పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

ఆతమ్మరెడ్డితమ్ముఁడు, చేతోజాతోపమానశృంగారకళా
చాతుర్యుఁ డైనలక్ష్మయ, భూతలమున వెలనేఁ గల్పభూరుహ మనఁగన్.[1]

73


ఉ.

చెంగటిబోటికత్తియలు సిగ్గులు రేచఁగ లేఁతనవ్వుతోఁ
దొంగలిఱెప్పలన్ వలపు దూకొనఁ బయ్యదకొంగు జాఱఁగా
ముంగిటిమేడపైఁ జిలుక ముద్దులు చూచుచు నిల్చియున్న య
య్యంగన నిన్నరాత్రి బరవాధిపులక్ష్మునిఁ గూడెనే చెలీ.

74


చ.

రసికపుమాటలన్ మనసు రంజిలఁజేయఁగ నేర్చు నీగులన్
బిసిడితనంబు లేదు వలపించి యలంపఁడు మోహనాకృతిన్
బసగన జాణరాయఁడని పల్కినఁ దల్లికిఁ గూడ దక్కటా
బసవయలక్ష్మునిన్ రతులఁ బాయుట కంతునిఁ బాయుటే చెలీ.[2]

75

షష్ఠ్యంతములు

క.

ఈతమ్ము లిరువురును దన, చేతులయందమున బనులు సేయఁగఁ ద్రిజగ
త్పూతాత్తుఁ డగుచు వెలసిన, యాతతగుణశీలునకు దయాలోలునకున్.[3]

76


క.

శ్రీమత్పంటకులాంబుధి, సోమునకు ననంతభోగసుత్రామునకున్
హేమాద్రిదానవరచిం, తామణికిఁ బ్రతాపసంభృతనభోమణికిన్.[4]

77


క.

తిరుమలతాతయదేశిక, వరశిష్యున కనుపమేయవైదుష్యునకున్
పరభూపాలతమస్సం, హరణాదిత్యునకుఁ బల్లవాదిత్యునకున్.[5]

78


క.

హరిపాదపద్మసేవా, పరచిత్తున కధికతరకృపామత్తునకున్
నిరుపమవినయసమన్విత, గురువాచాలునకు రాయగోపాలునకున్.[6]

79
  1. చేతోజాత...చాతుర్యుఁడు = మన్మథునితో సరిపోల్పఁదగిన శృంగారవిద్యయందు నేర్పరియైనవాఁడు.
  2. పసిడితనము = లోభిత్వము, కంతుని = మన్మథుని.
  3. చేతులయందమునన్ = చేతులవిధమున, త్రిజగత్పూతాత్ముఁడు = మూఁడులోకములను పావనములనుగా చేయుమనస్సుగలవాఁడు.
  4. పంటకులాంబుధిసోమునకు = పంటకులమను సముద్రమునకు చంద్రుఁ డైనవానికి, అనంతభోగసుత్రామునకు = మేరలేనిభోగమునకు దేవేంద్రుఁడైనవానికి, హేమాద్రి = బంగారుకొండ, ప్రతాపసంభృతనభోమణికిన్ = ప్రతాపమును భరించుటయందు సూర్యుండైనవానికి - మిక్కిలి ప్రతాపము కలవాని కనుట.
  5. తిరుమలతాతయదేశికవరశిష్యునకున్ = తిరుమలతాతాచార్యులనెడు గురుశ్రేష్ఠునికి శిష్యుఁడైనవానికి, అనుపమేయవైదుష్యునకున్ = విద్యాప్రవీణత కలవానికి, వరభూపాలతమస్సంహరణాదిత్యునకున్ = శత్రురాజుల చెడుచీఁకటిని హరించుటయందు సూర్యుఁడైనవానికి, పల్లవాదిత్యునకు = పల్లవాదిత్యుఁడు అను బిరుదుపేరుగలవానికి.
  6. హరిపాదపద్మసేవాపరచిత్తునకున్ = శ్రీవిష్ణువుయొక్క పాదకమలములను సేవించుటయందు ఆసక్తమైన మనస్సుగలవానికి, అధికతరకృపామత్తునకున్ = మిక్కిలి అధికమయిన దయచేత పరవశుఁడయినవానికి, వివయసమన్వితగురువాచాలునకున్ = అడఁకువతోఁగూడుకొన్న గౌరవముగల మాటలాడువానికి.