పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/319

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గోకరీషధూళిధూసరితశరీరంబుతోడ వాడవాడలం బరువులు పెట్టుచు వెండి
యునుం గ్రీడ లాడుచున్న లేఁగదూడలతోఁకలు వీఁకలం బట్టుకొని వెనుచనిన
నవి యఱచుచుం డుల్లమల్లాడుచుం బాఱిపోయినఁ బోనీక యాఁగియును పితికి
తెచ్చి పసిండిభాండంబులనిండంబోసిన పాలలోనఁ దననీడ చూచి బూచి వచ్చెనని
విచ్చలవిడిఁ బెచ్చు పెరిగి నెచ్చెలులతోడం జెప్పియును చిలికి చిలికి వెలికి వచ్చిన
గొల్లగుబ్బెతలమొఱంగి పెరుంగుబోనలోనం దనపాదంబులు వెట్టి బిట్టు వెద
చల్లియును గోవులం గావంబోయినమగల తగులున కాసపడి నిజకుటీరద్వారం
బులకవాటంబులు వాటంబులు చేసి చనిన జవరాండ్రయిండ్లు సొచ్చి సమస్తం
బును విధ్వస్తంబు చేసియును ఏమఱించివచ్చి కాఁగుచున్న కాఁగులమీఁదిమీఁ
గడలు మెల్లమెల్లనె పుడుక వెరఁజి యారగించియును మందపాలకుంబోయిన
యిందువదనలమందిరంబులు మొఱంగి సొచ్చిన నెఱింగి పొరుగులచంచలాక్షు
లదలించుచుఁ జిట్టకంబులకుఁ బట్టుకొనవచ్చిన మచ్చికలతోడి యిచ్చకంబులు
చేసియును పసులమందకుం బోవువ్రేతలు తనకు నందరాకుండ కుండలం బెట్టి
యుట్టిమీఁద నిడినవెన్న యులూఖలంబులు దాపులుగా నిడి యెక్కి నిక్కి
యందుకొని యన్నయుం దానును గడుపుకొలందియు నారగించియు ఇట్లు
బహుప్రకారంబులఁ గపటబాలక్రీడ లాడుచున్న నీలవర్ణుదుండగంబులకు వేసఱి
యొక్కనాడు.[1]

126


తే.

వెన్నుఁ డొకయింటిలో జొచ్చి వెన్న దినఁగ, నెఱిఁగి కొందఱు గోపిక లేగుదెంచి
వీఁడె కృష్ణుఁడు పెనుదుండగీఁడు మనకుఁ, జిక్కెఁ బోనీకుఁడీ యంచుఁ జేరవచ్చి.[2]

127


తే.

పట్టవచ్చినఁ గనుఁ బ్రామి పాఱిపోయి, జననియంకతలంబున సాధువృత్తి
ముద్దుచూపుచు నొయ్యారమున నటింప, గోపకాంతలు గుంపులు గూడివచ్చి.[3]

128

గోపికలు శ్రీకృష్ణునిదుండగములు యశోదతోఁ జెప్పుట

ఆ.

అయ్యశోదఁ జూచి యమ్మ దయ్యపుబిడ్డ, నెట్లుగంటి కృష్ణుఁ డెదురులేక
వచ్చి వెన్న లెల్ల మ్రుచ్చిలుచున్నాఁడు, మమ్ము నిండ్లలోన మనఁగనీక.

129
  1. గోకరీషధూళిధూసరితశరీరంబుతోడన్ = ఎండినఆవుపేఁడ వల్లనైనదుమ్ము చుట్టుకొనుటచేత ఇంచుక తెల్లనైన దేహముతో, వీఁకలన్ = నిక్కులతో, డుల్లన్ = వీడ, మల్లాడుచున్ = పెనగులాడుచు, ఆఁగియును = నిలిపియు, గుబ్బెతలన్ = స్త్రీలను, మొఱఁగి = ఏమఱించి, తగులునకున్ = కూటమికి, కుటీర = గుడిసెలయొక్క, వాటంబులు చేసి = ఓరవాకిలిగా వేసికొని, జవరాండ్ర = యౌవనస్త్రీలయొక్క, విధ్వస్తంబు = పాడు, పెరఁజి = ఊడ్చియెత్తి, చిట్టకంబులకున్ =- వేడుకలకు, ఇచ్చకంబులు = ప్రియములు, ఉలూఖలంబులు = ఱోళ్లు, దాపులు = సమీపములు, పా, తాఁపలు = మెట్లు, దుండగంబులకున్ = దుష్టచేష్టలకు.
  2. దుండగీఁడు = దుష్టుఁడు.
  3. కనుఁబ్రామి = ఏమరించి, అంకతలంబులన్ = తొడమీఁద.