పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/352

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


భక్తితాత్పర్యంబులతోడ మోఁకరించి కరంబులు నేలనూఁది నమస్కరించి పరి
మళమిళితంబు లైనపూవుదండ లొసంగి వారిజాక్షున కిట్లనియె.[1]

381


ఉ.

దేవా దేవరవంటివారు కరుణాదృష్టిన్ ననున్ బుణ్యునిన్
గావింపంగఁ దలంచి పుష్పములకుం గామించి యేతెంచినా
రీవేళన్ మిముఁ బూజసేయఁగలిగెన్ హేలావినోదాత్మ నా
సేవల్ గైకొనుమంచు మ్రొక్కినఁ గృపాచిత్తంబునన్ గృష్ణుఁడున్.[2]

382


క.

అతనికిఁ గులాభివృద్ధియు, నతులితమోక్షంబుఁ గలుగునట్టివరంబుల్
ధృతి నొసఁగి శౌరి యామంత్రితుఁడై పురవీథి నరుగుదేరఁగ నెదురన్.

383

శ్రీకృష్ణుండు తనకు పరిమళగంధం బొసంగిన కుబ్జను సుందరాంగిగాఁ జేయుట

ఉ.

దేవకిపట్టి గాంచెను ధృతిన్ మృగనాభియు హైమవారియున్
గోవజవాదియుం బునుఁగుఁ గుంకుమపంకముఁ గప్పురంబుఁ గ్రొ
త్తావులు పిక్కటిల్లఁగఁ గదంబము గూర్చినచందనంబు హే
లావిధిఁ జంద్రకాంతపుశిలామయపాత్రికఁ దెచ్చుజవ్వనిన్.[3]

384


వ.

ఒక్కకుబ్జకాంతం గనుంగొని చందనం బడుగుటయు నయ్యిందువదన ముకుం
దునిసౌందర్యంబు మెచ్చుచు నిట్లనియె.[4]

385


సీ.

నిత్యకృత్యంబుగ నేరుపుతో నేను దిగిచినగందంబు మృగమదంబు
మొదలుగాఁ బరిమళంబులు కదంబము గూర్చి సూడిద గాఁగఁ గంసునికి నిచ్చి
కడలేనిమన్ననల్ గైకొను నన్ను నీ విట్లెఱుంగవొ కాని యెల్లవారు
వినియుండుదురు మీరు వేడుకపడియున్న నీరానివస్తువు లేమి గలవు


ఆ.

నాకు మిమువంటిలోకోత్తరుల కియ్యఁ, గలిగె నింతకంటె ఘనత గలదె
యనుచుఁ గోరలోనిఘనసారగంధంబు, వలసినట్ల యొసఁగె వారలకును.[5]

386


క.

తనువున నెఱపూఁతలుగా, నొనరఁగ గందంబుఁ బూయుచుండి వినోదం
బున సల్లాపము లాడుచు, వనజాక్షుఁడు కుబ్జకాంతవరచిబుకంబున్.[6]

387


తే.

తనకరాంగుళములఁ బట్టి దానిపాద, యుగముపై నిజచరణంబు లొనరఁబెట్టి
నిక్కఁ దిగిచి విక్షేపణ మక్కజముగఁ, జేయుటయు మోహనాకృతిఁ జెలఁగెఁ దరుణి.[7]

388
  1. పుష్పలావిక = పువ్వులవానియొక్క, సురభి = పరిమళముగల, మోఁకరించి = మోఁకాళ్లు నేల మోప నిలిచి, ఊది = ఊని.
  2. కామించి = కోరి, హేలావినోదాత్మ = లీలచే కాలము గడుపుటయందు మనసు గలవాఁడా.
  3. మృగనాభి = కస్తూరి, హైమవారి = పన్నీరు, గోవ = మనోజ్ఞమైన, క్రొత్తావులు = అపూర్వవాసనలు, కదంబము = నానావిధపరిమళము, హేలావిధిన్ = విలాసముగా, పాత్రికన్ = గిన్నెయందు.
  4. కుబ్జకాంతన్ = మఱుగుజ్జుదానిని.
  5. తిగిచిన = తీసిన, మృగమదంబు = కస్తురి, సూడిద = కానుక.
  6. సల్లాపములు = ముచ్చటలు, చిబుకంబున్ = గడ్డమును.
  7. విక్షేపణము = ఎగయనెత్తుట.