పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/341

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నచట నయ్యింతియొయ్యారంపుఁగొప్పులో వెనుకదిక్కుననుండి విరులు దుఱిమె
సరులు చిక్కులువడ్డఁ జక్కఁద్రోయఁగఁబోలు నెదురులై యున్నవి యివె పదమ్ము
లివె తనపాదంబు లవి గ్రుంగియున్నవి యువిదకుఁ గైదండ యొసఁగఁబోలు


తే.

నడచి బడలినసతిఁ దనతొడలమీఁద, నునిచి కౌఁగిటఁ జేర్చి కూర్చుండె నచట
నలిగి మరలిన ప్రియురాలి యలుకదీర్చి, యల్ల పొదరింటిలో రతు లనుభవించి.[1]

295


చ.

అని తనతోడియింతులకు నంబుజలోచనుచొప్పుఁ జెప్పుచున్
జని చని ముందటం గనిరి చంద్రనిభాస్యలు మందవాతసం
జనితకళిందజాసలిలసంభృతశీకరశీతలంబు లై
తనరుచు నున్నయట్టి సికతామయవేదుల నున్న వెన్నునిన్.[2]

296


ఉ.

పెన్నిధిఁ గాంచి సంతసిలు పేదలకైవడి గోపికాజనుల్
వెన్నునిఁ జూచి చిత్తముల వేడుక లుల్లసిలంగ నిప్పు డీ
వెన్నలదొంగఁ జూడఁగలిగెన్ మనపాలిటిభాగ్య మబ్బెనో
కన్నియలార యంచుఁ బులకల్ తనువల్లుల నివ్వటిల్లఁగన్.

297


సీ.

తరళాక్షి యొక్కతె త్రస్తరి గావించెఁ జేయెత్తి యంజలి చేసె నొకతె
యాలింగనము చేసె యలరించె నొక్కర్తు తనమోవి చవిచూపి తనిపె నొకతె
పులకాంకురంబులు పొదలించె నొకలేమ చూపులు నాటించి చొక్కె నొకతె
యొకతె పువ్వులదండ యుపధాన మొనరించె నొకయింతి తరులకు నొయ్యఁ బిలిచె


తే.

నతని వదనాంబుజము దరహాసరసము, కాంత యొక్కతె నేత్రభృంగములఁ దనిపె
నివ్విధంబున గోపిక లెల్ల నధిక, సంభ్రమంబున నుండి రాసమయమునను.[3]

298

రాసక్రీడావిహారము

క.

ఎందఱు గోపవధూమణు, లందఱకును నన్నిరూపులై యప్పుడు గో
విందుఁడు రాసక్రీడా, నందంబున రతులు సలిపె ననువేపారన్.

299


క.

ఒక్కొకకృష్ణుఁడు గోపిక, యొక్క తెయును వరుస నిలిచి యొండొరుకరముల్
మక్కువఁ గైకొని యందఱు, నక్కజముగ రాసమండలాకృతి బెరయన్.

300


వ.

ఇట్లు రాసమండలప్రమాణంబు చేసి పెద్దయుం బ్రొద్దు నటియించి యత్యంతపరి
శ్రాంత లైనయక్కాంతల నాలింగనంబునం జుంబనసంభాషణసంభోగాదివిశే
షంబులం దనిపి సేదలు దేర్చి తాళమానంబుగా నందఱు రాససంగీతంబు చేసి
ప్రభాతసమయంబున గోకులంబునకు వచ్చి యథాప్రకారంబున నుండి రిట్లు ప్రతి
రాత్రంబును గోపికలతోడఁ గైశోరవినోదంబుల రాసక్రీడ లాడుచుండె.[4]

301
  1. మోపన్ = ఆనఁగా, సరులు = హారములు, కైదండ = చేయాసరా.
  2. కళిందజా = యమునయందలి, శీకర = తుంపురులచేత, సికతామయ = ఇసుకదిన్నెలనెడు.
  3. త్రస్తరి = క్రిందు, పొదలించెన్ = వృద్ధిపొందించెను, ఉపధానము = తలగడ.
  4. పరిశ్రాంతలు = బడలికనొందినవారు, సేదలు = బడలికలు, కైశోర = పసితనపు.