పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/324

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

భూరిభారానితాంతోగ్రవారివృష్టి, పూరితాఖిలనిమ్నగాంభోచయంబు
సంతతధ్వానదర్దురసంచయంబు, గలిగి వర్షాగమంబు ప్రకాశమయ్యె.[1]

153


చ.

అమరిన లేఁతపచ్చికబయళ్లను దట్టములైన యింద్రగో
పములు నటింపఁగా నవనిభాగము తద్దయుఁ జూడ నొప్పెఁ గ్రొ
త్తమరకతంబులన్ విఘటితం బగుపేటికయందుఁ బద్మరా
గము లనురత్నముల్ దఱుచుగా నమరించినసోయగంబునన్.[2]

154


క.

నీలాంబుదములక్రేవలఁ, గ్రాలెడుకొక్కెరలగుంపు కడుఁజూపట్టెన్
మాలిన్యమతులచే నుప, లాలితులై యున్ననిష్కళంకులభంగిన్.[3]

155


క.

కడునధికవృష్టి గురియఁగ, వడితో నదు లెల్ల నుబ్బి వఱదలు వాఱెన్
నడుమంత్రపుసంపదగల, వెడఁగుమతులు నుబ్బి వెల్లివిరిసినభంగిన్.[4]

156


ఆ.

పూరి మిగులఁ బెరిగి పొదియంగఁబడిన మా, ర్గములమేర లెఱుఁగరాకయుండె
నల్పబుద్ధియుక్తు లాడినమాట ల, ర్థాంతరములఁ బొంది యణఁగినట్లు.[5]

157


తే.

నీలజలధరములలోన నిర్మలేందు, మండలము గానరాకుండె మలినహృదయు
లైనదుర్జనకోటితో నాడినట్టి, సత్యసంధప్రగల్భవాక్సరణి యట్లు.[6]

158


వ.

ఇట్టి జలధరకాలంబున సహోదరు లైన రామదామోదరులు గోపాలురం గలసి
గోవులం గాచుచుఁ బరిమళకదంబంబు లయినకదంబదామకంబుల శృంగారించు
కొనియును బర్హిపత్రంబులు విచిత్రంబుగా గాత్రంబు నలంకరించుకొనియును
యీలలు పెట్టుచు సాళగంబులతోడ నేలపాటలు పాడుచుఁ బిసాళించియును
సైరికవేషంబుల గైరికనికరంబులు శరీరంబులఁ దోరంబుగా నలందియును

  1. అభిహత = ఎదురుతాఁకునట్టి, పూర్వవాత = తూర్పుగాలియొక్క, ఉదగ్దిశా = ఉత్తరపుదిక్కుయొక్క, పర్జన్యధనురాత్త = ఇంద్రధనుస్సుచే పొందఁబడిన, సంఛాదిత = లెస్సగా కప్పఁబడిన, అఖిలాశా = సమస్తదిక్కులు గల, ఘనంబు = మేఘము, విభ్రాజితస్తనితంబు = ప్రకాశింపఁజేయఁబడినయుఱుములు, ప్రస్ఫుటద్బహుతరేరమ్మదంబు = చక్కగాతోఁచుచు నధికమైనట్టి మెఱపులు, ప్రశమితాంభోజాతబంధుమయూఖంబు = చల్లగాఁ జేయఁబడిన సూర్యకిరణములు గలది, చంద్రనందన = బుధునితోడను, భూరిధారానితాంతోగ్రవారివృష్టి = ఎడతెగనిధారలచేత నధికమైన నీళ్లతోడి వాన, పూరితాఖిలనిమ్నగాంభోచయంబు = నిండింపఁబడిన యెల్లనదులలోని నీళ్లసముదాయము గలది, వర్షాగమంబు = వానకాలము అనుట.
  2. ఇంద్రగోపములు = పట్టుపురుగులు, విఘటితము = విశేషముగా కూర్పఁబడినది, పేటిక = పెట్టె, పద్మరాగములు = కెంపులు, సోయగంబునన్ = అందముగా - విధముగా.
  3. నీలాంబుదములక్రేవలన్ = మబ్బులపార్శ్వములందు, గ్రాలెడు = ప్రకాశించునట్టి, కొక్కెరల = కొంగలయొక్క, మాలిన్యమతులచే = కపటబుద్ధిగలవారిచేత, ఉపలాలితులు = ఊఱడింపఁబడినవారు, నిష్కళంకులు = కపటములేనివారు.
  4. వఱదలు = వెల్లువలు, నడుమంత్రపు = నడుమవచ్చిన, వెడగుమతులు = అల్పులైనబుద్ధి తక్కువవారు, వెల్లి విరిసిన = ప్రసిద్ధినొందిన.
  5. పొదియంగఁబడిన = కమ్ముకొన్న.
  6. ఇందుమండలము = చంద్రబింబము.