పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/326

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

కడుఁ బెనుమంట లైనయుదకంబు తొలంకున వారిబిందువుల్
మిడిసి సమీపభూజములమీఁద వెసంబడి మండుచుండ నె
క్కుడురభసంబుతో దివియకోలలకైవడి భంగసంగతిన్
బొడమినఫేనముల్ మెఱసె బోరునఁ జల్లిన నిప్పులో యనన్.[1]

165


ఉ.

అంతట కాళియాహివిభుఁ డారవముల్ విని కోపతప్తుఁడై
సంతతకాలకూటనిభచండవిషోల్బణఫూత్కృతుల్ జగం
బంతయు మూఁడఁజేయఁగ రయంబున వచ్చె ననేకభృత్యులన్
గాంతలుఁ బుత్రులుం గొలువఁగా పటుకోపపరీతచిత్తుఁడై.[2]

166


ఉ.

మించి మహోగ్రపావకసమేతవిషానలముల్ ముఖంబుపై
నుంచియు దష్ట్రలం గఱచియున్ బెనుతోఁకను వీఁపుతో విభా
ళించియు గాలుఁ జేయు మెదలింపకయుండ శరీరమెల్ల బం
ధించియు నిట్లు దుర్దశకుఁ దెచ్చెను గృష్ణుని లోకజిష్ణునిన్.[3]

167


ఉ.

అమ్మురవైరి యిట్ల విషమాహికిఁ జేపడి వెళ్లలేక దుః
ఖమ్మున నున్నవాఁ డనుచు గ్రక్కున గోపకుమారులందఱున్
గ్రమ్మిన శోకవార్ధి కడగానక యేడ్చుచుఁ బాఱు తెంచి ఘో
షమ్మునఁ జెప్ప నాపిడుగుచందపుమాటల కుల్కి యత్తఱిన్.[4]

168


ఉ.

నందయశోదలు బరిజనంబులుఁ దక్కినగోపబాలికా
బృందము సీరపాణియును బెద్దయు నేడ్చుచు శోకవార్ధి నం
దంద మునుంగుచున్ బటురయంబొదవం జని కాంచి రంత గో
విందునిఁ గాళియాహిఫణవేష్టితచారుముఖారవిందునిన్.[5]

169


మ.

ఘనదర్వీకరభోగవేష్టనముచేఁ గంపించుచున్నట్టి యా
తనయుం గన్గొనినప్పు డాత్మల యశోదానందు లత్యంతదుః
ఖనితాంతాత్మకు లైరి గోపకులు శోకవ్యాకులాలోలవ
ర్తనులై యేడ్చిరి గోపికాజనులు చింతాక్రాంతులై యెంతయున్.[6]

170


వ.

ఇవ్విధంబున నాక్రోశించుచున్న వారల వారింపనోపక బలభద్రుండు దామోదరు
నవలోకించి యిట్లనియె.[7]

171
  1. తొలంకునన్ = తొనుకుటచేత, మిడిసి = మీఁది కెగసి, దివియకోలలకైవడిన్ = దివటీలవలె, భంగసంగతిన్ = అలలచేరికచేత, జోరునన్ = అధికముగా.
  2. చండ = తీక్ష్ణమైన, మూడఁజేయన్ = నశింపఁజేయఁగా.
  3. విభాళించియున్ = చఱచియు, లోకజిష్ణునిన్ = లోకమునందలివారి (నందఱను) జయించుస్వభావము గలవానిని.
  4. చేపడి = చిక్కి, ఉల్కి = భయపడి.
  5. చటురయంబున = మిక్కిలి వడితో, వేష్టిత = చుట్టఁబడిన.
  6. ఘనదర్వీకరభోగవేష్టనముచేన్ = గొప్పసర్పదేహము చుట్టుకొనుటచేత, శోకవ్యాకులాలోలవర్తనులు = శోకముచేత కలఁతనొంది మిక్కిలి చలించుచున్న ప్రవర్తనముగలవారు.
  7. ఆక్రోశించుచున్ = ఏడ్చుచు.