పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/340

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

మఱియు ననేకప్రకారంబుల నాభీరవారిజాక్షు లమ్మదనగురుకడకుం జని
యతనిం బరివేష్టించి మురళీనాదంబు వినుచుఁ జిత్రరూపంబులచందంబున నుండి
రంత.[1]

286


మ.

మురళీనాదముచేత గోపికలకున్ మోహంబు పుట్టించుచున్
సరసత్వంబున మేనిచక్కఁదనమున్ సంగీతపాండిత్యమున్
బెరయన్ వారలు దన్నుఁ గూడి నడవన్ బృందాటవీమధ్యభా
సురరమ్యస్థలులందుఁ క్రీడ సలిపెన్ సొంపారి లీలాగతిన్.

287


క.

బృందావనమున నీగతి, బృందారక చక్రవర్తి ప్రియమున గోపీ
బృందయుతుండై మోహము, చెందఁగఁ బుష్పాపచయము సేయుచునుండెన్.[2]

288


ఉ.

వ్రేతలఁ గూడి యిట్లు వనవీథులఁ బూఁబొదరిండ్లు దూఱియున్
జేతులు వ్రేసి పాఱియును జెచ్చెర దాఁగిలి ముచ్చులాడియున్
గీతము నేర్పి యొండొరుల గెల్వఁగఁ జేసియు నిట్లు శంబరా
రాతిగురుండు యౌవనము రంజిలఁగా విహరించె నొక్కెడన్.

289


ఉ.

వల్లవకాంత యోర్తు యదువల్లభునిం దననేర్పు చూపి రం
జిల్లఁగఁజేసి తోడిసరసీరుహనేత్రను గానకుండఁ దా
నల్లనఁ గొంచుఁబోయి సముదంచితశీతలవారిబిందువుల్
చల్లుచు నున్న యయ్యమునసైకతభూములఁ క్రీడలాడఁగన్.

290


ఉ.

గోపమృగాక్షులందఱు ముకుందునిఁ గానక తద్వియోగసం
తాపము లంతకంతకు మనంబున నివ్వటిలంగ నవ్విభుం
డేపొల మేగెనో వెదకరే చెలులార యటంచు మాధవీ
నీపరసాలసాలరమణీయతలంబులఁ జూచి యొక్కెడన్.[3]

291


క.

గోపసతి యొకతె గాంచెను, జాపకలశవజ్రశంఖచక్రజలజరే
ఖాపరిశోభితమహిమలఁ, జూపట్టెడు హరిపదములచొ ప్పొకచోటన్.[4]

292


చ.

కని తనుఁ గూడి వచ్చు చెలికత్తియలన్ గుమిగూర్చి మీకుఁ గృ
ష్ణునిపదపంకజాతముల చొప్పిదె చూపెద భాగ్యరేఖలన్
దనరుచు నున్న దెవ్వతెకుఁ దాఁ బ్రియుఁడై రతి సల్పఁబోయెనో
గొనకొని యొక్కయింతి యడుగుం జనుచున్నది దీనివెంబడిన్.

293


క.

చనుఁగవయు గొప్పపిఱుఁదును, ఘనభారము లగుటఁ జేసి కడుఁగుంగిన యా
వనితపదంబులు కుఱుచై, చనుచున్నవి హరిపదము లసవ్యము లందున్.

294


సీ.

మునివ్రేళ్లు భూమిపై మోపనిచ్చుట నిక్కి యల్ల చెట్టున బువ్వు లంది కోసె

  1. అభీరవారిజాక్షులు = గోపికలు, మురళి = పిల్లంగ్రోవి.
  2. బృందారకచక్రవర్తి = దేవతలలో శ్రేష్ఠుఁడైన కృష్ణుఁడు, పుష్పాపచయము = పువ్వులు గోయుట.
  3. వియోగ = విరహమువలని, నివ్వటిలంగన్ = అతిశయింపఁగా.
  4. చొప్పు = జాడ.