పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/339

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

శుద్దసాళగసంకీరశోభితముల, శ్రుతులు చెడకుండఁ జెవులకు సొగసు గులుక
వేణునాదంబు మొరయించె రాణ మెఱయ, మదనగోపాలమూర్తి యమ్మాధవుండు.[1]

276


వ.

ఇట్లు సకలజనప్రమోదంబుగా వేణునాదంబు పూరించిన గోపాలగోపాంగనాగో
గణంబులును బశుపక్షిమృగాదినానాజంతుజాలంబును బర్వతవృక్షలతాగుల్మాది
సమసస్థావరభూతంబులును దమకుఁ దారి చొక్కి చిత్రరూపంబుల చందం
బుల నుండి రప్పుడు వల్లవపల్లవాధర లమ్మోహనాకారునందు బద్ధానురాగలై.[2]

277


క.

పెనిమిటికి నత్తమామల, కును దలిదండ్రులకు బంధుకోటికిఁ దోఁబు
ట్టిన మగవారికి వెఱవక, ననుపునఁ జని రతనివేణునాదంబునకున్.[3]

278


సీ.

ప్రాణేశ్వరునిశయ్యపై నుండి యొకయింతి కృష్ణలీలలు సాళగించి పాడె
నత్తమామలు చూడ నలివేణియొక్కతె తతకారములు చేసి తాళమొత్తె
దల్లిదండ్రులమ్రోలఁ దమకించి యొకలేమ లీలాగతుల సుమాళించి పాడెఁ
జుట్టంబు లెల్లను జూడ నొక్కమృగాక్షి మెల్లనఁ దలయూచి మెచ్చె నతని


తే.

వనజనయనుమీఁదివలపున నొకకొమ్మ, యిల్లు వెడలివచ్చి యెదురుకట్ల
పెద్దవార లున్నఁ బెద్దయు శంకించి, మమతతోడ మేను మఱచియుండె.[4]

279


క.

వల్లవసతియొక్కతె తన, వల్లభునిరతిప్రసంగవైభవములపొం
దొల్లక మెల్లనె లక్ష్మీ, వల్లభునిం జూడవచ్చె వల పేపారన్.

280


ఆ.

లేఁగదూడ నొక్కలేమ చిక్కముతోడఁ, గుడువ విడిచె నొక్కకోమలాంగి
కాఁగి పొంగుచున్న గాఁగులపాలలో, నీరు చల్ల మఱచి నిలిచియుండె.

281


ఆ.

ఆవుఁ బిదుకఁబోయి యలివేణియొక్కతె, దూడ వెనుకకాళ్లతోడ నావు
నడగఁగట్టి యొద్ది యాఁబోతుఁ దలకోలఁ, బట్టి యుఱ్ఱుగట్టి బయలు బితికె.

282


ఆ.

వనితయొకతె పతికి వడ్డించి వడ్డించి, బానతోడ నున్న యానవాలు
కుమ్మరించి తోడికోడండ్రు వదినెలు, మేలమాడుచుండ మేను మఱచె.[5]

283


ఆ.

మందలోన నుండి మగఁ డేల రాడోకో, యనుచు నత్త మొఱిఁగి యరిగె నొకతె
యావు వెదకితెత్తునని యొక్కగొల్లత, విభునిఁ గికురువెట్టి వెడలిపోయె.[6]

284


ఆ.

మగఁడు చూడ నత్తమామలు కోపింప, నిండ్లు విడిచి మీకు నేల పోవఁ
బొలఁతులార యనుచు బుద్ధి చెప్పఁగఁ బోయి, నట్లు పోయె నొక్కయబ్జవదన.

285
  1. తాన = మెట్టువరుసలయొక్క, మూర్ఛన = రాగములయారోహణావరోహణములయొక్క, సాళగ = కలగలుపుతోడి రాగాలాపముచేతను, రాణ = మనోజ్ఞత.
  2. గుల్మాది = పొదలు మొదలైన, స్థావర = తమయున్నచోటనుండి కదలనేరని, చొక్కి = పరవశత్వము నొంది.
  3. ననుపునన్ = మోహముచేత.
  4. సాళగించి = రాగమును ఆలాపన చేసి, తతకారము = తత అనుధ్వని, సుమాళించి = చొక్కి, ఎదురుకట్ల = ఎదుట.
  5. ఆనవాలు = నానబియ్యము, మేలము = ఎగతాళి.
  6. మొఱఁగి = ఏమఱించి, కికురువెట్టి = మోసపుచ్చి.