పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/346

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అని యివ్విధంబున విష్ణుభక్తియుక్తం బైనడెందంబు పరమానందంబునం బొందఁ
దదనులాపంబులు చింతించుచు నరిగి యరిగి నందగోకులంబునకు వచ్చి నంత.[1]

332


చ.

పడమటివంకఁ గ్రుంకఁ జను భాస్కరబింబముఁ దూర్పుకొండపైఁ
బొడిచినచంద్రమండలముఁ బొల్పెసలారెఁ బయోజసంభవుం
డెడపక రాసిమాసగతు లెక్కువతక్కువ లైనకాలముల్
తడఁబడు నంచుఁ దూన్చునెడఁ దాసునఁ దేలెడు చిప్పలో యనన్.[2]

333


వ.

ఇట్టి సాయంకాలసమయంబున రామకృష్ణులు వల్లవకుమారసమేతులై పసులక
దుపులనెల్లను గోష్ఠంబునకుఁ దెచ్చి తమతమవెరవులం గుదురఁద్రోలి దుగ్ధదో
హనంబునకు సమకట్టుచున్నసమయంబున.[3]

334


మ.

కనియెన్ భాగవతోత్తముండు త్రిజగత్కల్యాణవర్ధిష్ణునిన్
వనజాతాసనవాసవప్రభృతిదేవప్రాభవాధిష్ణునిన్
ఘనగర్వాంధనిశాచరేంద్రవరభాగ్యప్రక్రియాజిష్ణునిన్
కనదంభోధరకృష్ణునిన్ సుజనరక్షాతృష్ణునిన్ గృష్ణునిన్.[4]

335


మ.

లలితాంభోరుహపత్రనేత్రుఁ గరుణాలంకారు నాజానుబా
హులతాశోభితుఁ బీతవస్త్రకటిభారోదగ్రుఁ గస్తూరికా
తిలకున్ మండితమందహాసవదనున్ దేదీప్యమానప్రభా
కలితున్ భూషితవన్యపుష్పుఁ ద్రిజగత్కల్యాణపారీణునిన్.[5]

336


సీ.

అరుణారుణచ్ఛాయ లగుపాదములు నేల నూఁది చక్కఁగ నిలుచున్నవానిఁ
బరిమళించుచునున్న విరితెల్లదామర నెలమితో నవతంస మిడినవాని
గోధూళిపొదివినకుండలంబులతోడ నింద్రనీలచ్ఛాయ నెసఁగువాని
వక్షంబునందు శ్రీవత్సచిహ్నము క్రేవబెడఁగుగా వనమాల యిడినవాని


తే.

పేరుకొని లేఁగటావులఁ బిలిచి పిలిచి, పిచ్చలించుచుఁ గ్రేవుల విడుచువాని
క్షీరకలశంబు నుఱుద్రాళ్లుఁ జేతఁబట్టి, యమరు గోపాలకృష్ణు నల్లంతఁ గాంచె.[6]

337
  1. అనులాపంబులు = మాటిమాటికి మాటలాడుటలు.
  2. ఎడపక = ఎడపడక.
  3. దుగ్ధదోహనంబునన్ = పాలు పిదుకుటకు.
  4. వర్ధిష్టునిన్ = వృద్ధిపొందించుశీలము గలవానిని, వనజాతాసన = బ్రహ్మ, ప్రాభవాధిష్ణునిన్ = ప్రభుత్వము నధిష్ఠించియుండువానిని, ప్రక్రియా = అధికారమును, జిష్ణునిన్ = జయించు శీలముగలవానిని, కనదంభోధరకృష్ణునిన్ = ప్రకాశించునట్టి మేఘమువలె నల్లనైనవానిని, కృష్ణునిన్ = ఆసక్తిగలవానిని.
  5. అంభోరుహపత్ర = తామరఱేకులవంటి, ఆజానుబాహులతా = మోఁకాళ్లను తాఁకునట్టి చేతులనెడుతీఁగలచేత, పీతవస్త్రకటిభారోదగ్రున్ = పచ్చనివస్త్రము గలపిఱుఁదులచేత ప్రకాశించువానిని, మండిత = అలంకరింపఁబడిన, దేదీప్యమానప్రభాకలితున్ = మిక్కిలి వెలుఁగునట్టి కాంతితో కూడుకొన్నవానిని, వన్య = అడవియందుఁ బుట్టిన.
  6. అరుణారుణ = సూర్యునియెఱుపువంటి యెఱుపుగల, విరి = వికసించిన, అవతంసము = శిరోభూషణముగా, కుంతలంబులతోడన్ = ముంగురులతో, క్రేవన్ = పార్శ్వమునందు, పిచ్చలించుచున్ = త్వరపడుచు.