పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/331

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

బలభద్రుని భరియింపఁగ, నలవు చెడి ప్రలంబదైత్యుఁ డయ్యెడ ధరణీ
తలమునకు వచ్చె నప్పుడు, జలజాక్షుం డెచ్చరింపఁ జటులప్రౌఢిన్.[1]

209


వ.

దనుజునిశిరోరుహంబులు వామహస్తంబునం జుట్టి పట్టి చరణంబులఁ గంఠంబు
బిగియించినం గళవట్టి గుడ్లు వెలికుఱికి కదలనేరక యున్నసమయంబున దామో
దరచోదితుండై బలభద్రుండు.[2]

210


క.

ఘనతరకోపారుణలో, చనములఁ గల్పాంతకాలశమనునిగదతో
నెనవచ్చుముష్టిచేతను, దనుజునిమస్తకము బెట్టిదంబుగఁ బొడిచెన్.[3]

211


క.

పొడిచిన మెదడును నెత్తురు, పడి దొరుఁగఁగ శిరము పగిలి వాఁడు ధరిత్రిన్
బడి చచ్చె గోపబాలకు, లుడుగక బలభద్రుఁ బొగడుచుండిరి వేడ్కన్.

212


వ.

ఇవ్విధంబున.

213


క.

బలభద్రుఁడు మర్దించెను, బలవద్రి పుభయదభూరిబాహువిడంబున్
ఘనదనుజజనకదంబున్, లలితేతరదుర్గుణావలంబుఁ బ్రలంబున్.[4]

214


మ.

బలవద్వైరిమదప్రభంజనకళాపారీణు లారామకృ
ష్ణులు గోపాలకుమారులం గలిసి తేజోమూర్తులై నందగో
కులవాసుల్ గొనియాడ నిష్టగతులన్ గోపాలవేషంబులన్
బొలుపైయుండిరి తల్లిదండ్రులకు సమ్మోదంబు సంధిల్లగన్.[5]

215

శరత్కాలవర్ణనము

వ.

అంత శరత్కాలంబు ప్రవేశించిన.

216


క.

అడవులలోన ముదంబులు, విడిచి మయూరములు మౌనవృత్తుల నుండెన్
గడునొప్పనిసంసారము, లుడిగిన యోగీంద్రు లూరకుండినకరణిన్.[6]

217


తే.

భానుదీప్తులవేఁడిచేఁ బల్వలంబు, లెండి పిండలివండుగా నింకిపోయె
దారుణం బైనసంసారతాపములను, నలఁగి చిక్కినదుర్గృహస్థునివిధమున.[7]

218


ఆ.

నీరదములు లేక నిర్మలాకారమై, యాకసంబు చూడ నతిశయిల్లె
విగ్రహంబులెల్ల విడిచి సౌమ్యజ్ఞాన, యుక్తుఁ డైనదివ్యయోగిఁబోలె.[8]

219
  1. అలవు = శక్తి.
  2. కళవట్టి = స్మృతి చెడి, వెలికుఱికి = బయటికుఱికి, చోదితుండు = ప్రేరేపించఁబడినవాఁడు.
  3. కల్పాంతకాలశమనుని = ప్రళయకాలపుయమునియొక్క, ఎనవచ్చు = సమానమగు, బెట్టిదంబుగన్ = పరుషముగా.
  4. బలవద్రిపు...విడంబున్ = బలవంతులైన శత్రువులకు భయమును పుట్టించునట్టి విడుపులైన బాహువులచేత ఒప్పువానిని, ఘనదనుజజనకదంబున్ = గొప్పవారైన రాక్షసులసమూహములు గలవాని, లలితేతరదుర్గుణావలంబున్ = మంచికంటే ఇతరములైన చెడ్డగుణములకు నాధారమైనవానిని.
  5. ప్రభంజన = మిక్కిలి భంగపెట్టుట యనెడు, పొలుపై = ఒప్పిదము గలిగి, సమ్మోదంబు = సంతోషము.
  6. ముదంబులు = సంతోషములు.
  7. పిండలివండుగాన్ = పిడుచగట్టినవండుమట్టి గలవిగా.
  8. నీరదములు =మేఘములు, విగ్రహంబులు = వాదములు.