పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/336

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బులు సుత్రాముండు పరుషంబుగఁ గరకావర్షంబు గురియించి గోష్ఠంబునకు
నేయపాయంబును జేయనేరక విషణ్ణహృదయుండై మేఘంబుల వారించిన
నాక్షణంబ.[1]

252


క.

ఆశాశంబు పయోదా, నీకంబులు లేక మిగుల నిర్మలమయ్యెన్
భీకరతరసంసార, వ్యాకులములు లేనియోగియాత్మయుఁ బోలెన్.[2]

253


క.

ఈవిధమున నాఘోషము, గోవిందుఁడు గాచి కరుణ కొనసాగంగా
గోవర్ధనాద్రిఁ దొల్లిటి, తావున నీడి మహిమతో విడంబించుటయున్.[3]

254

శ్రీకృష్ణునిసన్నిధికి నింద్రుండు వచ్చుట

ఆ.

పాకశాసనుండు పరమానురాగంబు, తోడ నందసుతునిఁ జూడఁగోరి
యభ్రగజము నెక్కి యరుదెంచి పొడగాంచె, నఖిలలోకజిష్ణుఁ డైనకృష్ణు.[4]

255


క.

గరుడుఁడు గగనమునను నె, వ్వరికిం గానంగరాక వరపక్షములన్
గరువమున నీడపట్టఁగఁ, బరమానందమున నున్నభవ్యునిఁ గాంచెన్.

256


వ.

ఇట్లు కనుంగొని యైరావతావతరణంబు చేసి సకలభువననిక్షేపీకృతోదరుండైన
దామోదరు నాలింగనాద్యుపచారంబుల సంభావించి యిట్లనియె.[5]

257


ఉ.

ఏపున నాదితేయదనుజేంద్రగణంబులు దేఱిచూడఁగా
నోపని యమ్మహీధరము నొక్కకరంబునఁ దాల్చి గోపికా
గోపకగోనికాయములకున్ బటువృష్టిభయంబు మాన్చి యు
ద్దీపితబాహుఁగర్వమునఁ దేజము నొందితి నందనందనా.

258


తే.

ఇట్టి యద్భుతకర్మంబు లీవు బాల్య, కాలమున నాచరించితి గానఁ గృష్ణ
భావికాలంబునందు భూభార ముడుప, నీవు చాలుదు వని నిశ్చయించినాఁడ.

259


క.

నీవు జగంబులు మెచ్చఁగ, గోవర్ధనపర్వతంబు గొడుగుగ నిడి యీ
గోవులఁ గాచితి గావున, గోవిందుఁడవైతి నందగోపకుమారా.

260


క.

అనఘాత్మ గోగణంబుల, యనుమతమున నీకు గోగణాధిపతిత్వం
బొనరింతు నుపేంద్రత్వం, బున నుండుము సకలలోకములు జయపెట్టన్.[6]

261


వ.

అని పలికి యైరావతంబుచేతం బవిత్రోదకంబులు దెప్పించి యభిషేకించె నదినిమి
త్తంబుగాఁ గృష్ణుం డుపేంద్రుండును గోవిందుండును ననంబరఁగె నప్పుడు
గోగణంబు లత్యంతప్రసన్నమూర్తులై యయ్యాదిమూర్తికి క్షీరధారాభిషేకం
బు చేసె సురాసురయక్షగంధర్వకిన్నరకింపురుషసిద్ధవిద్యాధరగణంబులు గగన

  1. సంజాత =పుట్టిన, కంజాతభవాండభారవహనప్రశస్తంబు = బ్రహ్మాండముయొక్క భారమును వహించుటచేత మెచ్చుపడిసినది, తాలచ్ఛత్రంబు = తాటాకుగొడుగు, ధారాధరప్రయుక్తంబు = మేఘములవలన ప్రయోగింపఁబడినది, సుత్రాముండు = ఇంద్రుఁడు, పరుషంబుగన్ = గడుసుగా, కరకావర్షంబు = వడగండ్లవాన, గోష్ఠంబునకున్ = మందకు, విషణ్ణ = విషాదము నొసంగిన.
  2. పయోదానీకంబులు = మేఘసమూహములు.
  3. విడంబించుటయున్ = ఒప్పఁగా.
  4. పాకశాసనుండు = ఇంద్రుఁడు, అభ్రగజము = ఐరావతమును.
  5. అవతరణంబు చేసి = దిగి, నిక్షేపీకృత = నిక్షేపముగాఁ జేయఁబడిన, సంభావించి = గౌరవించి.
  6. జయ పెట్టన్ = జయజయ యని పొగడఁగా.