పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రాయవేశ్యాభుజంగుండు రమ్యకీర్తి, రతుఁడు రావూరిబసవయరాఘవుండు.[1]

62


మ.

అవలీలన్ జయలక్ష్మితోడను విహారుం డైనరావూరిరా
ఘవభూపాలునకు దిశావనితలాఖద్యోతనీరాజనో
త్సవము ల్సేయఁ దదీయదీపకలికాసంభూతధూమాసితం
బవలంబింపఁగ నల్లనై మెఱసె నయ్యాకాశ మాద్యంతమున్.[2]

63


సీ.

తనప్రతాపాగ్ని శాత్రవగర్భనిర్భరాంభోనిధానమున కౌర్వానలంబు
తనకీర్తిబింబ ముద్దండారివదనాబ్జమండలంబున కబ్జమండలంబు
తనబాహుదండ ముద్ధతవిరోధికడంగరీయంబులకు శిరోధీయయష్టి
తనగుణశ్రేణి మత్తవిరోధిసామంతపాఠీనతతులకు బడిశరజ్జు


తే.

తనసముజ్జ్వలతేజ ముద్దామవిమత, గర్వతమసంబులకుఁ బ్రభాకరమరీచి
చేసె జగనబ్బగండఁ డక్షీణవిజయ, రతుఁడు రావూరిబసవయరాఘవుండు.[3]

64


చ.

ఇతఁడు భుజంగవల్లభుఁడు హీనవివేకి యనంతభోగసం
శ్రితుఁ డిటువంటిశేషునియశేషసుఖంబులు పాముతోడిపొ
త్తతివలకంచు రోసి వసుధాంగన చెందె నవక్రవిక్రమ
వ్యతికరుఁ డైనరెడ్డిబసవప్రభురాఘవుబాహుపీఠమున్.[4]

65


సీ.

అఖిలలోకాధీశుఁ డయ్యుఁ దాపసవృత్తి నడవినుండిననాఁటిహైన్య మొకటి
యమరేంద్రసేవితుఁ డయ్యు వానరులతోఁ గూడియుండిననాఁటికొంచె మొకటి
యసహాయరణశూరుఁ డయ్యు మాటుననుండి శత్రుఁజంపిననాఁటిశంక యొకటి
యతిదయారసచిత్తుఁ డయ్యుఁ దమ్ముని నిల్లు వెడలఁద్రోచిననాఁటివెలితి యొకటి

  1. సూనృతము = సత్యము, నడవంగన్ = ప్రవర్తింప, వేద్యములు = తెలియఁదగినవి.
  2. ఖద్యోతనీరాజనోత్సవము = సూర్యుఁడనెడు కర్పూరహారతి వేడుకలు, తదీయదీపకలికాసంభూతధూమాసితంబు = దానిదైన దీపపుకొడివలన పుట్టిన పొగచేత నల్లదనమును.
  3. శాత్రవగర్భనిర్భరాంభోనిధానమునకున్ = శత్రువులగర్భములనెడునిబ్బరముగల సముద్రమునకు, ఔర్వానలము = బడబాగ్ని, ఉద్దండారివదనాబ్జమండలంబునన్ = గర్వించినశత్రువులమొగములనెడు కమలములగుబురులకు, అబ్జమండలము = చంద్రబింబము, ఉద్ధతవిరోధికడంగరీయంబులకున్ = అణఁగనిపగవారనెడు వృషభములకు, శిరోధీయయష్టి = తలమీఁదికఱ్ఱ, మత్తవిరోధిసామంతపాఠీనతతులకు = మదించినవిరోధులైన సామంతరాజులనెడు చేఁపలసమూహములకు, బడిశరజ్జు = గాలాపుత్రాడు, సముజ్జ్వలతేజము = లెస్సగా వెలుఁగునట్టిప్రతాపము, ఉద్దామవిమతగర్వతమసంబులకున్ = అణఁపరాని శత్రువులగర్వమనెడు చీఁకట్లకు, ప్రభాకరమరీచి = సూర్యకిరణము, అక్షీణవిజయరతుఁడు = తక్కువ కాని గెలుపునందు ఆస గలవాఁడు.
  4. భుజంగవల్లభుఁడు = సర్పరాజు - విటులకు ప్రియుఁడు, హీనవివేకి = వివేకముచేత తక్కువైనవాఁడు - సర్పము తిర్యగ్జంతువు కనుక వివేకహీనత స్వాభావికము, అనంతభోగసంశ్రితుఁడు = మితిలేనిపడగలచేత పొందఁబడినవాఁడు - పెక్కుపడగలు గలవాఁడు, మేరలేనిభోగములచే ఆశ్రయింపఁబడినవాఁడు - బహువిధభోగముల నపేక్షించువాఁడు, అవక్రవిక్రమవ్యతికరుఁడు = క్రమమైన పరాక్రమముచేత మీఱరానివాఁడు.