పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/335

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

ధరణీదిగ్గగనంబు లేకముగ నుత్పాతాంబుదశ్రేణి ని
ర్భరవృత్తిన్ క్షణమాత్రలో నిబిడధారాసారపూరంబుగాఁ
గురిసెన్ వానలు చండవాతములతో ఘోరాంధకారంబుతో
నురునిర్ఘాతతటిత్పరంపరలతో నొక్కుమ్మడిన్ బెట్టుగన్.[1]

248


వ.

ఇట్లు మహోత్పాతవర్షంబులు గురియునప్పు డత్యంతదుర్నిరీక్ష్యప్రకంపితశంపా
తేజంబులవలనను బధిరీకృతసమస్తభూతవ్రాతఘుమఘుమారావస్తనితశబ్దంబుల
వలనను మహోగ్రతుంగశృంగమహీధరచూర్ణితనిర్ఘాతపాతమహోగ్రధ్వానం
బులవలనను చండశుండాలశుండాదండసమానధారాసారకరకావర్షంబులవలనను
దుర్దినీభూతసకలదిశాపరిచ్ఛిన్నజీమూతజాతఘనాంధకారంబులవలనను బ్రమసి
నందగోకులంబునం గలనానాగోగణంబులును జచ్చియును నొచ్చియును
వడఁకులు పట్టియును మెడలు మడంగియును నఱచియునుం బఱచియును జెల్లా
చెదరయ్యును వఱదలం గలసియును నిట్లు బహువిధంబుల నింద్రజాలంబు
చూపినవిధంబునఁ బసులు నేలపాలైనం గనుగొని గోపికాగోపవర్గంబు లార్తనా
దంబులతోడ నున్నం జూచి దామోదరుఁ డిట్లనియె.[2]

249


క.

తనయాగము విఘ్నము చే, సినకీడున వజ్రి యింత చేసెను మీగో
ధనమును మిమ్మును గాచెద, రునికితములు మానుఁ డనుచు మదిఁ గృప మెఱయన్.[3]


క.

గోపాలురు వెఱఁగందఁగ, గోపీజనవల్లభుండు గొడుగుగఁ బట్టెన్
గోపీగోపకగోగణ, గోపనసద్వర్తనమును గోవర్ధనమున్.[4]

251


వ.

ఇట్లు గోవర్ధనశైలంబుఁ బెఱికి సకలచరాచరభూతసంజాతకంజాతభవాండభార
వహనప్రశస్తం బైనయపసవ్యహస్తంబున విచిత్రంబుగాఁ దాళఛ్ఛత్రంబునుం
బోలె గోపాలగోపాంగనాగోగణంబులమీఁద పురందరచోదితసంవర్తధారా
ధరప్రయుక్తం బైనయమహావర్షంబు గురియకుండఁబట్టె ని ట్లేడహోరాత్రం

  1. ఉత్పాతాంబుదశ్రేణి = ప్రళయమేఘపఙ్క్తి, నిబిడ పట్టమైన, చండవేగము గల, ఉరు=అధికమైన, ఒక్కుమ్మడిన్ = ఒక్కసారిగా.
  2. దుర్నిరీక్ష్యప్రకంపితశంపాతేజంబులవలనను = చూడ శక్యముగాని మిక్కిలి చలించునట్టి మెఱుపులవెలుఁగులవల్లను, బధిరీకృత = చెవుడుగలంగఁజేయఁబడిన, వ్రాత = సమూహముగల, స్తనిత = ఉఱుములయొక్క, తుంగ = ఉన్నతమైన, చూర్ణిత = పొడి చేయఁబడిన, నిర్ఘాతపాత = పిడుగుపడుటయొక్క, శుండాలశుండాదండ = ఏనుఁగుతొండముతోడ, కరకా = వడగండ్లతోడి, దుర్దినీభూత = సూర్యప్రకాశము లేని పగలు కలదిగా నగుచున్న, అపరిచ్ఛిన్న = కమ్ముకొనుటచే మితిలేని, జీమూతజాత = మేఘసముదాయముచేనైన, వఱదలన్ = ప్రవాహములలో, ఆర్తనాదంబులతోన్ = మొఱ్ఱోయనుకూఁతల చప్పుళ్లతో.
  3. కీడునన్ = లోపముచేత, మనికితములు = సందేహములు.
  4. గోపన = దాఁచుటచేత.