పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/350

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

మఱియు నాబలభద్రునియుత్సంగంబున నతసీకుసుమవర్ణుండును వనమాలావి
రాజితుండును పీతాంబరధరుండును నై శక్రచాపతటిన్మాలికాపరిశోభితం బైన
నీలమేఘంబుచందంబున నున్నకృష్ణునిం బొడగాంచి పులకదంతురాంచితశరీ
రుండై నాసికాగ్రంబున దృష్టి నిలిపి పెద్దయుంబ్రొద్దు చూచి సంశయాద్భుతచి
త్తంబున లేచి బహిఃప్రదేశంబునం జూచిన.[1]

365


ఆ.

తేరిమీఁద నధికదివ్యతేజోవిలా, సముల నున్నరామచక్రధరులఁ
దెలియఁ జూచి మఱియు సలిలంబులోపల, మునిఁగి కాంచెఁ దొంటిమూర్తియుగము.

366


చ.

కనుఁగొని యద్భుతంబును వికాసము భక్తియుఁ జెంగలింప న
య్యనముఁడు యోగదృష్టిఁ బరమార్థమహామహిమాన్యులైన యా
ఘనులవికాసమూర్తు లొడికంబుగఁ గన్గొని వారియందు నె
మ్మనమున యందు నొందఁగ నమర్చి కడుం దడ వుండి పెంపుతోన్.[2]

367


వ.

మనోమయంబు లైనగంధపుష్పధూపదీపనైవేద్యనమస్కారాద్యుపచారంబులు
గావించి కృతార్థుండై జలంబులు వెడలి దామోదరుపాలికి వచ్చి గమనంబునకు
సంభ్రమించుచున్న యక్రూరునకుఁ జక్రధరుం డిట్లనియె.

368


క.

నీవదనంబు వికాసము, శ్రీ వెలయుచు నున్న దిపుడు చెచ్చెర యమునా
పావనజలంబులోపల, భూవినుత విశేష మేమి పొడగంటివొకో.[3]

369


చ.

అనవుడు గాందినీతనయుఁ డమ్మురమర్దనుఁ జూచి నీవెఱుం
గని పని యేమి యున్నది జగన్నుత నన్నుఁ గృతార్థుఁ జేయఁగా
మనమునఁ గల్గి యీసలిలమధ్యమునం దటువంటి నీపురా
తన మగుదివ్యమూర్తి విదితంబుగఁ జూపితి వద్భుతంబుగన్.[4]

370


క.

నీకరుణ యివ్విధంబున, నేకొఱఁతయు లేక యున్న యేను దురాత్ముం
డై కపటవృత్తు లుడుగని, యాకంసునిఁ గొలిచియుండ నర్హుఁడ నైతిన్.

371


ఆ.

వలసినట్లు తనకు వర్తింపఁగాఁ జెల్ల, దొడలిసుఖము లాసపడఁగరాదు
పరులఁ గొలిచి కుడిచి బ్రతికెడుఁవాఁడు జీ, వన్మృతుండు వాఁడె వారిజాక్ష.[5]

372
  1. ఉత్సంగంబునన్ = ముందఱిభాగమునందు, శక్రచాపతటిన్మాలికాపరిశోభితంబు = ఇంద్రధనుస్సుచేతను మెఱుపుచాలుచేతను ప్రకాశించునది, అద్భుత = ఆశ్చర్యము నొందిన.
  2. చెంగలింపన్ = హెచ్చగా, ఒడికంబుగన్ = చక్కగా, వారియందున్ = నీళ్లలో.
  3. వికాసము = తేటదనము.
  4. విదితంబుగన్ = తెలియఁబడునట్లు, అద్భుతంబుగన్ = వింతగా.
  5. జీవన్మృతుండు = బ్రతికియుఁ జచ్చినవాఁడు.