పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/351

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అని యిట్లు పలుకుచున్న యతనిచిత్తంబున నున్నఖేదం బుడిపి నారాయణుండు
మన్నించె నిట్లు వారలు రథారూఢులై యచ్చోటు గదలి సాయాహ్నకాలంబు
నకు మధురాపురంబున కరిగి రప్పుడు సీరిచక్రుల కక్రూరుం డిట్లనియె.[1]

373


ఆ.

అరద మెక్కి మీర లరుగుదెంచినఁ గంసుఁ, డలిగి నన్ను నేమియైనఁ బలుకుఁ
గానఁ బాదచారులై నడతెండు మీ, యుపద లెల్లఁ గొనుచు నిపుడు పురికి.[2]

374


వ.

మీరు దేవకీవసుదేవులం బొడగనుటకై తదీయనివాసంబునకుఁ బోయిన మీ
మీఁదివిరోధంబున నావృద్ధదంపతుల కద్దురాత్ముం డైవకంసుం డుపద్రవంబు
సేయందలంచుఁ గావున నవ్విధంబు పరిహరించునది యని నిర్దేశించి యామం
త్రితుండై కంసుపాలికిం జని తనపోయివచ్చినవృత్తాంతంబును రామదామో
దరానుగమనంబునుం జెప్పి నిజనివాసంబునకుం జనియె నంత.[3]

375

శ్రీకృష్ణుండు మధురాపురంబుఁ బ్రవేశించి రజకుని వధించి చలువవలువలు గొనుట

ఉ.

గోపకుమారకుల్ బలసి కొల్వఁగఁ గృష్ణుఁడు సీరపాణితో
నాపురిరాజమార్గమున నంచితమోహనదివ్యమూర్తియై
యేపున మత్తదంతిగతి నేగుచునుండెను భక్తిసంభ్రమ
స్థాపితచిత్తులై నిలిచి సర్వజనంబులుఁ జేరి చూడఁగన్.[4]

376


క.

చనుదెంచుచున్నసమయం, బున నొకరజకుండు మడుఁగుపుట్టంబులు కం
సునినగరికిఁ గొనిపోవఁగఁ, గనుఁగొని వస్త్రములు దనకుఁ గట్టఁగ నడిగెన్.[5]

377


క.

నీచగుణవర్తి గావున, నాచాకి వివేకహీనుఁడై మురవైరిన్
జూచి నిరసించి మదమున, నేచినదుర్వాక్యసరణి నిట్లని పలికెన్.[6]

378


మ.

విను మాయేలికకంసుఁ డీవచనముల్ విన్నన్ నినున్ బ్రాణముల్
గొను గోపాల మదించి గోధనములన్ గోల్పోయెదో పోయెదో
యనుచుం బల్కిన శౌరి కోపహృదయుండై తచ్ఛిరం బుద్ధతిన్
దునియంగొట్టెఁ బతాకహస్తనిహతిన్ దోరంబు లీలాగతిన్.[7]

379


తే.

సీరపాణికి నందులో జిలుఁగువన్నె, పట్టుపచ్చడ మొక్కటి గట్ట నిచ్చి
పసిఁడిచెఱఁగులపచ్చనిపచ్చడంబు, తాను ధరియించెఁ గృష్ణుఁ డుద్దండమునను.

380


వ.

తక్కినవస్త్రంబు లన్నియు వల్లవకుమారుల కొసంగి పుష్పలావికగృహంబున
కుం బోయి తమకు ముడువందగిన సురభికుసుమనికరంబు లడిగిన వాఁడు భయ

  1. ఖేదంబు = విచారమును.
  2. నడతెండు = రండు, ఉపదలు = కానుకలు.
  3. పరిహరించునది = మానుకోవలసినది, నిర్దేశించి = చెప్పి, ఆమంత్రితుండు = సెలవుపొందినవాఁడు.
  4. బలసి = చుట్టుకొని, ఏపునన్ = విజృంభణముతో, మత్తదంతిగతి = మదపుటేనుఁగువలె.
  5. రజకుండు = చాకలవాఁడు, మడుఁగుపుట్టంబులు = చలువవస్త్రములు.
  6. నిరసించి = తిరస్కరించి, ఏచిన = మీరిన - తనయధికారమునకు మించిన యనుట.
  7. ఏలిక = ఏలినవాఁడు - రాజు, ప్రాణముల్ గొనున్ = చంపును, 380 జిలుఁగువన్నె = చిత్రవర్ణముగల, ఉద్దండమునన్ = ఉద్ధతితో.