పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/353

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆ.

కృష్ణుకొంగుఁ గేలఁ గిలించి నేడు మా, యింట విడిది చేసి యేగుఁ డెల్లి
యనిన నేడు దీర దరుగుము నీవంచుఁ, బలికి మాధవుండు బలుఁడుఁ దాను.

389


వ.

ఒండొరు చేతులు వ్రేసి పెద్దయెలుంగున నవ్వుచుం జని రాజద్వారంబున నున్న
ధనుశ్శాలలోపలి కరిగి యచ్చట గంధపుష్పంబుల నలంకృతంబైనకంసునిధనువుఁ
గనుంగొని యమ్మహోత్సవంబుఁ జూచువారిచేత ధనుర్మహత్త్వంబు విని.

390

శ్రీకృష్ణుండు కంసుని ధనుర్యాగార్థ మలంకరింపఁబడినవిల్లు విఱుచుట

క.

శ్రీపతి యాచాపము గొని, మోపెట్టి చెలంగ మౌర్వి మ్రోయించుచు
నాటోపంబు మెఱయఁగాఁ దెగ, వాపిన లస్తకము పటురయంబున విఱిగెన్.[1]

391


తే.

ఆయుధాగారరక్షకు లైనవారు, కలహ మొనరింపఁ దమమీఁదఁ గడఁగుటయును
వారినందఱఁ దెగటార్చి ఘోరసింహ, నాద మొనరించెఁ బౌరజనములు బొగడ.[2]

392


తే.

అపుడు హతశేషు లగువార లరిగి కంసు, గాంచి యారామకృష్ణులు గబ్బితనము
తోడ నరుదెంచి చేసిన దుండగములు, విన్నవించినఁ బటుకోపవివశుఁ డగుచు.[3]

393


ఉ.

భూరినియుద్ధకౌశలము పొంపిరివోయి వెలుంగుచున్న చా
ణూరుని ముష్టికుం బిలిచి నూతనవస్తువు లిచ్చి నామదిన్
వైరము రేఁచుచున్న బలవంతులు నాబలభద్రకృష్ణులన్
మీరు వధింపుఁ డెల్లి కడుమీరిన మీభుజదర్ప మేర్పడన్.[4]

394


ఉ.

ఏపున దొమ్మినైన మఱియెక్కటి పోరుననైన వైరులన్
రూపఱఁ జేసి నాహృదయరోగము మాన్పుఁడు మీరు నేడు నా
కీపగ దీఱఁజేసితిరయేని మదీయవిభూతికెల్ల మీ
ప్రాపులు కాపులై నిలుచు బ్రహ్మకునైనఁ జలింపకుండుదున్.[5]

395


క.

ఎల్లి ప్రభాతంబున మీ, మల్లురతోఁ గూడి రంగమధ్యంబున మీ
రెల్లవిధంబులఁ జంపుఁడు, గొల్లపడుచులను నియుద్ధకుశలత మెఱయన్.[6]

396


వ.

మఱియుఁ గువలయాపీడం బనుగంధసింధురంబు మావంతునిచేతఁ బ్రచోదితం
బయి రంగద్వారంబున నిలిచి బలభద్రకృష్ణులు వచ్చినప్పుడె వధియింపంగల
యది సమస్తసైన్యంబులు కట్టాయితంబయి బలసి నగరివాకిటికి వచ్చునది యని

  1. మోపెట్టి = ఎక్కుపెట్టి, మౌర్వి = అల్లెత్రాడు.
  2. తెగటార్చి= చంపి.
  3. హతశేషులు = చావఁగా మిగిలినవారు, గబ్బితనము = గాంభీర్యము.
  4. నియుద్ధకౌశలము = బాహుయుద్ధమునందలి నేర్పు, పొంపిరిపోయి = అతిశయించి, రేఁచు = పెంచు.
  5. దొమ్మినైనన్ = గుంపుగా బోయి ఆక్రమించునట్టి యుద్ధమునందైనను, ఎక్కటి = ఒంటరి, రూపఱన్ = నశింప, ప్రాపులు = తోడుపాటులు.
  6. గొల్లపడుచులన్ = గొల్లపిల్లకాయలను.