పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/334

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


భోజనంబులు పెట్టించి గంధపుష్పాక్షతల నలంకరించిన మొదవులతోడ గిరి
ప్రదక్షిణంబు చేసిన మనకు శోభనంబు గలుగునని చెప్పిన నతనివచనంబు లాద
రించి సాధువాదంబులఁ గొనియాడి.[1]

237


క.

ఆగోవిందుఁడు చెప్పిన, లాగున నందాదిగోకులావాసులు నా
నాగతుల నాచరించిరి, గోగిరియజ్ఞములు భక్తి కొనసాగంగన్.[2]

238


వ.

ఇట్లు గోవర్ధనమహోత్సవంబు చేసి గర్జితాభంబులచందంబున నర్తనంబులు చేయు
దుర్దమవృషభంబులతోడ సర్వాలంకారశోభితంబు లైనగోగణంబులు మున్నుగా
సమస్తగోపాలవర్గంబులు పర్వతప్రదక్షిణంబులు చేసి యనేకస్తోత్రంబులతోడ
నమస్కారములు చేసి రంత.[3]

239


క.

ఆపర్వతాగ్రమునఁ దన, రూపము బలభద్రసోదరుఁడు చూపుచు నా
గోపాలవర్గమునకును, నేపార ననేకఫలము లిచ్చి చనుటయున్.

240


వ.

ఇవ్విధంబున.

241


క.

గోవర్ధనశైలమునకు, గోవులకును మఘము చేసి గోపాలురతో
నావులగుంపులతోడను, గోవిందుఁడు మరలివచ్చె గోకులమునకున్.

242


క.

వాసవుఁడు నందగోపుఁడు, చేసినయపరాధమునకుఁ జిత్తములోనన్
గాసిలి మేఘగణంబుల, లో సంవర్తాఖ్యజలదలోకముఁ బెలుచన్.[4]

243


క.

రప్పించి యధికసంభ్రమ, ముప్పొంగఁగ నందగోపుఁ డున్నవ్రజముపై
చెప్పరపుతాలవర్షము, గుప్పింపుఁడు గోగణములు గోవులు మడియున్.[5]

244


క.

ఇది యనుచితకృత్యం బని, మదిఁ దలఁపక యరుగుఁ డభ్రమాతంగముపై
ముదమొప్ప నెక్కి యేనుం, గదలి మిముం జూడ వత్తుఁ గడునెచ్చరికన్.[6]

245


వ.

అని యనేకప్రకారంబుల బుజ్జగించుచు వెచ్చరించిన ప్రసాదంబని యాసంవ
ర్తనమేఘగణంబు చని పర్జన్యుండు మెచ్చునట్లు నిర్ఘాతవాతవర్షంబులు గురి
యంజొచ్చిన.[7]

246


మ.

శతమన్యుండు తటిత్కరావళులచే ఝంఝాగతిం గొట్టఁగా
నతిభీతిన్ మొఱవెట్టెనో యనఁగ నుద్యల్లీల గర్జించి యు
ద్ధతవృత్తిన్ జటులాంబుదంబులు తదీయానేకభూషామణి
ప్రతతుల్ రాలినయట్లు రాలె పిడుగుల్ ప్రవృతమై భూస్థలిన్.[8]

247
  1. సర్వఘోషసమేతంబుగా = ఎల్లమందలతోడ, గాటంబుగాన్ = విశేషముగా, వేఁటలన్ = పొట్టేళ్లను, జాతరలు = ఉత్సవములు, పాయస = పరమాన్నము, ఆపూప = పిండివంటలు, వ్యంజన = కూరలు, రంజితంబులు = మనోజ్ఞములు, శోభనంబు = శుభము.
  2. కొనసాగంగన్ = అతిశయింపఁగా.
  3. గర్జితాభ్రంబులచందంబున = ఉఱుముచున్న మేఘములవలె, దుర్దమ = అణఁపరాని.
  4. గాసిలి = కోపించి, పెలుచన్ = ఉద్ధతితో.
  5. దెప్పరపు = ఆపద నొందించునట్టి, గుప్పింపుఁడు = కురియుఁడు, మడియున్ = చావఁగా.
  6. అభ్రమాతంగము = ఐరావతము.
  7. నిర్ఘాతవాతవర్షంబులు = పిడుగులతోడి గాలివానలు.
  8. శతమన్యుఁడు = ఇంద్రుడు, తటిక్కరావళులచేతన్ = మెఱుపులను చేతులచేత, ఝంఝా = వానగాలి, చటులాంబుదంబులు = భయంకరములైన మేఘములు, ప్రస్ఫీతము = మిక్కిలివెలుఁగునట్టిది.