పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/348

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ధనుర్యజ్ఞవ్యాజంబున నందాదిగోపకులతోడఁ దముం బిలువవచ్చుటయును
విన్నవించిన నాప్రపంచవేది యతని కిట్లనియె.[1]

346


క.

నీ విపుడు నాకుఁ జెప్పిన, యీవచనము లెల్ల నేను నెఱుఁగుదు నక్రూ
రా వినుము కంసు నసువులు, లేవనియుండుదువు గాని లెక్కింపకుమీ.[2]

347


తే.

నీవు మెచ్చంగా నెల్లుండి నేను గంసు, ప్రాణములు గొని మానవప్రతతు లెల్ల
నుల్లసిల్లంగ భూమికి నుగ్రసేనుఁ, బట్టభద్రునిఁ జేసేదఁ బ్రాభవమున.

348


ఉ.

ఎల్లి ప్రభాతకాలమున నిచ్చటఁ గల్గిననెయ్యిపాలు కా
వళ్ల నమర్చికొ న్చనఁగ వల్లవులన్ సమకట్టి సంబరం
బెల్లవిధంబులన్ మెఱయ నేనును నీవును నందవీరులున్
గొల్లలలోనఁ బెద్దలును గూడి రయంబునఁ బోద మర్థితోన్.[3]

349


వ.

అని పలికి యారాత్రి నందుమందిరంబున నందఱు వసియించి మఱునాఁడు ప్రభా
తసమయంబునఁ గాలోచితకృత్యంబులు దీర్చి దధిక్షీరాజ్యాద్యుపాయనంబుల
తోడం దగువారి ముందర ననిపి యక్రూరుండు సారథిగా బలభద్రసహితం
బుగా రథారోహణంబు చేసి చనునప్పుడు.

350

గోపికలు శ్రీకృష్ణవిరహభీతలై చింతించుట

ఉ.

అచ్చటిగోపభామలు మురారిప్రయాణము చూచి యెంతయున్
ముచ్చట లగ్గలింప మరుమోహనబాణవిభిన్నచిత్తలై
వెచ్చనియూర్పులు న్నిగుడ వేదనలం దురపిల్లికన్నులన్
బిచ్చిలుబాష్పవారిఁ దమబింకపుఁజన్నులు దొప్పఁదోఁగఁగన్.[4]

351


క.

విరహాగ్నివలన దేహము, లరవరలై హస్తభూషణావళులెల్లన్
హరిఁ గోరి జాఱిపడఁగా, నరుదుగ నొకచోటఁ గూడి యందఱుఁ దమలోన్.[5]

352


ఉ.

ఇందునిభాస్యలార మనకెల్ల మనోహరమూర్తియైన యీ
నందతనూభవుండు కరుణారస మించుక యైనలేక తా
నిందఱఁ గూడి యామధుర కిచ్చమెయిం జనుచున్నవాఁడు సొం
పొందఁగ వీనితోఁ గలసియుండుట కింకొకనాడు గల్గునే.

353


ఆ.

పౌరసతుల సరసభాషామృతంబుల, సోన లితనిచెవుల సోఁకెనేని
గొల్లసతులతోడి కూరిమి దలపోసి, యితఁడు చౌక సేయ కేల మాను.[6]

354


ఆ.

ఏమి సేయువార మీతనిఁ బెడఁ బాసి, కంతుసాయకముల గాసిపడక

  1. ప్రచోదితుండు = ప్రేరేపించఁబడినవాఁడు, ఉదాసీనంబులు = చెప్పరానిమాటలు, నిగళప్రాప్తునిన్ = సంకెళ్లు వేయఁబడినవానిగా, విచారించుట = ఆలోచించుట, దుర్మంత్రంబు = దురాలోచన, వ్యాజంబునన్ = నెపముచేత, ప్రపంచవేది = సర్వము తెలిసినవాఁడు.
  2. అసువులు = ప్రాణములు.
  3. ఎల్లి = రేపు, సంబరంబు = వేడుక.
  4. అగ్గలింపన్ = అతిశయింప, విభిన్న = మిక్కిలి భేదిల్లిన, దురపిల్లి = శోకించి, పిచ్చిలు = స్రవించు, బింకపు = బిగువులైన, తొప్పఁ దోఁగఁగన్ = మిక్కిలి తడియఁగా.
  5. అరవరలు = కృశించినవి.
  6. సోనలు =ధారలు, చౌక = అలక్ష్యము.