పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/344

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ముష్టికచాణూరాదుల, ముష్టిహతులనైనఁ బ్రాణములు గొనిపింతున్
దుష్టాత్ములలోకముల న, పష్టంభం బైనఁబ్రాభవము నా కొదవన్.[1]

317


సీ.

తొలిదొలి రామకృష్ణులఁ జంపి మఱి దేవకీవసుదేవుల గీటణంచి
నందగోపాదుల నందఱఁ బెదపెదకొఱ్ఱుల నిడి వారిగోధనంబు
హరియించి మాతండ్రి యగునుగ్రసేనునితోఁగూడ నాకతిద్రోహులైన
యదువంశజులనెల్లఁ బొదివి దామెనకట్టుగాఁ గట్టి వెసఁ గులక్షయము చేసి


తే.

యేచి నిష్కంటకం బైనయీజగంబు, నేన యేలెద లోకంబులెల్లఁ బొగడ
నీవు నాకుఁ బ్రియంబుగా నీప్రయోజ, నంబు గావించుటకుఁ బయనంబు గమ్ము.

318


క.

చాలఁగ నేతులు పెరుగులు, పాలును గోపకులచేతఁ బట్టించుక ర
మ్మాలస్యము సేయక యని, లాలన గావించుటయుఁ జెలంగుచు మదిలోన్.

319


వ.

పరమభాగవతుం డైననాశ్వఫల్గునందనుండు దనకుఁ గృష్ణసందర్శనంబు గలిగెఁ
గృతార్థుండనయితి నని సంతసిల్లుచు రథారూఢుండై మధురాపురంబు నిర్ణమించె
నప్పుడు.

320

కేశి యనువాని వధించుటవలన నారదుండు కృష్ణునికిఁ గేశవుఁ డని పేరిడుట

మ.

అట కంసాసురుదూత కేశి యనువాఁ దశ్వాకృతిన్ దారుణ
స్ఫుటహేషారటనంబు లాకసమునన్ బూరింపఁగాఁ జేయుచున్
పటలం బుట్టినగాలిచే జలధిసంఛన్నంబు గావించుచున్
జటులోదగ్రఖురాగ్రఘట్టనల భూచక్రంబు భేదించుచున్.[2]

321


మ.

చని బృందావనవీథిలో మెఱయు గోష్ఠం బుద్ధతిన్ జొచ్చి గ్ర
క్కున గోవిందునిమీఁద వచ్చునెడ నాగోపాలగోపాంగనా
జనులెల్లన్ మొఱపెట్టుచుఁ బఱచినన్ సంరంభచండప్రతా
పనిరూఢుం డగునవ్విభుం డసురుపైఁ బ్రస్వేదకోపంబునన్.[3]

322


మ.

ఎదు రేతెంచి యదల్చుచున్నహరిపై హేషరవోద్వృత్తుఁడై
వదనద్వారము విచ్చి బిట్టు గఱవన్ వల్గింపఁగా లీలతో
యదుచూడామణి ముష్టిహస్తము తదీయాస్యంబున జొన్పినన్
రదముల్ శారదవారిభృచ్ఛకలవిభ్రాంతిన్ వెసన్ డుల్లినన్.[4]

323


ఉ.

అక్కమలాయతాక్షుఁడు భయంకరబాహువు దైత్యుకుక్షిలోఁ
గ్రుక్కినఁ దద్దయున్ బలిసి రోగ ముపేక్షలచేత మేనికిన్
వెక్కస మైనచందమున విహ్వలభావముఁ జేసి దేహమున్

  1. అపష్టంభము = అవలంబము.
  2. హేషారటనంబు = సకిలింతచప్పుడు, పటలన్ = జూలువలన, సంఛన్నంబు = చక్కఁగా కప్పఁబడినది, ఖురాగ్ర = గిట్టమొనలచేనైన.
  3. సంరంభ = వేగిరపాటుతోడి, చండ = వేండ్రమైన, ప్రస్వేద = మిక్కిలి వేండ్రమైన.
  4. వల్గింపఁగాన్ = చుట్టు పరుగుపాఱఁగా, శారదవారి భృచ్ఛకలవిభ్రాంతి = శరత్కాలమేఘఖండము లనెడుభ్రమ గల్గించుటతో, డుల్లినన్ = రాలఁగా.