పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/337

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మార్గంబున నిలిచి జయజయశబ్దంబులఁ బుష్పవర్షంబులు గురియుచు దివ్యదుం
దుభినినాదంబులు రోదసీకుహరంబున బెరయ మొరయించి రప్పు డేకాంతంబున
శచీకాంతుండు లక్ష్మీకాంతున కిట్లనియె.[1]

262


ఉ.

ఈజగతీభరం బుడుప నీవు గడంగెడునాడు నీకుఁ దో
డై జయలక్ష్మిఁ జేకొనఁగ నర్జుననామముతో మదంశజుం
డై జనియించినాఁడు పృథయందుఁ గుమారుఁడు వానిఁ గావు మీ
యాజులలోన శాత్రవభయంబునఁ బొందకయుండఁ గేశవా.[2]

263


సీ.

అనిన నుపేంద్రుఁ డయ్యమరేంద్రుతోడ నిట్లను నేను నెఱుఁగుదు నవ్విధంబు
పాండవకౌరవుల్ బలసి యష్టాదశాక్షౌహిణీబలముతో నాహవంబు
గావించునప్పుడు కవ్వడితోఁ బాండుసుతుల కేవురకు నెచ్చోటఁ గీడు
రాకుండ నారసి రక్షింతు నాశరీరప్రాణముల యట్లు రమణతోడ


తే.

భూమిభారంబు సర్వంబుఁ బొలియఁజేసి, యేను బరమపదంబున కేగునంత
కాలమును భూమి నేలింతుఁ గాని మాన, వారికీర్తులు ధరణిలో వన్నె కెక్క.[3]

264


వ.

ఇప్పుడే నరిష్టకంసకేశినరకాసురాదు లైనవారలం బరిమార్పి పదంపడి భారత
యుద్ధంబునఁ బ్రజాక్షయంబు సేయువాఁడ నర్జునునిమిత్తంబుగా నీకు నింతపరి
తాపంబు వలవదని చెప్పినఁ బురందరుండు సంతుష్టహృదయుండై యతనిం
గౌఁగిలించి యామంత్రితుండై యైరావతంబు నెక్కి దేవలోకంబునకుం బోయె
నంత.[4]

265


మ.

అమరేంద్రాదులకైన భారమగు కార్యంబుల్ ముకుందుండు బా
ల్యమునం జేసినఁ జూచి గోపవరు లత్యాశ్చర్యచేతస్కులై
సముద్రగ్రోచ్చరవంబులం బొగడి యాసర్వేశ్వరున్ మూఁగి యో
విమలాకారవికారదూరకరుణావిద్భూతదామోదరా.[5]

266


ఆ.

కొండ గొడుగుఁజేసి గోవులతోఁగూడ, మమ్ముఁ గాచినట్టి మహితకృత్య
మమరు లైననోప రట్టిపౌరుషము నీ, వాచరించు టెల్ల నద్భుతంబు.

267


క.

మాగొల్లపల్లెలోపల, నీగతిఁ గ్రీడించుచున్న నీ వమరుఁడవో
నాగేంద్రుఁడవో సిద్ధుఁడ, వో గంధర్వుఁడవో దానవుండవో చెపుమా.

268


ఆ.

నిను మనుష్యమాత్రుఁడని నమ్మఁగారాదు, మాకు నీస్వరూపమహిమయెల్ల
నిజము చెప్పకున్న నీకు నీపాదంబు, లాన తండ్రియాన యావులాన.

269
  1. ప్రసన్నమూర్తులు = కళంకములేని యాకృతి గలవి, రోదసీకుహరంబునన్ = భూమ్యాకాశమధ్య మనెడుగుహయందు, బెరయన్ = వ్యాపింవఁగా.
  2. జగతీభరంబు = భూభారము, ఆజులలోనన్ = యుద్ధములయందు.
  3. కవ్వడితోన్ = ఆర్జునునితో, పొలియన్ = నశింప.
  4. పదంపడి = పిమ్మట, ఆమంత్రితుఁడు = పంపఁబడినవాఁడు.
  5. భారము = అశక్యము, చేతస్కులు = మనసు గలవారు, సముద్రగ్రోచ్చరవంబులన్ = గంభీరములైన గట్టి చప్పుళ్లతో, మూఁగి = చుట్టుకొని.