పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/332

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆ.

సూర్యదీప్తివల్ల శోషించుచున్నప, ద్మాకరంబులెల్ల నతిశయిల్లె
బెక్కులంపటములఁ జక్కి మమత్వముల్, మానకున్న జనులమనసు లట్ల.[1]

220


క.

అమలోదకములలోపలఁ, గుముదములు వికాసవృత్తిఁ గొమరైయుండెన్
విమలాత్మునిసంగతమున, నమరి వికాసమున నున్నయధికులఁబోలెన్.[2]

221


ఆ.

తొల్లి విడిచి యున్నతోయజాకరముల యందు మరలఁ జేరె నంచపిండు
పూర్వసంచితాశములకు యోగజ్ఞాను, లంద మగుడనిల్చు నవ్విధమున.[3]

222


ఆ.

సలిలంబు వినిర్మలమై, పొలుపారెను విష్ణుభక్తిపూతంబై ని
శ్చలయోగవిద్యపెంపునఁ, జెలువొందెడు యోగివరుల చిత్తములగతిన్.

223


ఆ.

నేలమీఁదియదను నింగిపై ఘనములు, జలము గలుగుటయును బొలిసిపోయె
నింద్రియంబులందు నింద్రియార్థములు ప్రత్యాహతంబు లైనయవ్విధమున.[4]

224


వ.

ఇట్టి శరత్కాలంబు వ్రజనివాసు లయిననందాదిగోపాలవర్గంబు లనర్గళంబు
లయిన ప్రయత్నంబులతోడఁ బురుహూతప్రీతిగా యాగంబు చేయం దలంచి
సకలపదార్థంబులు సంపాదించుచున్న యప్పుడు యజ్ఞమూర్తి యైననారాయ
ణుండు నందున కిట్లనియె.[5]

225

శ్రీకృష్ణుఁడు గోవర్ధనపర్వతము నెత్తుట

ఆ.

ఏమిఫలము గోరి యింద్రునిఁగూర్చి యీ, యాగకర్మ మిప్పు డాచరించు
చున్నవారు చెప్పుఁడన్న నాదామోద, రునకు నందగోపుఁ డొనరఁ బలికె.

226


సీ.

దేవతాధీశచోదితములై మేఘముల్ వసుమతీతలమున వానగురియు
వానగల్గిన మహీవలయంబు సస్యసమృద్ధయై ధాన్యంబు మిగులఁగల్గు
ధాన్యంబు గల్గిన ధరణీప్రజల కెల్ల సంతతానందంబు సలుపుచుండుఁ
బ్రజల కానందంబు పాటిల్లినను దేవసంతర్పణంబులు సాగివచ్చు


తే.

నావు లెల్లను బ్రతుకు క్షీరంబు వలసి, నటులఁ బిదుకును మొదవులు నట్టు లైన
నెల్లప్రజలకు మనకు నచ్చికము లేక, యుండగలుగు మహిమ లుల్లసిల్ల.[6]

227


వ.

కావున లోకోపకారంబుగా నేఁటేఁట నింద్రోత్సవంబు చేయుదు మనిన ముకుం
దుండు పురందరునకుఁ గోపంబు పుట్టునట్టుగా నందున కిట్లనియె.

228


ఆ.

పైరువలన మనము బ్రతికెడువారము, గాము విపణివర్తకంబుచేత

  1. సూర్యదీప్తిన్ = ఎండచేత, అల్లన్ = మెల్లగా - దినక్రమము ననుట, లంపటములన్ = విషయాశలయందు, మమత్వములు = మమకారములు.
  2. అమల = నిర్మలమైన, కొమరై = మనోజ్ఞమై, సంగతమునన్ = సహవాసముచేత.
  3. తోయజాకరములయందున్ = సరస్సులయందు, అంచపిండు = హంసలగుంపు, అందన్ = పొందుటకు.
  4. అదను = సమయము, పొలిసిపోయెన్ = నశించెను, ప్రత్యాహతంబులు = సంకోచింపఁబడినవి - అణఁగిన వనుట.
  5. అనర్గళంబులు = ధారాళములు, పురుహూత = ఇంద్రునికి.
  6. పాటిల్లినను = కలిగినను, ఆచ్చికము = కొఱఁత.