పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/354

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నియమించి కృష్ణునితో వైరానుబంధంబుననైన కోపంబు ప్రేరేప శుద్ధాంతమంది
రంబునకుం జని యుచితమార్గంబున నుండి మఱునాఁడు ప్రభాతసమయంబున.[1]

397

శ్రీకృష్ణబలభద్రులు కువలయాపీడం బనుగజంబును చాణూరముష్టికు లనుమల్లులను చంపుట

ఉ.

తమ్ములు బంధుమిత్రులును దాను నమాత్యచయంబు రాజలో
కమ్మును బౌరులుం గొలువఁ గంసుఁడు రంగసమీపతుంగమం
చమ్మున నెక్కి యుండెను విశాలసమున్నతభర్మరమ్యహ
ర్మ్యమ్ములనుండి చూడఁగఁ బురాంగనలున్ మఱి రాజపత్నులున్.[2]

398


వ.

మఱియు వసుదేవాక్రూరాదియాదవులును నందాదిగోపకులును మొదలుగా
సమస్తజనంబులును ప్రదేశంబులఁ జూచుచుండిరి. మల్లయుద్ధసన్నద్ధ
చాణూరముష్టికాదివీరులు మల్లప్రాశ్నికులతోడ రంగమధ్యంబు ప్రవేశించిరి.
కువలయాపీడగజేంద్రంబుతోడ మావంతుండు వచ్చి రంగద్వారంబున నొలసి
యుండె. సమస్తసైన్యంబులును జతురంగసమేతంబుగాఁ గట్టాయితంబయి
యుండె. అప్పుడు రాజానుమతంబున బలసి బలభద్రదామోదరులు గోపాల
కుమారులతోఁ గూడవచ్చి రంత.[3]

399


సీ.

కంసచాణూరాదికపటాయితశ్రేణి కలఁగుచు మృత్యువుగాఁ దలంప
సురపథంబుననుండి చూచి వియచ్చరౌఘము పరదైవముగాఁ దలంపఁ
గృతకృత్యు లగు దేవకీవసుదేవులు గరువంపుఁబుత్రుడుగాఁ దలంప
గోపాంగనాజనకోటి మోహనరూపకందర్పనిభమూర్తిగాఁ దలంపఁ


తే.

గోరి యాభీరదారకకోటి తమ్ముఁ, గలసి యాడెడు చెలికానిఁగాఁ దలంప
భూమిభారావతరణుఁడై భుజగనాథ, శయనుఁ డరుదెంచె బలభద్రసహితుఁ డగుచు.[4]

400


వ.

అప్పుడు.

401


ఉ.

ఏవున రామకేశవుల నెక్కటి మార్కొని బాహుశౌర్యముల్
చూపెడుమల్లు రెవ్వ రనుచున్ జనులెల్లఁ దలంచుచుండఁగాఁ
బాపవిచారులై యచటిప్రాశ్నికవర్గము కంసుచే నను
జ్ఞాపరులై సమస్తజనసంఘములున్ వెఱఁగందిచూడఁగన్.

402


క.

నారాయణుతోడను జా, ణూరుఁడు మఱి రోహిణీతనూజునితో దు
ర్వారబలుఁ డైనముష్టిక, వీరుఁడు యుద్ధంబు సేయ విభజించుటయున్.

403


వ.

అచ్చటి పెద్ద లయ్యుద్దులం జూచి.

404
  1. గంధసింధురము = మదపుటేనుఁగు, కట్టాయితంబు = మిక్కిలి సిద్ధపడినది, శుద్ధాంతమందిరంబునన్ = అంతఃపురమునందు.
  2. భర్మహర్మ్యమ్ములనుండి = బంగారుమేడలలోనుండి.
  3. ప్రాశ్నికులతోడన్ = సభికులతో, కలిసి = కూడి.
  4. ఆభీరదారకకోటి = గొల్లపిల్లకాయలగుంపు.