పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/349

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పడఁతులార యెట్లు బ్రతుకువారము దైవ, మేల వాపె నొక్కొ యితని మనల.[1]

355


తే.

నందసూనుండు పౌరాంగనావిలాస, నిగళములఁ జిక్కి యచ్చట నిలుచుఁగాక
యిచటి కేటికిఁ దా వచ్చు నుచితవాక్య, చతురవచనలు లేని గొల్లతలకడకు.[2]

356


క.

ఈరీతి మనకు విరహము, ప్రేరేప యశోదపట్టిఁ బెడఁబాపిన యీ
క్రూరుని నక్రూరుం డని, యేరీతిం బిలువవచ్చు నింతులు వినరే.

357


తే.

కొందఱము పోయి కృష్ణుని కొంగుపట్టి, యాఁగి మము నిట్లు విరహాగ్నిఁ గ్రాగఁజేసి
యేలపోయెదు మము డించి యేము వత్తు, మనిన మన పెద్ద లచట నేమందురొక్కొ.[3]

358


ఆ.

మాధవుండు లేని మనగొల్లపల్లియ, నేడు మొదలుగాఁగ నెలఁతలార
చిన్నవోయియుండుఁ జెల్లఁబో యీదైవ, మెంతకీడు చేసె నిపుడు మనకు.[4]

359


వ.

అని యి ట్లత్యంతవిరహవ్యథాధీనహృదయ లగుచు ఘోషకాంతలు ధేనుకాం
తకువలను చూచుచు దృష్టి కగోచరం బగుటం జేసి మగిడి తమతమనివాసంబు
లకువచ్చి యథాప్రకారంబుల నుండి రంత.

360

అక్రూరునకు యమునానదీజలమునందు శ్రీకృష్ణభగవంతుఁడు ప్రత్యక్షమగుట

క.

సారథియై యక్రూరుఁడు, తేరితురంగముల నధికతీవ్రతఁ బఱపన్
వారలు మధ్యాహ్నమునకు, బోరనఁ గాళిందిదరికిఁ బోయి మునీంద్రా.[5]

361


క.

అరదము దిగి యక్రూరుఁడు, హరితో మాధ్యాహ్నికాదు లగుకృత్యంబుల్
పరిపాటిఁ దీర్చి వచ్చెద, నరగడియకు మీరు నిలువుఁ డని చని భక్తిన్.[6]

362


ఉ.

ఆనదిలోపల మునిఁగి యాచమనం బొనరించి నిశ్చల
ధ్యానసమాధి నుండి పరతత్వమహత్త్వము నాసికాగ్రసం
ధాననిరీక్షణంబుగ నొనర్చుచు వెండియుఁ దీర్థ మాడినన్
మానుగఁ గానవచ్చెఁ బరమం బగువైష్ణవతత్వ మేర్పడన్.[7]

363


సీ.

కుందేందుధవళితాంగుని నీలపరిధానపరిశోభితునిఁ గదంబప్రసూన
వనమాలికాభూషితుని రత్నకుండలాంచితగండమండలు నతులవికసి
తాంభోజదళనేత్రు రంభాదిదేవాంగనాజనస్తోత్రు ఫణాసహస్ర
భాసితు వాసుకిప్రముఖనానాపన్నగేశ్వరపరివృతు నిద్ధచరితు


తే.

ముసలలాంగలపాణి తమోగుణప్ర, శస్తు నాద్యు ననంతు సమస్తభువన
భారవహు బలభద్రునిఁ బరమపురుషు, దివ్యతేజోవికాససందీప్తుఁ గాంచె.[8]

364
  1. కంతుసాయకములన్ = మన్మథుని బాణములచేత.
  2. నిగళములన్ = సంకెళ్లయందు.
  3. ఆఁగి = నిలిపి, క్రాఁగన్ = తపింప.
  4. చెల్లఁబో = అయ్యో.
  5. బోరనన్ = క్రమముగా.
  6. పరిపాటి = క్రమముగా.
  7. నాసికాగ్రసంధాననిరీక్షణంబుగన్ = ముక్కుమొనను గూర్చిన చూపు గలుగునట్టుగా.
  8. కుందేందుధవళితాంగునిన్ = మల్లెపువ్వులవలెను చంద్రునివలెను తెల్లనైన దేహముగలవానిని, పరిధాన = కట్టువస్త్రముచేత, కదంబప్రసూన = కడిమిపువ్వులచేనైన, అంచితగండమండలున్ = ఒప్పిదములైన గండస్థలములు గలవానిని, వికసిత = వికసించిన, ఇద్థ = ప్రకాశించునట్టి.