కంసుండు కోపరక్తలోచనుండై తనయమా
త్యులం బిలిచి యిట్లనియె.

412
  1. రభసంబు = సందడి.
  2. నైపుణంబులు = నేర్పులు, విషాణములు = కొమ్ములు, దోలన్ = చేతులయందు, చెంగటన్ = సమీపమునందు.
  3. వియచ్చర = దేవతలవలని.
  4. త్రుంగించవే = చంపవయ్యా, యాశోదేయుఁడు = యశోదకొడుకైన కృష్ణుఁడు.
  5. శతవారంబులు = నూఱుమార్లు, గర్తలన్ = రంధ్రములనుండి, కైవారంబు = స్తోత్రము.
  6. కరణిన్ = విధమున.