పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/323

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దొడిగి చెంగావికాసెకోకలు కట్టికొని భారంబువలన వీఁకలుగల కొరకావళ్లు
మోచికొని యొండొరులతోడఁ బంతంబులాడుచు గునిసి గునిసి నడుచువారు
నుం గలిగి గౌష్ఠీనంబు మశకమక్షికకాకకంకసమాకీర్ణంబులవలన సర్వశూన్యం
బగునట్టుగాఁ గదలి బృందావనంబునకుం జని.[1]

147


తే.

యమునచేరువ నొక్కరమ్యప్రదేశ, మున విశాలస్థలంబున నొనర విడిసి
యర్ధచంద్రాభముగ శకటాళి నిలిపి, పారివెలుఁగులు దొడ్లు నేర్పడ నమర్చి.[2]

148


ఉ.

గోవుల లేఁతపూరిగల కొండలదండల మేసి తెచ్చి నా
నావిమలోద యైనయమునానదిలోపల నీళ్లు పెట్టి త
త్పావనతీరదేశములఁ బాటల నాటల క్రీడలాడి బృం
దావనభూమియందుఁ బ్రమదంబున గోపకు లుండి రిమ్ములన్.[3]

149


క.

ఆరాముఁడు కృష్ణుఁడు నా, భీరకుమారకులఁ గూడి బృందాటవి నే
పారుచు దూడలఁ గాచిరి, గారవమున జగము గావఁగలవారయ్యున్.

150


సీ.

బర్హిపత్రములు సంపాదించి శృంగార మొనరించుచుండుదు రొక్కవేళ
మురళీరవంబులు మొరయించి తమలోన నుల్లాస మొనరింతు రొక్కవేళఁ
గాకపక్షంబులఁ గమ్మపూవులు చుట్టి యొయ్యారులై యుందు రొక్కవేళ
నిడువున నాకులు మడిచి పీఁకెలు చుట్టి యూఁదుచు నటియింతు రొక్కవేళ


తే.

నిగురుపాన్పులపైఁ బొదరిండ్లలోన, నొలసి నిద్రించుచుండుదు రొక్కవేళ
రామకృష్ణులు బాల్యాభిరామవర్త, నములఁ బెంపారి బృందావనంబునందు.[4]

151


వ.

ఇవ్విధంబున వినోదించుసమయంబున.

152


సీ.

వసుధాభిహతపూర్వవాతసంఘాతంబు సంచితోదగ్దిశాచంచలంబు
పర్జన్యధనురాత్తపశ్చిమాశాశంబు సంఛాదితాఖిలాశాఘనంబు
పటపటధ్వానవిభ్రాజితస్తనితంబు ప్రస్ఫుటద్బహుతరేరమ్మదంబు
ప్రశమితాంభోజాతబంధుమయూఖంబు చంద్రనందనశుక్రసంయుతంబు

  1. శ్రాంతలు = అలసినవారు, కవలు = జతలు, వేగుఁబోకన్ = తెల్లవాఱుకట్ల, భౌంక్రియా = భౌం అనునట్టి, బిట్టులికి = మిక్కిలి యదరిపడి, త్రిమ్మరు = తిరుగు, సందడింపన్ = మెదలఁగా, సరగునన్ = శీఘ్రముగ, బంధురంబులు = పొడవులై కొంచెము వంగినవి, మంథంబులు - కవ్వములు, ఆలీఢపాదంబు = ముందరికి చాఁచి నిలుపఁబడిన కుడికాలు, చిలుకుచూపుల = బాణములను పోలినచూపులు గల, చెదరి = తొలఁగి, కదుపులన్ = పసులగుంపులను, మొదవులన్ = పాడియాపులను, మెంపుచున్ = ఎదురుకొని వచ్చుచు, నఱ్ఱాడు = మెలఁగునట్టి, ధేనువులన్ = వేఁగటి యావులను, దుగ్ధదోహనంబునకున్ = పాలు పితుకుటకు, గోవ = బెదరుగల, తలకోలలు = కొనను ఉచ్చు వేసినత్రాళ్లు గట్టిననిడుపాటికఱ్ఱలు (ఈకోలలు గోవాపులకొమ్ములకు తగిలించి కదలనీక పట్టుకొందురు), మస్తరించుచున్ = చనువుపఱుచుచు, కుక్కుటాసనంబునన్ = కాలిమడమలమీఁద పిఱ్ఱలు మోప, జానులగ్నంబులు చేసి = మోకాళ్లమీఁద పొందికగా నుంచుకొని, ఫేనంబులు = నురుఁగులు, ఉడుకువంటకంబు = వేఁడియన్నము, నులివేఁడిగాన్ = కొంచెము వెచ్చగా నుండునట్లు, గ్రామ్యాహారంబులతోడన్ = మాంసాద్యాహారములతో, పాణిపాత్రంబులన్ = దోసిళ్లయందు, సుకరంబులుగాన్ = పొందికగా, సరళపథంబునన్ = చదరమైనమార్గమున, బేగడ = కగాకిబంగారు, వీఁళలు = వంగుటలు, కోరకావళ్లు = మీఁది వంపుగా నుండు బద్దలు గలకావళ్లు, గునిసిగునిసి = క్రుంగుచు నిక్కుచు, గౌష్ఠీనంబు = మునుపటిమంద, కంక = బోరువ.
  2. అర్ధచంద్రాభముగ = అర్ధచంద్రాకారముగా, పారివెలుఁగులు = కంపకోటలు.
  3. దండలన్ = సమీపములందు, విమలోద = తేటనీళ్లుగలది, ఇమ్మున్ = నెమ్మదిగా.
  4. బర్హిపత్రములు = నెమిలియీఁకలు, మురళి = పిల్లంగ్రోవి, కాకపక్షంబులన్ = పిల్లజుట్లయందు, ఒయ్యారులు = విలాసవంతులు, పీఁకెలు = చప్పటగా మడిచి యూఁదెడు సాధనములు.