పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/343

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జన్మించి నందగోకులంబునం బెరుగుటయును గృష్ణుండు పూతనచన్నుఁబాలతో
డంగూడఁ బ్రాణంబులు గ్రోలుటయును శకటపరివర్తనంబు సేయుటయును యమ
ళార్జునంబులఁ గూలఁద్రోచుటయు యమునాహ్రదంబున నున్న కాళియాహి
మర్దించుటయు ధేనుకాసురుం బరిమార్చి తాళవనంబు నిష్కంటకంబు సేయుట
యును భాండీరవనంబున నున్న ప్రలంబుని బలభద్రుచేతం జంపించుటయును
బర్జన్యప్రయుక్తం బైనవర్షంబువలన నందగోకులనివాసులకు నుపద్రవంబు గా
కుండ గోవర్ధనశైలంబు ఛత్రంబుగాఁ బట్టుటయును గోపికాజనసమేతుండై
రాసక్రీడల వినోదించుటయును అరిష్టాసురుం బరిమార్చుటయును మొదలుగా
సమస్తంబును సవిస్తరంబుగాఁ జెప్పిపోయిన.

310


క.

కంసుఁడు భోజేంద్రకులో, త్తంసుఁడు శక్రాదిదేవతాగణశుభవి
ధ్వంసుఁడు భగినీపుత్రనృ, శంసుఁడు నానాసురప్రశంసుఁడు కినుకన్.[1]

311


సీ.

ఆనకదుందుభి నవరాని వినరాని దుర్వాక్యసూచులఁ దూలపుచ్చె
వృష్ణిభోజాంధకవీరవర్గము నెల్లభంగుల సకలసంపదలు గొనియె
నందగోపునియాలమందల నన్నింటి బలిమిఁ గైకొని వీరభటుల నినిచెఁ
దనమేలు చూడఁజాలనివీరవర్గంబు క్రొవ్వాఁడి గొఱ్ఱుల గ్రుచ్చఁ బనిచె


తే.

ధర్మమార్గంబు దప్పనితండ్రి నుగ్ర, సేను శృంఖలాబద్దునిఁ జేసి బంది
గమున నిడి మేటిదైత్యులఁ గాపువెట్టె, గంసుఁ డత్యంతభీకరాకారుఁ డగుచు.[2]

312


ఉ.

జన్నము పేరు చెప్పి పటుసత్వసమగ్రుల రామకృష్ణులన్
మిన్నక పిల్వఁబంచి బలిమిన్ వధియించెద నొండె నట్లుగా
కున్నను జెట్లచేత వధ మొందగఁజేసెద నొండెఁ బోరిలో
నెన్నివిధంబులం బగఱనే పణగించెద నిన్నినేర్పులన్.

313


వ.

అని యిట్లు తనలో విచారించి.

314


సీ.

అక్రూరుఁ బిలిచి యిట్లను నన్నుఁ జంపుటకై విష్ణుదేవునియంశమునను
వసుదేవదేవకీవరపుత్రులై రామనారాయణులు పుట్టి నందగోప
గోకులంబున బెరుగుచునుండి నావారి నందఱిఁ జంపినా రనుచు నేఁడు
నారదుం డేతెంచి నాతోడ సకలంబు నేకాంతమునఁ జెప్పి యిప్పు డేగె


తే.

నెంత చేసిరి చూచితే యీవుదక్క, నకట నాతండ్రి యుగ్రసేనాదులైన
యాదవులు నాకుఁ గీడు సేయంగఁ బూని, యున్నవా రింక నేమని యుగ్గడింతు.

315


మ.

అది యట్లుండెను గాందినీసుత ధనుర్యజ్ఞంబు గావింపఁగా
నిదె యెల్లుండి యుపక్రమించెదను నీవే తన్నిమిత్తంబుగా
ముద మొప్పన్ రథ మెక్కి వే గదలి రాముం గృష్ణునిన్ నందగో
పదురాత్ముం గొనిరమ్ము వచ్చినను దత్పాపాత్ములం జంపెదన్.

316
  1. విధ్వంసుఁడు = చెఱుచువాఁడు, నృశంసుఁడు = హింసకుఁడు.
  2. సూదులన్ = సూదులచేత, శృంఖలాబద్ధునిన్ = సంకెల వేయఁబడినవానిని, బందిగమునన్ = కారాగృహమునందు, పగఱన్ = శత్రువులను.