పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/328

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

దేవర కడుఁగోపంబున, నీవిధమున నాజ్ఞ పెట్ట నీక్షణమందున్
జీవంబు విడుచుచున్నాఁ, డీవాతాశనుఁడు కోప మేటికిఁ గృష్ణా.[1]

180


ఆ.

మాకు పురుషభిక్ష మన్ననతోఁ గృప, సేయుమయ్య యనుచుఁ జిన్నవోయి
మ్రొక్కుచున్నఁ గరుణ మొలచుచిత్తంబుతో, గాళియాహివిభునిఁ గాచి విడిచె.

181


క.

ముక్కున నోరున నెత్తురు, గ్రక్కుచుఁ దలదిమ్ముపట్టి కడుదీనతతో
నొక్కింత యీరెలుంగున, నక్కమలదళాక్షుఁ జూచి యతఁ డిట్లనియెన్.[2]

182


క.

ఏ నేమితప్పు చేసితి, నోనలినదళాక్ష నీనియోగంబునఁగా
దే నాడు జలధినుండుట, మాని యిటకు వచ్చినాఁడ మగువలు దానున్.[3]

183


ఆ.

ఓరపడగఁ బెట్టి యోరంతప్రొద్దును, గుటిలవృత్తితోడఁ గ్రూరకర్మ
ములకు నోర్చి లోకములకుఁ గీడొనరించు, పాపజాతిజాతి పాఁపజాతి.[4]

184


వ.

అట్టి మాజాతిరూపానురూపస్వభావంబులు దప్పి యన్యథామార్గంబులు నాజ్ఞ
వెట్టుట యుచితంబుగాక నన్ను నిట్టిక్రూరజాతియందుఁ బుట్టించిన నీవు మానడవ
డులకు నిరోధించి యిట్లు చేసినయపరాధంబు నిరూపించక రక్షించి వలయు
పనులకు నియోగింపు మనినఁ గరుణించి కృష్ణుం డిట్లనియె.

185


క.

నీ వింక నిందు నుండక, నావచనముఁ బూని యంగనామిత్రసుపు
త్రావళితో జలరాశికి, వేవేగమ కదలిపొమ్ము విషధరముఖ్యా.[5]

186


క.

నీపడగమీఁద నుండెడు, నాపదచిహ్నములు చూచినను గరుడుఁడు ని
న్నెపుడు భక్షింపఁడు నా, నాపన్నగవరుల నట్టు లడుచు నతుండున్.

187


వ.

అని యానతిచ్చినఁ బ్రసాదంబని యాప్రొద్దె కదలి చని సముద్రంబ ప్రవేశించె నంత.[6]

188


క.

మడుఁగు వెడలి హరి వచ్చినఁ, గడుమోదముతోడ గోపికలు గోపకులున్
వడి గ్రుచ్చి కౌఁగిలించిరి, కొడుకుం దలిదండ్రు లెత్తికొనిరి ముదమునన్.

189


వ.

ఇవ్విధంబునం గాళియాహిమర్దనుం డైనజనార్దనుం బ్రశంసించుచు నతండు
చేసినపరాక్రమంబు లుగ్గడించుచుఁ బ్రమోదభరితమానసులై గోకులంబునకు
వచ్చి సుఖంబుండి రంత.[7]

190

ధేనుకాసురసంహారము

ఉ.

గోవులఁ గాచుచు బలముకుందులు తొల్లిటియట్ల గోపపు
త్రావళిఁ గూడి శైశవవిహారవినోదములం గడింప బృం

  1. ఆజ్ఞ పెట్టన్ = శిక్షింప, వాతాశనుఁడు = సర్పము.
  2. ఈరెలుంగునన్ = అల్పస్వరముతో.
  3. నీనియోగంబునన్ = నీయాజ్ఞచేత, తానున్ = నేనును.
  4. ఓరంత ప్రొద్దును = ఎల్లప్పుడును, కుటిలవృత్తి = వంకరనడత, పాపజాతి = దుర్జనత్వముగల, పాఁపజాతి = సర్పకులము.
  5. విషధరముఖ్యా = సర్పశ్రేష్ఠుఁడా.
  6. ప్రసాదంబు = చిత్తము.
  7. ప్రశంసించుదున్ = కొనియాడుచు, ఉగ్గడించుచున్ = చెప్పుకొనుచు.