పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/320

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆ.

ఉవిద నీకుఁ దెలియదోకాని యేయింట, నైనఁ జొచ్చి యెప్పుడైన వచ్చి
వెదకి వెదకి వెన్న వెరజాడుచున్నాఁడు, నీసుతుండు మమ్ము నిలువనీక.[1]

130


ఆ.

చూచి చూచి యేము రాచకుమారుని, నాడ వెఱతు మైన నాడకుండ
రాదు కృష్ణుచేతిరాయిడి యింతంత, యనఁగరాదు మాకు మనఁగరాదు.[2]

131


వ.

అని యంత నిలువక గోపబాలికలు కపటబాలునికోమలాంగుళీరేఖాచిహ్ని
తంబు లగునవనీతభాండంబులు చూపిన యశోదాదేవి కొడుకుమీఁదం గోపించి
యిట్లనియె.[3]

132


మత్తకోకిల.

ఎల్లభాగ్యములు గృహంబున నెప్పు డుండఁగ నేలరా
గొల్లపల్లియ యంతయున్ గలగుండు పెట్టి సమస్తమున్
గొల్లలాడెదు నిన్ను నేగతిఁ గుస్తరించి యదల్చినన్
దల్లిదండ్రులయాజ్ఞ నిల్వవు దంటదయ్యపుబిడ్డఁడా.[4]

133


తే.

ఏల పొరిగిండ్లు చొచ్చెద వేల వెన్న, లెల్ల వెరఁజెదవింటిలో నేలయుండ
వేల యీసరివారిలో నింతఱట్టు, చేసెదవు నీచరిత్రంబు చెప్ప నరుదు.[5]

134


క.

అని దామపాశమున నా, తని నెన్నడు ముగ్గఁగట్టి తక్కినకొనత్రా
డొనరఁగ నులూఖలముతో, జనని వెసన్ ముడిచి నిలిపి సదనమునందున్.[6]

135

శ్రీకృష్ణుండు ఉలూఖలబద్ధుండై యమళార్జునభంజనంబు చేయుట

క.

ఉనిచి కడుఁగోపసంభ్రమ, మున చిడిముడి పడుచునుండెఁ బురుషోత్తముఁడు
జనని తనుఁ బట్టి కొట్టునో, యనుభయమునఁ జాఱిపోయినట్లు రయమునన్.

136


తే.

గొల్లపడుచులు చని గుండు గూడి చూడ, ఱోలు దామెనత్రాడును లీలతోడ
నీడ్చికొనివచ్చి దమయింటియెదురుకట్లఁ, దనరు యమళార్జునంబులఁ దగులఁ బెట్టి.[7]

137


క.

బద్దులఁ దొలుపుట్టుక వెడ, బుద్దుల నొండొంటితోడఁ బురుణించిన పె
న్నుద్దుల మద్దుల ముద్దుల, సుద్దులబాలకుఁడు ద్రోచె క్షోణిఁ బడంగన్.[8]

138


వ.

ఇవ్విధంబున నయ్యమళార్జునంబులు రెండునుం గటకటధ్వానంబులతోడ విఱి

  1. వెరఁజాడు = ఊడ్చి యెత్తుకొని తిను.
  2. రాయిడి = బాధ.
  3. కోమలాంగుళీరేఖాచిహ్నికంబులు = మెత్తనివ్రేళ్లగీఱగుఱుతులు గలవి.
  4. భాగ్యములు = సంపదలు, కలగుండు పెట్టి = కలయవెదకి, కుస్తరించి = పట్టుపఱిచి, దంట = దిట్టతనముగల.
  5. ఱట్టు = అల్లరి.
  6. దామపాశము = దామెనత్రాటితో, ఉగ్గన్ = బిగియ.
  7. గుండు గూడి = చుట్టుచుట్టుకొని, ఎదురుకట్టన్ = ఎదుటిప్రదేశమునందు, ధవళార్జునంబులన్ = తెల్లమద్దిచెట్లను.
  8. బద్దులన్ = అశాశ్వతములైన, తొలుపుట్టుక వెడబుద్ధులన్ = పూర్వజన్మమునందు దుర్బుద్ధులైన, పురుణించిన = సరిపోలిన, ముద్దుల సుద్దుల బాలకుఁడు = ఒప్పిదములైన వృత్తాంతములు గలపిన్నవాఁడు, క్షోణిన్ = భూమిమీఁద.