పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/327

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

నెట్టన నిమహత్వమును నీభుజశక్తియు నీచలంబు నీ
గుట్టు నెఱుంగలేక పటుఘోరవిషాహికిఁ జిక్కితంచు నీ
చుట్టలుఁ దల్లిదండ్రులును శోకపయోధి మునుంగుచున్నవా
రట్టె మహాత్మ యెంతదడ వైనను మానుషలీల లేటికిన్.[1]

172


శా.

భూలోకంబున దుష్టశాత్రవచయంబుం జంపి ధర్మజ్ఞులన్
బాలింపంగ జనించినాఁడవు మహీభారావతీర్ణక్రియా
శీలత్వంబు వహించి నీ విపుడు లక్ష్మీనాథ యీపాముతో
బాలక్రీడలు సల్ప నేమిటికి నిర్బంధించి మర్దింపవే.[2]

173


చ.

అనవుడు లేతన వ్వొలయ నాజలజాక్షుఁడు దివ్యమూర్తిఁ గై
కొని తను వుబ్బఁజేయుటయు ఘోరభుజంగమబంధనంబులె
ల్లను వెస వీడె నప్పుడు బలంబుఁ జలంబును మీఱ పన్నగేం
ద్రునిశిరముల్ పదంబులును ద్రొక్కి విచిత్రగతుల్ చెలంగఁగన్.[3]

174


తే.

కడఁగి హ స్తంబులను రెండుకడలనున్న, రెండుతలలును వెసఁబట్టి దండి మెఱయ
నడిమి శిరమెక్కి కడుఁగఠినంబులైన, పాదఘట్టనములచేతఁ బగులదన్నె.

175


క.

తల యీగతి నలినలియై, సొలవక నెత్తురులు గ్రక్కుచును దైన్యముతో
పొలుపఱిన కాళియాహిని, పెలుచన నొక్కింతవెలితి పీనుఁగుఁ జేసెన్.[4]

176


మ.

వివశుండై పెనుమూర్ఛనొందిన విభున్ వీక్షించి యత్యంతశో
కవిలాపంబులతోడ నంగలతికల్ కంపింప నాగేంద్రమా
సవతుల్ వచ్చి భుజంగరాజశయనున్ నాళీకపత్రాక్షు యా
దవచూడామణిఁ జేరి యిట్లనిరి తాత్పర్యంబుతో మ్రొక్కుచున్.[5]

177


ఉ.

దేవ సమస్తలోకనుత దివ్యమునీంద్రమనోనివాస ల
క్ష్మీవర వాసుదేవ సరసీరుహనేత్ర యనాథనాథ లో
కావనదక్ష నిర్జరగణాధిప కేశవ యీశ పీతవ
స్త్రావృత దేవకీసుత దయాపర మమ్ము ననుగ్రహింపవే.[6]

178


తే.

నిఖిలలోకాశ్రయం బైననీపదోగ్ర, ఘట్టనంబున నెట్లోర్చుఁ గమలనాభ
యల్పబలుఁ డైనయీకాళియాహిశిరము, హస్తిమశకాంతరము నీకు నాతనికిని.

179
  1. నెట్టనన్ = దృఢముగా, పయోధిన్ = సముద్రమునందు, అట్టె = అత్యంతము, మానుషలీలలు = మనుష్యక్రీడలు.
  2. శాత్రవచయంబు = పగవారికూటమిని.
  3. ఒలయన్ = కలుగఁగా ననుట, బంధనంబులు = కట్లు.
  4. నలినలియై = నజ్జునజ్జైలై - మిక్కిలి నలఁగి, సొలవక = తగ్గక, పొలుపఱిన = బాగు చెడిన - దీనత్వము నొందిన, పెలుచన = క్రూరత్వముతో.
  5. వివశుఁడు = పరవశుఁడు, అంగలతికలు = తీఁగలవంటి దేహములు, నాళీకపత్రాక్షున్ = తామరఱేకులవంటికన్నులు గలవానిని.
  6. లోకావనదక్ష = లోకులను రక్షించుటకుఁ జాలినవాఁడా, పీతవస్త్రావృత = పీతాంబరమును తాల్చినవాఁడా.