పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/338

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

అనవుడుఁ గొంతసేపు జలజాయతలోచనుఁ దూరకుండి గ్ర
క్కున నలవోకగాఁ బ్రణయకోపము గైకొని వారితోడ ని
ట్లను నను నొత్తి మీ రడుగు టర్హమె నందునకున్ యశోదకున్
దనయుఁడఁగాని కాను మఱితక్కినవారలలోన నెవ్వఁడన్.[1]

270


క.

నాయందు మీరు బాంధవు, లైయుండుట నీతిగాక యన్యవిచార
ప్రాయవిధి నీయపృచ్ఛలు, సేయుట యేనీతి యేమి చెప్పుదు మీకున్.[2]

271


ఆ.

అనుచు వారిమతుల కాంధ్యంబు గల్పించి, వలయుభంగి బాంధవంబు నడపి
నందనందనుండు బృందావనమున గో, పాలబాలకేళిఁ దేలుచుండె.[3]

272

శ్రీకృష్ణుండు వేణుగానము సేయఁగా గోపికలు విని మోహించుట

వ.

అంత వికాసభాసురకుముదసౌరభసంవాసితసకలదిశాభాగంబును నిందీవరమక
రందబైందవానందసుందరేందిందిరఝంకారరావంబును షోడశకళాపూర్ణచంద్ర
చంద్రికాసాంద్రసమస్తభువనతలంబును నైనశరత్కాలంబునఁ గృష్ణుండు
గోపికాజనమనోహరంబయిన సౌకుమార్యంబుతోడ వినోదించుచుండి యొక్క
నాఁడు నిశాసమయంబున.[4]

273


ఉ.

పున్నమవన్నె శంభుతలపువ్వు ముకుందునిచూపు దట్టపున్
వెన్నెలదుంప జక్కవలవేసడి చీఁకటిమూఁకవిప్పు వా
రాన్నిధియుబ్బు తామరల రాయడి వేల్పులపంట మింటిపైఁ
దిన్ననిపూర్వచంద్రికలు దిక్కులకున్ వెదచల్లుచుండఁగన్.[5]

274


మ.

తనసౌందర్యవికాసయౌవనము కందర్పాభిరామంబుగాఁ
దనయొయ్యారపునీతి గోపికలచిత్తప్రీతి గావింపఁగాఁ
దనసంగీతవచోవిలాసము సుధాధారాప్రపూరంబుగా
వనజాతాక్షుఁడు సర్వమోహనకళావర్ధిష్ణుఁడై పెంపుతోన్.[6]

275


సీ.

పరఁగు షడ్జాదిసప్తస్వరంబులు మంద్రమధ్యతారకతానమార్గములును
బురుషాంగనారాగములు ముప్పదియు రెండు వానిమిత్రంబులు వరుస నెఱిఁగి
కాలక్రియామానగతులతోఁ దాళంబు లెఱిఁగి మూర్ఛనవృత్తు లేర్పరించి
గీతంబు దరువు జక్కిణి చిందు మొదలుగా నొక్కొక్కవర్ణంబు నుగ్గడించి

  1. అలవోకగాన్ = విలాసముగా, ప్రణయకోపము = ప్రేమతోఁగూడిన కోపము.
  2. అపృచ్ఛలు = తగనిప్రశ్నలు.
  3. ఆంధ్యము = గుడ్డితనము - అజ్ఞానమనుట.
  4. సంవాసిత = చక్కఁగా పరిమళింపఁజేయఁబడిన, మకరందబైందవ = పూఁదేనెబిందువులవల్ల నైన, చంద్రికా = వెన్నెలచేత.
  5. దుంప = రాశి యనుట, వేసడి = చెఱుపరి, చీఁకటిమూఁకవిప్పు = చీఁకటిని పోఁగొట్టువాఁడు, వారాన్నిధియుబ్బు = సముద్రమును ఉప్పొంగునట్లు చేయువాఁడు, రాయడి = పీడ, వేల్పులపంట = దేవతలఫలము, తిన్నని = సౌమ్యములైన.
  6. ఒయ్యారపు = విలాసముయొక్క, పూరంబు = మేలైన ప్రవాహము, వర్ధిష్ణుఁడు = వృద్ధి
    పొందు నిచ్ఛగలవాఁడు.