పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/345

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ప్రక్కలు వాపి చంపె సురవర్గము కో యని యార్చుచుండఁగన్.[1]

324


ఉ.

ఆదనుజేంద్రు నిట్లు దెగటార్చి వికాసవిభాసి యైనదా
మోదరు విక్రమక్రమము నున్నతి గోపకగోపికాజనుల్
సాదరచిత్తులై పొగడి రప్పుడు నారదమౌ నివచ్చి యం
భోదపథంబునన్ నిలిచి బోరునఁ గృష్ణునిఁ బ్రస్తుతించుచున్.[2]

325


చ.

కలహము నాకుఁ గన్గొనఁగఁ గల్గిన నంతియె చాలు నెమ్మెయిన్
బిలువనిపేరఁటం బరిగి ప్రేమముతోఁ గనుఁగొందు గావునన్
జలరుహనేత్ర యీహయనిశాచరవీరునిచావు చూడఁగా
వలసి యతిప్రయత్నమున వచ్చితిఁ జూచితిఁ జాల మెచ్చితిన్.

326


ఉ.

ఓశతపత్రనేత్ర కరుణోదయ నందకుమార దేవతా
ధీశునకైన మార్కొని జయింపఁగరాని బలాఢ్యుఁడైన యీ
కేశిని జిత్రయుద్ధమున గీటణఁగించితి గానఁ బెంపుతో
గేశవనామకంబు గలిగించితి నీకు జగత్ప్రసిద్ధిగన్.

327


ఉ.

నిక్కము గాఁగఁ గంసునకు నీకును నాలుగుమూడునాళ్లలో
నక్కజమైన యుద్ధ మగునప్పుడు వానికి బూని భూపతుల్
స్రుక్కక యెందఱేనియును రూపఱిపోయెద రట్టివైభవం
బొక్కటియుం గనుంగొనఁగ నుత్సవ మేర్పడ నేగుదెంచెదన్.[3]

328


వ.

నీకు నభ్యుదయం బగుఁ బోయివచ్చెద నని నారదుండు పోయె నంతట.

329

అక్రూరుండు వ్రేపల్లెకు వచ్చి భగవత్సందర్శనంబు సేయుట

మ.

అరదం బెక్కి ప్రమోద మేర్పడఁగ నయ్యక్రూరుఁ డేతెంచుచున్
బరమాహ్లాదము భక్తియుక్తియును దాత్పర్యంబుఁ జిత్తంబులో
బెరయన్ గృష్ణునిఁ బుండరీకనయనున్ బీతాంబరున్ ధారుణీ
ధరునిన్ జూడఁగ నేడు గల్గెను గృతార్థంబయ్యె నాజన్మమున్.[4]

330


సీ.

తలఁచినమాత్రఁ బాతకముల నెడఁబాపు సుజనవత్సలు నేడు చూడఁగలిగె
బ్రహ్మాదులకునైనఁ బ్రణతుల కోపని మురవిరోధికి నేడు మ్రొక్కఁగలిగె
నఖిలవేదాంతవిద్యారహస్యంబులప్రోడతో నేడు మాటాడఁగలిగెఁ
బ్రాపంచికముఁ దృణప్రాయంబు గావించు ప్రభువుమన్నన నేడు పడయఁగలిగె


తే.

సత్వగుణలేశములచేత జగముఁ గాచు, పురుషవర్యుండు నను నేడు ప్రోవఁగలిగె
నెంత భాగ్యోత్తరుఁడనొకొ యేను గమల, నాభు సేవించి భక్తి యొనర్పఁగలిగె.[5]

331
  1. విహ్వలభావమున్ = వివశతను.
  2. అంభోదపథంబునన్ = ఆకాశమార్గమున, బోరునన్ = మిక్కిలి.
  3. అక్కజము = అధికము, స్రుక్కక = వెనుకదీయక.
  4. బెరయన్ = నిండుకొనఁగా.
  5. ఓపని = అనువు పడని, ప్రోడ = ప్రౌఢుఁడు, ప్రాపంచికమున్ = ప్రపంచమునందలి వ్యవహారమును.