పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే.

మానకుండినఁ గాదని మదిఁ దలంచి, యుర్విఁ గీర్తిప్రతాపంబు లుల్లసిల్ల
రాఘవేంద్రుండు బసవయరాఘవేంద్రుఁ, డై ధరిత్రీతలంబున నవతరించె.[1]

66


క.

ఆతనియాచార్యుఁడు వి, ఖ్యాతయశోధనుఁడు సింగనార్యుఁడు వెలసెన్
భూతలమునందుఁ దిరుమల, తాతయవంశమున సకలధర్మజ్ఞుండై.

67


సీ.

వేదాంతవిద్యావివేకి షడ్దర్శనపారంగతుండు పరాపరరహస్య
వేది బ్రహ్మాండాదివివిధపురాణజ్ఞుఁ డపమానధర్మశాస్త్రాభినేయ
కుశలుఁడు పరమార్థకోవిదుం డఖిలాధ్వరక్రియానిపుణుఁ డవక్రకావ్య
నాటకాలంకారనానాకళాభిజ్ఞుఁ డుభయభాషాకవితోజ్జ్వలుండు


తే.

పరమవైష్ణవమార్గతత్పరుఁడు కీర్తి, ధనుఁడు తిరుమలతాతయ్యమనుమఁ డైన
సింగరాచార్యు గురువుగా సేవ సేసి, రమణఁ జెలువొందె బసవయరాఘవుండు.[2]

68


క.

ఆరాఘవునిసహోదరుఁ, డై రమణీయప్రతాపహరిదశ్వుఁడు త
మ్మారెడ్డి తేజరిల్లెను, నారీనికురుంబములకు నవమన్మథుఁడై.[3]

69


ఉ.

మండితకాంతిభూతిమహిమన్ బసవప్రభుతమ్మభూవిభున్
రెండవచందురుండు పదిరెండవశంకరమూర్తి యంచు భూ
మండలిఁ బ్రస్తుతింతురు సమస్తజనంబులు నవ్విధంబు గా
కుండినఁ గల్గునే కళలయొప్పిదమున్ జితమన్మథత్వమున్.[4]

70


మ.

అసకృత్తేజము మిన్నుముట్టి రిపుభార్యానేత్రనీలోత్సల
ప్రసవంబుల్ నలఁగించి యాశ్రితముఖాబ్జశ్రేణికిన్ సంతసం
బెసఁగంజేసి విరోధిగర్వతమసం బింకింప దీపించుఁబో
బసవక్ష్మావిభు తమ్మయప్రభుప్రతాపద్వాదశాత్మప్రభల్.[5]

71


సీ.

భాగ్యసంపదలచే భాసిల్లు టరిదియే రంజిల్లు రూపనారాయణునకు
రిపుభూపతుల విదారించుట కడిఁదియే నవ్యసంగ్రామధనంజయునకు
భూమిభరం బెల్లఁ బూనుట చోద్యమే భాసిల్లుజగరక్షపాలకునకు
సంగీతసాహిత్యసరసత చిత్రమే తలపోయ రాయపితామహునకు


తే.

నీప్సితము లర్థులకు నిచ్చు టెంత పెద్ద, తలుప హేమాద్రిదానచింతామణికిని
అనుచుఁ గొనియాడుదురు జను లనుదినంబు, ధర్మమతి యైనబసవని తమ్మవిభుని.[6]

72
  1. తాపసవృత్తిన్ = తపస్వియొక్క వ్యాపారముతో, మాటునన్ =మఱుఁగున.
  2. పరాపరరహస్యవేది = పరతత్త్వరహన్యము నెఱిఁగినవాఁడు.
  3. హరిదశ్వుఁడు = సూర్యుఁడు, నికురుంబము = సమూహము.
  4. మండిత = అలంకరింపఁబడిన, భూతి = ఐశ్వర్యము, కళలయొప్పిదము = పదియాఱుకళలచే నైన ఒప్పిదము, విద్యలచేత నైన ఒప్పిదము.
  5. అనకృత్తేజము = ఎడతెగని ప్రతాపము, విరోధిగర్వతమసంబు = పగవారిగర్వమనెడు చీఁకటి, ఇంకించి = అణఁచి, ద్వాదశాత్మప్రభ = సూర్యకాంతి.
  6. అరిది = దుర్లభము, విదారించుట = భేదించుట, కడిది = అశక్యము, హేమాద్రిదానచింతామణికిన్ = బంగారుకొండను దానము చేయుటయందు చింతామణివంటివానికి - కొండవలె మితిమీఱిన ధనమును యాచకుల కిచ్పుటయందు వెనుదీయనివాఁడని యర్థము.